వచ్చింది మర్చిపోయేలా చేసిన సినిమా... | Nawaz boom | Sakshi
Sakshi News home page

వచ్చింది మర్చిపోయేలా చేసిన సినిమా...

Published Fri, Jul 24 2015 10:23 AM | Last Updated on Sun, Sep 3 2017 6:02 AM

వచ్చింది మర్చిపోయేలా చేసిన సినిమా...

వచ్చింది మర్చిపోయేలా చేసిన సినిమా...

దీలో హవా చల్ రహా హై అంటే...
వాడి టైమ్ బాగుంది అన్నట్టు!
‘నవా హవా’ అంటే కొత్తగాలి వీస్తోందని!
అయినా కొండ అడ్డం ఉంటే గాలి ఎలా వీస్తుంది?
నవాజ్ సిద్దిఖి కూడా అలాగే ఆలోచించాడు.
అమ్మ ఆశీర్వాదం అన్న ఉలి పట్టుకుని
నమ్మకం అన్న ఒక సుత్తిని సంపాదించి
ఏకంగా ఆ కొండనే తవ్వేశాడు.
ఇది నవాజ్ నిజజీవితంలో కథ...
తను నటించిన ‘మాంఝీ’ సినిమా కథ కూడా!
నేనేదో పుట్టను పర్వతం చేస్తున్నాననుకుంటే...
క్లారిటీ కోసం ఈ కొండ గాలిని స్పృశించి చూడండి.

 
వచ్చే నెల బాలీవుడ్‌లో ఒక సినిమా రిలీజ్ కానుంది.
పేరు ‘మాంఝీ’.
కొండను లొంగదీసిన ఒక అసామాన్యుడి కథ అది.


బిహార్‌లోని గయ దగ్గర దారికి అడ్డంగా ఉండే కొండ వల్ల దశరథ్ మాంఝీ అనే రైతుకూలీ భార్య సకాలంలో వైద్యం అందక మరణించింది.కొండ లేకుంటే పట్టణానికి దారి దగ్గరయ్యేది. కొండ వల్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడంతో ప్రమాదంలో ఉన్నవారి ప్రాణం పోతోంది. దీనిని ఆపాలి అనుకున్న మాంఝీ కొండ మీద తిరగబడ్డాడు. ఎందరు హేళన చేస్తున్నా వినకుండా కేవలం ఒక సుత్తీ శానంతో 22 ఏళ్ల పాటు ఒక్కడే దారిని తొలిచి పల్లెకూ పట్టణానికి మధ్య దూరాన్ని  55 కిలోమీటర్ల నుంచి 15 కిలోమీటర్లకు తగ్గించాడు.
 అందుకే  అందరూ అతణ్ణి ‘మౌంటేన్ మేన్’ అని కీర్తించారు.అయితే ఆ పాత్రను పోషించిన నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా అంతకు ఏ మాత్రం తక్కువ కాదు.
     
జేబులో రూపాయి లేదు. ఊరి నుంచి డబ్బు అందుతుందిలే అనుకోవడానికి ఉత్తరప్రదేశ్‌లోని పల్లెలో ఉన్న తల్లిదండ్రులకే తినడానికి తిండి లేదు. తను పెద్ద కొడుకు. ఏదైనా సంపాదించి పెట్టాల్సింది పోయి మిగిలిన ఎనిమిది మంది తోబుట్టువులను వాళ్ల భారానికే వదిలిపెట్టి వచ్చే
 శాడు. ముంబైలో ఎవరూ తెలియదు. వేషం కావాలి సార్ అని అడిగితే- రంగు తక్కువగా పొట్టిగా ఉత్త పల్లెటూరి బైతులా ఉన్న ఇతణ్ణి చూసి ప్రతి ఒక్కరూ ఈసడించడమే. రూమ్మేట్‌కు వంట వండే షరతు మీద కొంతకాలం రూమ్ సంపాదించాడు. నటన నేర్పిస్తానంటూ వర్క్‌షాప్‌లు పెట్టి యాభై వంద వస్తే పొట్ట పోసుకున్నాడు. పేవ్‌మెంట్ మీద దనియాలు అమ్మాడు. ఎక్స్‌ట్రా వేషాలు కట్టి గుంపులో గోవిందయ్యగా బతికాడు. నిజంగా చాలా కఠినమైన రోజులు అవి. భవిష్యత్తు అనే పర్వతానికి మొదలేదో మొన ఏదో తెలియని రోజులు.
 తల్లి అప్పుడప్పుడు ఉత్తరం రాసేది.

ఏరా.. ఏదైనా చాన్స్ దొరికిందా... లేదమ్మా... దొరుతుందిలే అని జవాబు రాసేవాడు. తల్లి ధైర్యం చెబుతూ మళ్లీ రాసేది.ఏం కాదులేరా... చెత్తను కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకు ఎత్తి పారేస్తారు. నువ్వు మనిషివి. నీకు అవకాశం రాకుండా ఉంటుందా అని చెప్పేది. అది అబద్ధమే. కొడుక్కి ధైర్యం చెప్పడానికి ఏ తల్లయినా రాసే మాటే. కాని ఆ అబద్ధాన్ని అతడు నమ్మేవాడు. ఎప్పటికైనా తనకూ రోజు వస్తుందని ఎదురు చూసే వాడు. నిజంగానే ఆ రోజు రావడానికి పన్నెండేళ్లు పట్టింది.
    
నీ అభిమాన నటుడు ఎవరు అని అడిగితే ఎవరైనా సరే పెద్ద పెద్ద పేర్లు చెప్పడానికి ఇష్టపడతారు. కాని నవాజుద్దీన్ సిద్దిఖీని అడిగితే ‘దాదా కోండ్కే’ పేరు చెబుతాడు. డబుల్ మీనింగ్ డైలాగులతో సినిమాలు తీసి వరుసగా తొమ్మిది సిల్వర్‌జూబ్లీ హిట్స్ కొట్టి గిన్నెస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కిన మరాఠా సూపర్‌స్టార్ దాదా కొండ్కే. అతడి సినిమాల్లో ఏమున్నా తెర మీద అతడు నటించే తీరు మాత్రం ప్రతి ఒక్కరినీ అబ్బుర పరుస్తుంది. ముజఫర్‌నగర్ జిల్లాలోని సొంత పల్లె బుధానాలో చిన్నప్పుడు కోండ్కే సినిమాలను చూసే నటన మోజులో పడ్డాడు నవాజుద్దీన్. అసలు ఇంత ఈజ్‌గా ఏ మాత్రం ఇన్‌హిబిషన్స్ లేకుండా ఎలా నటించగలడు అని వెర్రెత్తిపోయాడు. చేస్తే ఇలా యాక్ట్ చేయాలి ఇంత ఈజ్‌గా చేయాలి అని నిశ్చయించుకున్నాడు. అప్పుడు పడ్డ పురుగు బిఎస్సీ చదివినా లోపల పురుగు తొలుస్తూనే ఉంది.

 

కొన్నాళ్లు గుజరాత్ ఆయిల్ కంపెనీల్లో కెమిస్ట్‌గా పని చేశాడుగానీ గల్ఫ్ నుంచి వచ్చే క్రూడాయిల్‌ని టెస్ట్ చేస్తూ గడిపే ఆ పనిలో తన జీవితం శిథిలం అయిపోతుందని అనిపించింది. అప్పటికే అక్కడ నటన మొదలెట్టాడు. నాటక సమాజాలలోని మిత్రులు నవాజ్ యాక్టింగ్ గమనించి- నువ్వుండాల్సింది ఇక్కడ కాదు... ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో అక్కడకు వెళ్లు అని సలహా ఇవ్వడం మొదలుపెట్టారు. ఢిల్లీ రానైతే వచ్చాడుగానీ బతకడం ఎలా? గోడ మీద యాడ్ కనిపించింది- సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. పగటి డ్యూటీ అయితే చేస్తాను అని చెప్పి చేరిపోయాడు. పగలు పనికి. రాత్రి నాటకానికి. అలా చదువుకుంటూ నాటకాలు వేసుకుంటూ సెక్యూరిటీ గార్డ్‌గా తినడానికి రొట్టె సంపాదించుకుంటూ 1998 ప్రాంతంలో ముంబై చేరుకున్నాడు.
     
ఏదో స్టూడియోలో ఏదో సినిమా షూటింగ్. డెరైక్టర్ ఎవరు అనడిగితే తెలుగతను పేరు రామ్‌గోపాల్ వర్మ అని చెప్పారు. నేరుగా కలవొచ్చా.. అని అడిగితే కుదర్దు ఆయన అదో టైప్ అని సమాచారం. సరే ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా అక్కడే కుర్చీలో కూచుని సీన్ రాసుకుంటున్న గడ్డం మనిషి కనిపించాడు. పేరు అనురాగ్ కశ్యప్ అట. ఆ సినిమాకు రైటర్ అట. సార్... నాకు వేషం ఇప్పించండి- ఎన్‌ఎస్‌డి నుంచి వచ్చాను అని నవాజ్ అతనికి తను చేసిన ఓ నాటకంలోని బిట్ చేసి చూపించాడు. అతడికి నచ్చింది. సిగరెట్ ఆఫర్ చేస్తూ- మిత్రమా... నువ్వు ఎక్కడ ట్రైన్ అయ్యావనేది నాకు అనవసరం. ఎంత బాగా చేయగలవు అనేదే ముఖ్యం. నువ్వు బాగా చేస్తున్నావు. కాని నా ఖర్మ కొద్దీ నేను కూడా లాటరీలు కొడుతున్నాను. నా రోజులు బాగున్నప్పుడు నీకు తప్పకుండా అవకాశం ఇస్తాను... అన్నాడు. అయితే ఆ అవకాశం వెంటనే రాలేదు.

బొంబాయిలో సినిమా కష్టాలు. భయంకరమైన ఆకలి పస్తులు. తట్టుకోలేక చివరకు యాడ్స్‌లో కూడా  ఎక్స్‌ట్రాగా కనిపించాడు. సచిన్ టెండూల్కర్ నటించిన ఒక యాడ్‌లో వెనుక బట్టలు ఉతుకుతూ ఉండే ధోబీలలో నవాజుద్దీన్ సిద్దిఖ్ ఒకడు. ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు... ఎన్నో సంవత్సరాలు అలా గడిచిపోయాయి. కాని విశేషం ఏమంటే నవాజుద్దీన్ తనను తాను పతనం కాకుండా కాపాడుకున్నాడు. కులరాజకీయాలు, హత్యలు, బందిపోటు దొంగతనాలు ఇవి నిత్యం ఉండే గ్రామంలో పుట్టి పెరిగి కూడా చదువుకోగలిగాడు. రకరకాల వ్యసనాలు, పతనాలు, పలాయనాలు ఉండే ముంబైలో అన్నాళ్లు ఖాళీగా ఉండి కూడా ఏకాగ్రతను కాపాడుకుంటూ ఏ పని కోసం వచ్చాడో ఆ పనికే నిబద్ధుడై ఉన్నాడు. అలాంటి వాడికి తప్పకుండా అవకాశం వస్తుంది. నవాజుద్దీన్‌కి కూడా వచ్చింది. సినిమా పేరు బ్లాక్ ఫ్రైడే.
     
1993 నాటి ముంబై పేలుళ్ల మీద తీసిన సినిమా అది. డెరైక్టర్ అనురాగ్ కశ్యప్. అందులో పోలీసుల చేతికి చిక్కి చిత్రహింసల పాలయ్యే ముస్లిం కుర్రాడి వేషం నవాజ్ చేశాడు. కొద్దిపాటి మాటలే ఉంటాయి. కాని చూసినవాళ్లకు కన్నీళ్లు తిరుగుతాయి. ఇతడెవడో ఈ వేషానికి బాగున్నాడు అని పోలీస్ టార్చర్ ఉన్న ప్రతి వేషానికీ బాలీవుడ్‌లో నవాజుద్దీన్‌ని పిలవడం మొదలుపెట్టారు. అలాంటివే ఆరు వేషాలు వచ్చాయి. ఆ తర్వాత 2010లో పీప్‌లీ లైవ్ వచ్చింది. లోకల్ రిపోర్టర్ రాకేష్‌గా అదరగొట్టాడు. 2011లో మరో రెండు సినిమాలు రిలీజయ్యాయి. కహానీ... గ్యాంగ్స్ ఆఫ్ వాసెపూర్. ఎవరీ పొట్టి మిరపకాయ్ అని అందరూఆశ్చర్యపోయారు. అంతవరకూ ఒకటీ అరా ప్లేట్‌లో పడేస్తూ వచ్చి బాలీవుడ్ ఇండస్ట్రీ  దేశవిదేశాల్లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో నవాజుద్దీన్ నటనకు వచ్చిన ప్రశంసలు చూసి సందేహాలు మాని అతణ్ణి  సంపూర్ణంగా అంగీకరించింది. కాలం పుటం పెట్టడం అంటే ఇదే కాబోలు.

ఒకప్పుడు చిన్న పంచె ముతక చొక్కా  కట్టుకొని తన పల్లెలో పొలాల్లో ఆవారాగా తిరిగిన నవాజుద్దీన్ సిద్దిఖీ 2012 కాన్స్ ఫిల్మ్ ఫిస్టివల్‌లో తన సినిమా ‘మిస్ లవ్‌లీ’ ప్రదర్శన సందర్బంగా రెడ్ కార్పెట్ మీద బ్లాక్ టక్సెడో ధరించి హుందాగా అడుగులు వేశాడు. అమితాబ్ బచ్చన్ పోస్టర్లు ఉన్న తన ఇంటి వీధిలో తన పోస్టర్లు కనిపించేలా చేశాడు. ఇది కొండల్ని పిండికొట్టడం లాంటి పనే. నవాజుద్దీన్ సిద్ధిఖీ చేశాడు.
 ఎందుకంటే తాను ఆ పని చేయగలను అని గట్టిగా నమ్మాడు.
     
ది లంచ్‌బాక్స్, కిక్, బద్‌లాపూర్, బజ్‌రంగీ భాయ్‌జాన్... ఇవన్నీ నవాజుద్దీన్ సిద్ధిఖీ నటన వలన మెరిసిన సినిమాలు. షారూక్ ఖాన్‌తో ‘రయీస్’ రాబోతూ ఉంది. సల్మాన్, షారూక్ తర్వాత ఆమిర్‌ఖాన్‌ను ఛాలెంజ్ చేయడం ఎంత పని? ‘నేను ప్రపంచంలో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకునే నటుణ్ణి కావాలి’ అంటాడు నవాజుద్దీన్.ఎందుకంటే ‘స్టార్ నటుడు కాదు. కాని స్టార్‌కు ఎక్కువ చెల్లిస్తారు. మరి నటుడికెందుకు తక్కువ ఇస్తారు’ అంటాడు. బాలీవుడ్‌లో రాబోయే రోజుల్లో అత్యంత ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసే నటుడిగా నవాజుద్దీన్ సిద్దిఖీ కనిపించవచ్చు. అతడి కోసమే మంచి మంచి సినిమాలు తీయవచ్చు.ఈ ఒడ్డూ ఈ పొడవు ఉన్న వాడు ఇంత చేయగలడా అని అనిపించవచ్చు. నిజమే. నవాజుద్దీన్ ఐదున్నర అడుగుల వాడు మాత్రమే. కాని చేతిలో నటన, నైపుణ్యం అనే సుత్తీ శానంలు ఉన్నాయని గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. అవి ఉన్నవాడికి ఏ పర్వతమైనా ఒక లెక్కా?

 
వచ్చింది మర్చిపోయేలా చేసిన సినిమా...

 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన నవాజుద్దీన్ సిద్ధిఖీ సినిమా ‘మిస్ లవ్‌లీ’. దర్శకుడు అషిమ్ అహ్లువాలియా. బాలీవుడ్‌లో తయారయ్యే సిగ్రేడ్ పోర్నో మూవీల మీద తీసిన సినిమా అది. కథాంశం రీత్యా సినిమాలోని పాత్రలకు బి- గ్రేడ్, సి- గ్రేడ్ ఆర్టిస్టులను తీసుకున్నారు. ముఖ్యపాత్రకు నవాజుద్దీన్‌ని తీసుకున్నారు. మొదటి రోజు డెరైక్టర్ అతడి దగ్గరకు వచ్చి చెప్పాడు- మీకు చాలా వచ్చు. నేర్చుకున్నారు. కాని ఈ సినిమాలో మీ పక్కన ఉన్నది చాలా నాసీరకం నటులు. మీరు ఏమీ చేయకండి. ఏది చేసినా వీళ్ల స్థాయికి దిగి చేయండి అన్నాడు. నేర్చుకున్నదంతా మర్చిపోయి చేయాల్సిన సందర్భం అది. పండితుడు పామరస్థాయి దిగడమే అసలైన పాండిత్యం కదా అంటాడు  నవాజుద్దీన్ ఆ సినిమా చేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ.
 

సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement