మనీ మేనేజ్‌మెంట్‌లోనూ ‘విన్’ ఫ్రే.. | Money Management 'Win' the fray .. | Sakshi
Sakshi News home page

మనీ మేనేజ్‌మెంట్‌లోనూ ‘విన్’ ఫ్రే..

May 16 2014 11:24 PM | Updated on Apr 4 2019 3:21 PM

మనీ మేనేజ్‌మెంట్‌లోనూ ‘విన్’ ఫ్రే.. - Sakshi

మనీ మేనేజ్‌మెంట్‌లోనూ ‘విన్’ ఫ్రే..

దుర్భర దారిద్య్రం నుంచి స్వయంకృషితో కోట్లకు పడగలెత్తే దాకా ఓప్రా విన్‌ఫ్రేది స్ఫూర్తిదాయకమైన పయనం. ప్రస్తుతం దాదాపు 290 కోట్ల డాలర్ల సంపదతో ఆఫ్రికన్ అమెరికన్లలో

ఓప్రా విన్‌ఫ్రే..
 
దుర్భర దారిద్య్రం నుంచి స్వయంకృషితో కోట్లకు పడగలెత్తే దాకా ఓప్రా విన్‌ఫ్రేది స్ఫూర్తిదాయకమైన పయనం. ప్రస్తుతం దాదాపు 290 కోట్ల డాలర్ల సంపదతో ఆఫ్రికన్ అమెరికన్లలో ఆమె అత్యంత సంపన్నురాలిగా ఉన్నారు. టాక్ షో వ్యాఖ్యాతగా, నటిగా, ప్రొడ్యూసర్‌గా అనేక పాత్రలు పోషిస్తున్న ఓప్రా విన్‌ఫ్రే.. క్వీన్ ఆఫ్ ఆల్ మీడియాగా పేరొందారు.

సుమారు పాతికేళ్ల పాటు (1986 నుంచి 2011 దాకా) సాగిన ది ఓప్రా విన్‌ఫ్రే షో  అమెరికా టెలివిజన్ చరిత్రలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.  ఇలాంటి వాటి ద్వారా  కోట్లు ఆర్జించినా.. డబ్బు విలువ గురించి గుర్తెరిగి వ్యవహరిస్తారు ఓప్రా. కొంత రిస్కు చేసి కొత్త వ్యాపారాలు చేపట్టినా .. రియల్టీ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసినా ఓప్రాది విభిన్న శైలి. కేవలం టాక్‌షోలకు పరిమితం కాకుండా ఆమె స్వయంగా హార్పో (ఇంగ్లిష్‌లో ఓప్రాను తిరగేస్తే వచ్చే పేరు) పేరిట ప్రొడక్షన్ కంపెనీని ఏర్పాటు చేశారు. దీంతో ఓప్రాకు గణనీయంగా ఆదాయం వస్తుంటుంది. అలాగే, ‘ఒ’ పేరుతో ఏర్పాటు చేసిన మ్యాగజైన్ ఓప్రాకు ఏటా మిలియన్లకొద్దీ ఆదాయం తెచ్చిపెడుతోంది.
 
దాదాపు కొన్నాళ్ల క్రితం భారీ బహుళ అంతస్తుల భవంతిలో సుమారు మూడు మిలియన్ డాలర్లు పెట్టి ఏకంగా నాలుగు ఫ్లాట్లను కొన్నారామె. వాటి విలువ ప్రస్తుతం 12 మిలియన్ డాలర్లు పలుకుతోంది. ఆ రకంగా స్వల్ప వ్యవధిలోనే దాదాపు 9 మిలియన్ డాలర్లు ఆర్జించారు. అలాగే మరో ప్రాంతంలో రెండు మిలియన్ డాలర్లకు కొన్న ఇంటిని 3.25 మిలియన్ డాలర్లకు అమ్మేసి మిలియన్ డాలర్లు లాభం అందుకున్నారు.

వీటిలో ఎలాగైతే లాభాలు అందుకున్నారో.. అధిక ధరల్లో కొన్న కొన్ని కలసి రాని ప్రాపర్టీలను కాస్త తక్కువ రేటుకే అమ్మేశారు కూడా. ఓన్ పేరిట ఏర్పాటు చేసిన మీడియా సంస్థను భారీ నష్టాల్లో నుంచి మళ్లీ లాభాల్లోకి మళ్లించారు. ఇంత సంపదను మేనేజ్ చేయడం చాలా కష్టతరం అవుతుండటంతో ఇటీవలే తన పెట్టుబడులను పర్యవేక్షించడం కోసం ప్రత్యేకంగా వ్యక్తిగత ప్లానర్లను కూడా నియమించుకున్నారు ఓప్రా.

కేవలం ధనార్జనకే పరిమితం కాకుండా ..  పేదరికంలో మగ్గిపోతున్న వారికి తన వంతు సాయం చేస్తూ.. దానగుణాన్నీ చాటుకుంటున్నారు. ఇలా జరిగితే ఎలా.. అలా జరిగితే ఎలా అని బాధపడాల్సిన అవసరం లేకుండా మనసు హాయిగా ఉండటమే ఆర్థిక స్వేచ్ఛ అంటారు ఓప్రా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement