డబ్బు ప్రియుడు | Money Lover Story | Sakshi
Sakshi News home page

డబ్బు ప్రియుడు

Published Thu, Feb 6 2020 12:39 AM | Last Updated on Thu, Feb 6 2020 5:22 AM

Money Lover Story - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మూడేళ్ల క్రితం.
‘జీవన్‌. సారీ. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను’ అంది ఫోన్‌లో ఇందు.
అప్పుడు టైమ్‌ ఆమెకు మధ్యాహ్నం. అతనికి అర్ధరాత్రి. ఆమె హైదరాబాద్‌లో ఉంది. అతడు శాన్‌ఫ్రాన్సిస్కోలో.
అతడు మౌనంగా వింటున్నాడు.
‘అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒకవైపు నువ్వు వెళ్లిపోతున్నావ్‌ అన్న బాధ. మన ప్రేమ నిలబడుతుందో లేదోనని భయం. మరో వైపు నువ్వు అమెరికా వెళ్లడానికి నన్ను పదేపదే డబ్బు సాయం అడుగుతున్నావు. ఇవ్వాలో వద్దో తెలియదు. అమెరికాకు వెళ్లాక సెటిలయ్యి పెళ్లి చేసుకుంటాను అన్నావ్‌. ఆ మాట నిలబెట్టుకుంటావో లేదోనని సందేహం. నువ్వు నన్నేమైనా మోసం చేయదలిచావా? అందుకే డబ్బు అడుగుతున్నావా అని నీకు రెస్పాండ్‌ కాలేదు. ఐయాం సారీ’ అందామె.
‘రెండేళ్ల తర్వాత ఇది చెప్పడానికి కాల్‌ చేశావా’ అన్నాడు జీవన్‌.
‘అవును. నీ గురించి మొన్నో ఫ్రెండ్‌ చెప్పింది. అమెరికాలో నువ్వు బాగున్నావని.. కష్టపడి పని చేసి  సెటిల్‌ అయ్యావని.. గర్ల్‌ఫ్రెండ్స్‌ ఎవరూ లేరని చెప్పింది. అంటే నేనే నీ మనసులో ఉన్నానని అర్థమైంది’
‘ఇందూ... నేను అమెరికాకు వెళ్లాలనుకున్నప్పుడు లోన్‌ డిలే అయ్యింది. నాన్న పొలం అమ్ముదామనుకుంటే కొంటానన్న వ్యక్తి కొంత అడ్వాన్స్‌ ఇచ్చి ఆ తర్వాత మానుకున్నాడు. అప్పటికే నువ్వు జాబ్‌ చేస్తున్నావ్‌. మీ పేరెంట్స్‌ నీ మీద  ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ చేశారని నువ్వే చెప్పావ్‌. మనం పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి ఆ మాత్రం హెల్ప్‌ అడగొచ్చనుకున్నాను. కాని తప్పుగా అర్థం చేసుకున్నావ్‌. జర్నీ డేట్‌ పెరిగే కొద్దీ నేను నిన్ను తొందరపెట్టాను. తొందరపెట్టే కొద్దీ నువ్వు అనుమానించావు. ఏం పర్లేదు. ఇట్స్‌ ఓకే’...
‘జీవన్‌..’
‘చెప్పు’..
‘మనం పెళ్లి చేసుకుందాం. నీతో బ్రేకప్‌ తర్వాత నేను మరొక రిలేషన్‌లోకి వెళ్లలేదు. నీకు తెలుసుగా... నేను చాలా రిజర్వ్‌గా ఉంటాను. అందువల్లనేమో నన్నెవ్వరూ అప్రోచ్‌ కాలేదు.’
‘నాకు నీ మీద ప్రేమ ఇంకా చావలేదు ఇందూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. కాని ఈ ఫోన్‌ నువ్వు కనీసం నెల ముందు చేయాల్సింది’
‘ఏమైంది?’ ఆందోళనగా అడిగింది.
‘నెలక్రితమే నా ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. మరో టూ వీక్స్‌లో హైదరాబాద్‌లోనే నా పెళ్లి. చెప్పు... ఏం చేద్దాం’
ఇందు ఏం మాట్లాడలేదు.
మాట్లాడటానికి ఏం లేదు కూడా.
∙∙∙
మూడేళ్ల తర్వాత.
‘ఇందు... ఒక్క 25 ల్యాక్స్‌ ఉంటే చాలా బాగుంటుంది’ అన్నాడు రాకేష్‌.
‘ఏం?’ అడిగింది ఇందు.
‘మా ఫ్రెండ్స్‌ నలుగురు ఒక చిన్న రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ చేస్తున్నారు. ఒక ఫిఫ్టీ పెడితే ఒన్‌ ఇయర్‌లో ఒన్‌ క్రోర్‌ వస్తాయని అంటున్నారు. నా దగ్గరున్న సేవింగ్స్‌ నుంచి కొంత ఇంకో ఫ్రెండ్‌ని అడిగి కొంత 25 చేశాను. ఇంకో 25 కావాలి. తిరుపతిలో ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ బాగుంది. ఏం చేద్దాం’ అన్నాడు రాకేష్‌.
అతడు ఇందూకు పరిచయమయ్యి ఆరు నెలలు. ఫేస్‌బుక్‌లో ఒకరోజు ఎర్లీ మార్నింగ్‌ కాఫీ కప్పుతో ఫ్లాట్‌లోని పూల కుండీల దగ్గర కూచుని ఫొటో పెట్టింది. అతడు ఇంత పొడుగు కవిత్వం కామెంట్‌లో పెట్టాడు. ఆ తర్వాత ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టాడు. తిరుపతిలో ఆయుర్వేదిక్‌ డాక్టర్‌. కుటుంబ బాధ్యతల వల్ల ఇంకా పెళ్లి చేసుకోలేదట. చూడటానికి బాగానే ఉన్నాడు. అతడి వాల్‌ మీద చూస్తే శాస్త్రీయ సంగీత గాయకుల వీడియో క్లిప్పింగ్స్, అల్లోపతిలో ఉండే అపసవ్యతలను ప్రశ్నించే వ్యాసాల క్లిప్పింగ్స్, ట్రావెలర్‌గా తాను వెళ్లిన స్థలాల ఫొటోలు ఉన్నాయి.
‘మంచివాడే’ అనుకుంది.
మాట కలిసింది. మాట పెరిగింది. మాట గంటల గంటలు కొనసాగింది. ‘త్వరలోనే మనం పెళ్లి చేసుకుందాం’ అన్నాడతను.
మరో రెండు వారాలకు ఈ ప్రమోజల్‌.
‘నీకు కుదరకపోతే వద్దులే. ఇబ్బంది పడకు’ అన్నాడు మరుసటిరోజు ఫోన్‌. ఆ గొంతు మామూలుగానే ఉన్నా డిజప్పాయింట్‌గా ఉందేమోనని ఇందుకు అనిపించింది. ఇలాంటి ప్రస్తావన వల్లే ఒక ప్రేమ కోల్పోయాను.. మరో ప్రేమ కోల్పోకూడదు అని అనుకుంది.
‘నేను ఇస్తానులే’ అంది రాకేష్‌తో.
ఇందూకు తల్లిదండ్రులు కొన్న సొంత ఫ్లాట్‌ ఉంది. ఈ మధ్యే ఇన్‌వెస్ట్‌మెంట్‌గా ఇంకో ఫ్లాట్‌ కొని అద్దెకు ఇచ్చింది.. దానిపై లోన్‌ నడుస్తోంది. అయినా తన దగ్గర పది లక్షల వరకూ ఉన్నాయి. తండ్రి రిటైరయ్యి పి.ఎఫ్‌ వచ్చింది. ఆ డబ్బులో నుంచి పదిహేను లక్షలు అడగాలనుకుంది. 
‘ఎందుకమ్మా?’ అన్నాడు తండ్రి.
‘తిరుపతిలో స్థలం ఉందట నాన్నా. నా ఫ్రెండ్‌ చెప్పింది. కొంటే మంచి రేట్‌ వస్తుందట’ అని చెప్పింది.
కూతురు జాగ్రత్తగా ఉంటుంది అని తండ్రికి తెలుసు. అలా ఎప్పుడూ డబ్బు అడగలేదు కూడా. ఒక్క నిమిషం కూడా సందేహించకుండా చెక్‌ ఇచ్చాడు. అదీ ఇదీ కలిపి మొత్తం పాతిక.
పోయాయి.
ఆ తర్వాత రాకేష్‌ ఫోన్‌ ఎత్తలేదు. కనిపించలేదు. మాట్లాడలేదు. ఫేస్‌బుక్‌లో అతని అకౌంట్‌ లేదు. తెలిసినవారి ద్వారా వాకబు చేస్తే తిరుపతిలో ఆ పేరుతో ఆయుర్వేదిక్‌ డాక్టర్‌ ఉన్న ఆనవాలే లేదని చెప్పారు.
పోలీస్‌ కేసు పెట్టడం, ఇంట్లో చెప్పడం ఇవన్నీ పెద్ద రాద్ధాంతాలు. ఎలాగూ జరుగుతాయి. జరిగాయి. కాని తన రెండు నిర్ణయాలు తనని దెబ్బ తీయడంతో ఇందూ కుంగిపోయింది. తీవ్రమైన నిరాశలోకి వెళ్లిపోయింది. వయసు 30కి చేరుకుంది. రెండు ప్రేమలూ భంగపరిచాయి. ఇక బతికి ఏం లాభం వరకూ వెళ్లింది. సరిగా అప్పుడు తల్లిదండ్రులు మేలుకొని ఆమెను సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకువచ్చారు. అంతా విన్న సైకియాట్రిస్ట్‌ ఇందూతో మాట్లాడాడు.
∙∙∙
‘రెండు సందర్భాల్లోనూ తప్పు నీది కాదమ్మా. డబ్బుది’ అన్నాడు సైకియాట్రిస్ట్‌.
ఇందూ ఆయన వైపు చూసింది.
‘ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య సంభవించేది. అది ఒక మానసికమైన బంధం. ఆ బంధంలో ఇద్దరికీ సంబంధించిన ఒక ఊహాజగత్తు, సంతోషం, పారవశ్యం ఉంటాయి తప్ప ఇహలోకపు విషయాలు పట్టవు. నీ ప్రేమలో డబ్బు ప్రస్తావన వచ్చేసరికి నువ్వు కన్ఫ్యూజ్‌ అయ్యావు. పెళ్లి తర్వాత ఆ ప్రస్తావన వస్తే ఇబ్బంది లేదు. పెళ్లికి ముందు రావడంతో ఎలా జడ్జ్‌ చేయాలో నీకు తెలియలేదు. అసలు ప్రేమ ప్రేమను అడుగుతుంది తప్ప డబ్బు అడుగుతుందా? ఒక వేళ అడిగితే ఆ ప్రేమ పెద్దల వరకూ వచ్చిందని అనుకోవాలి. నీ అమెరికా ఫ్రెండ్‌ నిన్ను డబ్బు అడిగినప్పుడు అతని తల్లిదండ్రులు, నీ తల్లిదండ్రులు మాట్లాడుకుని ఆ సహాయం ఇచ్చిపుచ్చుకని ఉంటే బాగుండేది. నువ్వూ అతనూ ఆ ప్రయత్నం చేయలేదు. దాని వల్ల అపనమ్మకం వచ్చింది.  నీ ప్రేమ పోయింది.

తిరుపతి కుర్రాడు అడిగినప్పుడైనా నువ్వు అతని గురించి అతని పెద్దల గురించి ఆలోచించలేదు. ఇన్వెస్ట్‌మెంట్‌ అన్నప్పుడు స్వయంగా తిరుపతి వెళ్లి చూడలేదు. చెక్‌ చేయలేదు. నమ్మకం ఎంత ఉన్నా ఇలాంటి విషయాల్లో భాగస్వామ్యం ఉండటం తప్పు కాదు కదా. అదీ నువ్వు చేయలేదు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. పాతిక లక్షలు నష్టపోయినా ధైర్యంగా ఉన్నావు. ఊళ్లలో  బైక్‌ కొనుక్కోవాలని బాయ్‌ఫ్రెండ్, సెల్‌ఫోన్‌ కొనుక్కోవాలని గర్ల్‌ఫ్రెండ్‌... గర్ల్‌ఫ్రెండ్స్‌కు గిఫ్ట్స్‌ కొనివ్వాలని బాయ్‌ఫ్రెండ్స్‌ తెలిసీ తెలియక శక్తి లేకపోయినా డబ్బు ఇన్వాల్వ్‌ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నవారు ఉన్నారు.  బాధపడకు. కెరీర్‌ మీద దృష్టిపెట్టు. బెంగళూరు ట్రాన్స్‌ఫర్‌ వచ్చింది అంటున్నావుగా వెళ్లు. ఈ గాయం మానిపోనీ. భవిష్యత్తులో నీకు ఏమనిపిస్తే అది చెయ్‌. మళ్లీ పెళ్లి చేసుకునే స్థాయి ప్రేమ ఎదురైతే వెంటనే పెద్దవాళ్లను ఇన్‌వాల్వ్‌ చేయి. ఒక దశ వరకే మీరిద్దరూ చేసే క్యాండిల్‌లైట్‌ డిన్నర్స్‌ బాగుంటాయి. తర్వాత ఫ్యామిలీ డిన్నర్స్‌ చేయాలి. అవి పెళ్లి విందుకు దారి తీసేలా చూసుకోవాలి. నా సలహా పనికొస్తుందనే అనుకుంటున్నాను’ అన్నాడు సైకియాట్రిస్ట్‌.
ఇందు కొంత కోలుకుంది. 
మరుసటి రోజు ఫేస్‌బుక్‌లో ఆమె తాజా ఫొటోను చాలామంది చూశారు.

– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement