శిల్పకళ
‘శిల్పంలా ఉన్నావు’ అంటే అందంగా ఉన్నట్టు. శిల్పాలు అందంగా మాత్రమే ఉండవు. అందులో కొన్ని అద్భుతంగానూ ఉంటాయి. ఉలి పట్టిన చేయి మహత్యం అది. డిజైనర్లు కూడా అంతే. ఇక్కడ తీర్చిదిద్దిన దుస్తులతో చెక్కిన శిల్పంలా అందంగా మాత్రమే కాదు అద్భుతాల్లా మెరిసిపోతున్న తారలకు ఆ మెరుపులద్దారు హైదరాబాదీ స్టార్ డిజైనర్ శిల్పారెడ్డి. లాంగ్ జాకెట్‌పైన జరీ ఎంబ్రాయిడరీ, గ్రే కలర్ లాంగ్ స్కర్ట్‌కి బంగారు అంచు.. వేడుకలో ప్రత్యేక ఆకర్షణ.
ఎంబ్రాయిడరీ చేసిన గోల్డ్ కలర్ బుటీస్‌తో మెరిపించిన లెహంగా, అదే రంగు ప్లెయిన్ జాకెట్టు, నెటెడ్ దుపట్టా.. వేదికమీద వేడుకగా వెలిగిపోయింది. మోడల్, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్, ఫ్యాషన్ డిజైనర్‌గా తెలుగువారికి సుపరిచితురాలు శిల్పారెడ్డి. హైదరాబాద్ ఫలక్‌నామా ప్యాలెస్‌లో ఇటీవల జరిగిన ఫ్యాషన్ షో లో మస్టర్డ్ చందేరీ సిల్క్ జాకెట్, మెర్మెయిడ్ స్కర్ట్‌లో ఇలా మెరిశారు.చందేరీ సిల్క్ లాంగ్ జాకెట్‌పైన హ్యాండ్ ఎంబ్రాయిడరీతో మెరిపించిన జరీ తళుకులు. మస్టర్డ్ కలర్ లెహంగా అదే రంగు ఆర్గంజా దుపట్టాకు హెవీ హ్యాండ్ కట్ వర్క్ ఎంబ్రాయిడరీ చేసిన అంచు.. ప్రత్యేక ఆకర్షణతో మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్.
లావెండర్ చందేరీ సిల్క్ గౌన్, నడుము భాగాన కట్ ఔట్ డిజైన్, గోల్డ్ బుటీస్‌తో మెరుపుతీగలా బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్. బంగారు రంగు అంచు ఉన్న చందేరీ సిల్క్ ప్లెయిన్ లాంగ్ స్కర్ట్, అదే రంగు లాంగ్ జాకెట్‌పైన చేసిన ఎంబ్రాయిడరీ వర్క్... మేలిముసుగులా మారిన నెటెడ్ దుపట్టా రాయల్ అందాలను మోసుకొచ్చింది.