దత్తపుత్రిక రఘువంశికతో స్మృతి
కృష్ణుడిని యశోద పెంచింది. యశోదా నందనుడిగానే జీవించాడు. అయితే... కన్నతల్లి దేవకి అనే వాస్తవాన్ని కృష్ణుడి దగ్గర దాచలేదెవ్వరూ. దేవకి కడుపులో పుట్టిన తనను యశోద పెంచిందనే ఎరుకతోనే పెరిగాడు కృష్ణుడు. ఒక తల్లి కడుపున పుట్టి, మరో తల్లి ఒడిలో పెరిగే ప్రతి బిడ్డకీ ఆ వాస్తవం తెలియాలి. ‘ఊహ తెలియని వయసులో దత్తత తల్లి ఒడిని చేరినప్పటికీ, ఊహ తెలిసిన తరువాత లేదా లోకం తెలిసేవయసు వచ్చాక పిల్లలకు ఆ నిజాన్ని చెప్పి తీరాలి’ అంటున్నారు స్మృతి. స్మృతి పుణెలో ఉంటా రు. వయసు 37 ఏళ్లు. ఎలక్ట్రికల్ ఇంజనీర్. కొంతకాలం యూరప్‌లో వికీమీడియా ఫౌండేషన్‌లో పని చేసి 2014లో ఇండియాకి వచ్చేశారు. ఇద్దరు పాపాయిలను దత్తత తీసుకున్నారు. ఆమె దత్తత తీసుకునే నాటికి ఒక పాపకు ఆరేళ్లు, మరొక పాపాయికి ఐదేళ్లు. ఇప్పుడామె దత్తత గురించి సమాజంలో నెలకొని ఉన్న అపోహలు తొలగించడానికి, పిల్లలు లేని భార్యాభర్తలను చైతన్య వంతం చేయడానికే పూర్తి సమయాన్ని కేటాయించారు.
దత్తతకు ఆవైపు ఈవైపు
దత్తత అనే మాటకు... మనందరిలో ఒక అభిప్రాయం స్థిరపడిపోయి ఉంది. పిల్లలు లేని భార్యాభర్తలకు పిల్లలు లేని లోటును భర్తీ చేయడానికే దత్తత అనుకుంటాం. వాళ్లకు అమ్మానాన్నా అనే పిలుపు కోసమే అనీ అనుకుంటాం. కానీ దత్తత అంటే.. తనకంటూ ఇల్లు, కుటుంబం లేని బిడ్డకు ఓ కుటుంబాన్ని ఇవ్వడం కూడా. పిల్లలు లేని వారికి ఓ బిడ్డను ఇచ్చి వారిలో సంతోషాన్ని పెంచడం ఒక కోణం అయితే, తల్లిదండ్రులు లేని ఓ బిడ్డకు... అమ్మా, నాన్నలతో ఓ కుటుంబాన్నివ్వడమే మహోన్నతమైన పని. రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య వారధి కట్టి ఆ ప్రపంచాలను దగ్గర చేయడం.చూడనట్లు వెళ్లిపోకండి‘‘మనదేశంలో ఈ వారధి పటిష్టం కావాల్సిన అవసరం చాలా ఉంది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను షెల్టర్‌లకు చేర్చడానికి తెలిసిన ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. కన్న తల్లిదండ్రులు లేని కారణంగా ఏ బిడ్డ జీవితమూ అగమ్యంగా, అలక్ష్యంగా మారకూడదు. పుట్టిన ప్రతి బిడ్డకు జీవించే హక్కు ఉంది. చక్కగా పెరిగి, చదువుకుని ఇష్టమైన వృత్తిలో స్థిరపడి ఫలవంతమైన జీవితాన్ని జీవించే హక్కు కూడా ఉంది. పిల్లలను పోషిస్తూ, దత్తతకు పిల్లలు కావాలని వచ్చే వారితో అనుసంధానం చేయడానికి అనేక సంస్థలున్నాయి’’ అని చెబుతారు స్మృతి. మరో విషయాన్ని ఆమె తరచూ గుర్తు చేస్తుంటారు. అదేంటంటే..
ఆ తండ్రి జాడలేదు
పుణెలో జాయ్ ఫౌండేషన్‌తో కలిసి పని చేస్తున్నారు స్మృతి. అక్కడికి ఓ వ్యక్తి కొన్ని ఏళ్ల కిందట మూడు నెలల పాపాయితో వచ్చాడు. తన భార్య చనిపోయిందని చెప్పి, మళ్లీ పెళ్లి చేసుకున్న తర్వాత బిడ్డను తీసుకెళ్తానని, అప్పటి వరకు సంరక్షించమని కోరాడు. ఏళ్లు గడిచినా అతడు రాలేదు. పెళ్లి చేసుకున్నాడో లేదో తెలియదు. ఆ పాపాయి చక్కగా పెరుగుతోంది. అయితే ఆమెను ఎవరికైనా దత్తత ఇవ్వాలంటే నిబంధనలు ఒప్పుకోవు. తండ్రి వచ్చి తన బిడ్డను ఇవ్వమన్నప్పుడు ఇవ్వగలగాలంటే... ఆ బిడ్డను దత్తత ఇవ్వకూడదు. ఆ తండ్రి వస్తాడో రాడో తెలియదు. ఎలా మరి? ఆచరణలో ఎదురయ్యే ఇలాంటి కొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు స్మృతి. ఆ బిడ్డకు మంచి జీవితాన్నివ్వగలిగిన అవకాశం ఉండి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అది. ఇలాంటి పిల్లల విషయంలో తల్లి, తండ్రి లేదా సంరక్షకులు (ఎవరైతే షెల్టర్‌లో చేరుస్తారో వారు) సంవత్సరాల పాటు బిడ్డ కోసం రాకపోతే, షెల్టర్ హోమ్స్ ఆ పిల్లలను దత్తత ఇవ్వవచ్చు అని సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ నియమావళిలో మార్పులు చేయవచ్చని స్మృతి సూచించారు. ఆ సూచన పరిశీలనలో ఉంది.
మనసు విశాలం అవ్వాలి
దత్తత కోసం వచ్చే తల్లిదండ్రులకు స్మృతి వేడికోలు ఒక్కటే. ‘‘స్వల్ప అనారోగ్యాలు, మెల్లకన్ను వంటి చిన్న లోపాలు ఉన్న పిల్లలను కూడా దత్తత తీసుకోండి. వారికి వైద్యం చేయించగలిగిన ఆర్థిక స్థోమత మీకున్నప్పుడు అలాంటి పిల్లలను మెరుగ్గా మార్చగలిగిన అవకాశం మీ చేతులో ఉన్నప్పుడు ఆ మేరకు కొంత మీ మనసును విశాలం చేసుకోండి’’ అని అభ్యర్థిస్తున్నారు స్మృతి. ఆమె కౌన్సెలింగ్‌తో కన్విన్స్ అయిన ఒక జంట కాలు లేని పిల్లవాడిని దత్తత తీసుకుని ఆపరేషన్ చేయించి కృత్రిమ కాలు పెట్టించిన సంగతిని కూడా ఆమె గుర్తు చేస్తారు. అలాగే పెద్ద పిల్లలను కూడా దత్తత తీసుకోవలసిందిగా మరీ మరీ చెబుతుంటారు. పెద్ద పిల్లలను దత్తత తీసుకుంటే వాళ్లు తమను అసలైన తల్లిదండ్రులుగా స్వీకరించలేరేమోననే భయం దత్తత తీసుకునే వాళ్లను వేధిస్తుంటుంది. నిజానికి అలాంటిదేమీ ఉండదని, అందుకు తానే నిదర్శనం అంటారు.. తనే పిల్లలకు దత్తతగా వెళ్లిపోయానని ఎప్పుడూ చెబుతుండే.. ఈ మాతృమూర్తి చిరునవ్వులు చిందిస్తూ.
అమ్మా.. మా అమ్మ ఎవరు?
‘నేను దత్తత తీసుకున్న చిన్న పాపాయి ఏమీ అడగదు, కానీ పెద్ద పాపాయి అడిగింది... అమ్మా! నాకు నువ్వు అమ్మవు అయ్యే వరకు నాకు అమ్మ ఎవరు? అని. తనకు వివరంగా చెప్పాను. ఆ ప్రశ్నకు ముందు ఎలా ప్రేమగా ఉండేదో ఆ తర్వాతా అలాగే ఉంది నాతో. కాబట్టి పిల్లలు పేరెంట్స్‌గా రిసీవ్ చేసుకోరనే భయం వద్దు. ఊహ తెలిసిన పిల్లలను కూడా దత్తత తీసుకోండి’ అని కోరుతున్నారామె. అలాగే దత్తత తీసుకున్న తల్లులు అంతటితో ఆగిపోకుండా సమాజంలో దత్తత మీద ఉన్న అపోహలను తొలగించే బాధ్యతను కూడా తీసుకోమని అభ్యర్థిస్తుంటారు స్మృతి.
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment