తిప్పుసుల్తాన్ | net use | Sakshi
Sakshi News home page

తిప్పుసుల్తాన్

Published Sun, Oct 11 2015 11:59 PM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM

తిప్పుసుల్తాన్

తిప్పుసుల్తాన్

నెట్‌ఇంట్లో
 
ఇదివరకు రెండే ఇళ్లు... ఒకటి పుట్టిల్లు. ఇంకొటి మెట్టినిల్లు... ఇప్పుడు మూడో ఇల్లు కూడా వచ్చేసింది. అదే నెట్టిల్లు...నెట్ ప్రపంచంలో నేలకు కొరత లేదు. రియల్ బూమ్‌ల భూదందాలుండవు. ఇక్కడంతా వర్చువల్! నెట్ ప్రపంచం దుర్యోధనుడి మయసభ లాంటిది. కాలు జారనూవచ్చు. కళ్లు మిరుమిట్లు గొలిపే అద్భుతాలు చూడనూవచ్చు. మనం మంచినే తీసుకుందాం. మంచిగా పంచుకుందాం. నెట్టింట్లో మంచిని నిజం ఇంట్లోకి వైఫై సాయంతో బ్లూటూత్ బాటలోనో డేటా ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. ఏమంటారు?
 
‘‘లేదా రొయ్యకు బారెడు మీసము’’ అని వెక్కిరిస్తే వెక్కిరించవచ్చు గాక...! ‘‘మింగ మెతుకు లేదు... మీసాలకు సంపెంగ నూనె’’ అని వ్యంగ్యం వొలికిస్తే వొలికించవచ్చు గాక..!! ‘‘మీసాలోడురోయ్’’ అని వెటకారం పలికిస్తే పలికించవచ్చుగాక!! ‘‘నీ పోతు గడ్డం... ఛీఛీఛీ నాకడ్డం’’ అని ఆరుద్ర లాంటి వారిని భార్య విమర్శిస్తే విమర్శించవచ్చుగాక!! ఎవరెన్ని అన్నా మీసాల బినే వేరు. గడ్డాల ఘనతే వేరు! అందుకే జర్మనీలోని హోఫెనర్ బియర్డ్ క్లబ్ 1990 నుంచి ప్రపంచ గడ్డం పోటీలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 3, 4న గడ్డం పోటీలు జరిగాయి. జడ్జీలు మాత్రం అందరూ ఆడవారేనట! ఇందులో మూడు కేటగిరీలు - మీసం విభాగం, సగం మీసం సగం గడ్డం విభాగం, పూర్తి గడ్డం విభాగం. ‘‘గంధం చెక్కల వీరప్పన్ చచ్చిపోయాడు కానీ... బతికుంటే ట్రోఫీ మనదే’’ అని బాధపడకండి. పెద్ద మనసు చేసుకుని దీన్లో విజేతలను ‘‘మీసాలా గోపాలా రారా’’ అంటూ వెల్కం చేయండి. మీసాలూ, గడ్డాలూ ‘తిప్పు సుల్తాన్’లకు స్వాగతం చెప్పండి.<http://www.buzzfeed.com/lauragallant/the-hairiest-event-of-2015-so-far#.fu9MMMpGOO>
 
పెళ్లిళ్ల పేరయ్య ః ఫేస్‌బుక్!
అమెరికాలో ఆర్కన్సాస్‌కు చెందిన షుల్లర్ బెన్సన్ ఆరేళ్ల క్రితం అక్టోబర్ నెలలో సెల్‌ఫోన్‌లో ఫేస్‌బుక్ చూద్దామని యాప్‌ను క్లిక్ చేశాడు. ఫేస్‌బుక్ ఓపెనైంది. కానీ తెరుచుకున్నది సెలెస్టీ అనే అమ్మాయి అకౌంట్. లాగౌట్ చేద్దామంటే లాగౌట్ బటన్ కనిపించలేదు. అటు 1600 కి.మీ. దూరంలోని కొలరాడోలో ఉన్న సెలెస్టీ ‘ఎవరయ్యా నువ్వు. నా అకౌంట్‌ని ఆపరేట్ చేస్తున్నావు’’ అని వాయించేసింది. అటూ ఇటూ కాస్త కోపం, కావలసినంత కన్‌ఫ్యూజన్... కొన్ని గంటల పెనుగులాట తరువాత సమస్య సాల్వ్ అయింది. సారీలు, నెవర్‌మైండ్‌లు, థాంక్యూలు, మెన్షన్ నాట్‌లు పూర్తయ్యాక సెలెస్టీ షుల్లర్‌కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. ‘‘అనగా అనగనగా అమ్మాయుందిరా.. అనుకోకుండా నా ఫ్రెండయ్యిందిరా’’ అని పాడుకున్నాడు షుల్లర్. ‘‘మిర్చీ మిర్చీ మిర్చీ మిర్చిలాంటి కుర్రాడే’’ అనుకుంది సెలెస్టీ. 2013లో ఇద్దరూ ఫేస్‌బుక్ నుంచి ఫేస్ టు ఫేస్ స్థాయికి ఎదిగారు. ఆ తరువాత ఆమె కొలరాడో నుంచి ఆర్కాన్సాస్‌కి వచ్చి షుల్లర్ రూమ్‌లోనే ఉండడం మొదలుపెట్టింది. ఈ ఏడాది జూన్ 21న షుల్లర్, సెలెస్టీలు ఒక ఇంట్లో ఉండేవాళ్ల నుంచి ఒకింటి వాళ్ల స్థాయికి ఎదిగారు. ఫేస్‌బుక్ పోస్టుల రూపంలో షుల్లర్ తన ప్రేమ కథను ఇమ్‌గుర్.కామ్‌లో రాశాడు. 4.70 లక్షల మంది చూశారు. ఇంకా చూస్తూనే ఉన్నారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలోని ఓ పెద్ద భవనం చిన్న చీకటి గదిలో మార్క్ జుకర్‌బర్గ్ అనే పెళ్లిళ్ల పేరయ్య తన సిస్టమ్ ఎర్రర్ ఒక పెళ్లి చేసేసిందని సంతృప్తిగా నిట్టూర్చాడు. అమెరికాలో అవుతున్న పెళ్లిళ్లలో 17 శాతం ఫేస్‌బుక్ వల్లే అవుతున్నాయని కథనం!!
 http://imgur.com/gallery/HK6Fo
 
 
 బుల్ డాగ్ ‘భౌభౌ’, భల్లూకం ‘బేర్ బేర్
 ఓ బుల్లి బుల్ డాగ్ తన ‘భౌ భౌ’తో ఒకటి కాదు, ఏకంగా రెండు ఎలుగుబంట్లను బేర్‌మనిపించింది. తంతే తొమ్మిది కిలోల బరువుండదు ఆ బుల్లి కుక్క. భల్లూకం ఒక్కొక్కటి నలభై అయిదు కిలోలు. కానీ కుక్క కొంచెమైనా దాని అరుపు ఘనం. ఒక ఇంట్లోకి భల్లూకాలు చొరబడ్డాయి. ఇంట్లో వాళ్లు భయంతో పరుగులు తీశారు. కానీ బుల్‌డాగ్ భౌభౌమంది. ఆ అరుపులకు భల్లూకాలు బెదిరి పారిపోయాయి. విధి నిర్వహణ చేసిన తృప్తితో తోకాడించుకుంటూ బుల్‌డాగ్ మళ్లీ తన మూలకి చేరుకుంది. ఈ సంఘటన లాస్ ఏంజిల్స్‌లో జరిగింది. బుల్లికుక్క యజమాని ‘చాలా ధైర్యంగా’ తలుపులన్నీ బిగించుకుని, కిటికీ సందులోనుంచి బుల్లి కుక్క సాహసాన్ని విడియో తీసి, దాన్ని అప్‌లోడ్ చేశాడు. కుందేళ్లు తోడేళ్లను తరిమికొట్టిన చోట విజయనగర సామ్రాజం ఏర్పడింది. సికాకులం చిట్టడవుల్లో చిలకలు కత్తులు దులపరించిన చోట విప్లవాలు పుట్టాయట... ‘ఏం పిల్లో ఎల్దమొస్తవా’ అని అడవుల్లోకి పిలిచాయట. మరి ఈ బూల్‌డాగ్ భల్లూకాలను బేర్‌మనిపించిన చోట ఏమవుతుందో చూడాలి.
 www.sakshipost.com/index.php/ news/international/64231-tiny-bulldog- manages- to-chase-2-bears-out-of-her-garden.html
 
 
 
ఈ మ్యూజిక్ ఏ వాయిద్యాన్నీ హింసించలేదు
ఈ సినిమాలో ఏ జంతువునూ హింసించలేదు అంటూ డిస్ క్లెయిమర్లు ఇవ్వడం చూశాం. కానీ ఈ మ్యూజిక్ వీడియోలో ఏ వాయిద్యాన్నీ హింసించలేదు అన్న ప్రకటన ఎక్కడైనా చూశారా? అలాగైతే ఈ వీడియో మీరు తప్పక చూడాల్సిందే. ప్లాస్టిక్ గ్లాసులు, గాజు గ్లాసులు, స్పైట్ సీసాలు, ప్లాస్టిక్ బాటిళ్లు, సిల్వర్ కాగితం, ఖాళీ వాటర్ బబుల్, టేబుల్, నాలుగు కర్ర ముక్కలు, ఒక గాజు గ్లాసు నుంచి ఇంకో గాజు గ్లాసులోకి ఐసు ముక్కలు వేయడం... ఇవి చాలు ఏఆర్ రహమాన్ రోజాలో కట్టిన ‘‘పరువం వానగా...’’ పాటను మళ్లీ పుట్టించడానికి. 18 నుండి 20 ఏళ్లలోపు ఉన్న కుర్రకారు క్రియేటివిటీ ఇది అవడానికి ఓ కూల్ డ్రింక్ యాడ్ కావచ్చు. కానీ తమ కంపోజిషన్‌ను ఏ ఆర్ రహమాన్ అంతటి వాడికి అంకితం ఇచ్చేంత కుర్ర పొగరును తప్పనిసరిగా చూసి తీరాల్సిందే. ఇప్పటికే 10.08 లక్షల మంది చూశారు. మీరూ చూడండి.
 <https://www.youtube.com/watch?v=_X0IBya0SQk>
 
 ఇచ్చుటలో ఉన్న హాయి!
ఓ ముసలావిడ బస్సెక్కుతుంది. ఆమె ఎక్కడ సీటడుగుతుందోనని ఓ యువతి చెవులకు ఇయర్ ఫోన్లు బిగించుకుని ఎటో చూస్తూ చేయని రిక్వెస్టుకు చెప్పని ‘నో’ని ముఖంపై ఫిక్స్ చేసుకుని కూర్చుంటుంది. ఆమె పక్కనున్న కుర్రాడు లేచి నిలబడి చిరునవ్వుతో పెద్దావిడకి సీటిస్తాడు. అప్పుడు చూస్తుంది ఆ యువతి... ఆ కుర్రాడికి ఒక కాలే ఉంటుంది. ఆ యువతి ముఖంలో పశ్చాత్తాపం మేఘంలా ముసురుకుంటుంది. ఆమె లేచి ఆ కుర్రాడికి సీటిస్తుంది. జాయ్ ఆఫ్ గివింగ్ ఉద్యమంలో భాగంగా తయారైన ఈ యాత్ ఉద్యమం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ ఫీవర్ పుట్టిస్తోంది.https://www.kulzy.com/work/92966/joy-of-giving-week/film/bus/#_=_
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement