కోపాన్ని నియంత్రించుకుంటే మనల్ని ఎవరూ గెలవలేరు
ధ్యాన భావన
మనలో చాలామంది ఎదుర్కొనే ఒక తీవ్రమైన సమస్య... కోపం. జీవితంలో బాహ్యమైన సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. అవన్నీ చాలావరకు తాత్కాలికమైనవే. కానీ కోపం అన్నది అంతర్గతమైన సమస్య. అది ఎప్పుడూ మనతోనే ఉంటుంది. మన చివరి క్షణం వరకు.
కోపం ఒక తీవ్రమైన సమస్య. ఎందుకంటే దాని వల్ల ఎన్నో దుష్ఫలితాలు కలిగే ప్రమాదం ఉంది. ఇటు కోపగించుకున్న వ్యక్తికీ బాధ కలుగుతుంది. అటు కోపానికి గురైన వ్యక్తికీ బాధ కలుగుతుంది. ఆ బాధ చేత్తో తీసేస్తే పోయేది కాదు. చాలాకాలం తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అది మనల్ని చలనం లేకుండా చేయడంతో ఎక్కువ సేపు పని చేయలేకపోతాము. కోపం వల్ల ద్వేషం కలుగుతుంది. ద్వేషం కారణంగా చక్కటి అనుబంధాలు కూడా వీగిపోతాయి. ఈ అనుబంధాలు, స్నేహ సంబంధాలు ఎన్నో ఏళ్ల సాంగత్యం వల్ల బలపడేవి. అలాంటివి, కొన్ని క్షణాల కోపంతో చిటికెలో మాయమైపోతాయి. ఒకసారి అనుబంధం వీగిపోతే, మళ్లీ దాన్ని భర్తీ చేసుకోవడం అసాధ్యం.
కోపంలో ఎంత మాట పడితే అంతమాట అనేస్తాం. ముందూ వెనుకా ఆలోచించం. తర్వాత, అలా అనకుండా ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సింది అనుకుంటూ బాధపడిపోతుంటాం. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం? అదీకాక, కోపం ఉన్నచోటుకు ప్రశాంతత రాలేదు. ప్రశాంతత లేని చోట ఆధ్యాత్మిక ఎదుగుదల కుంటుపడుతుంది. స్పష్టంగా చెప్పాలంటే కోపం మనలో దూరే ఒక శక్తిమంతమైన శత్రువు.
కోపం వచ్చిందంటే అర్థం, మన మనసు బలహీనపడిందని! క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం మనకు లేదని చెప్పకనే చెప్పినట్లు. అంటే కోపం ఒక వ్యాధి లక్షణం. మనసు బలహీనంగా ఉందని సూచించే లక్షణం. క్లిష్టమైన పరిస్థితులను మనసు ఎదుర్కోలేదని చెప్పే లక్షణం. అందుకని నేను కోపాన్ని అధిగమించాలంటే ముందుగా నాలోని ఈ బలహీనతలను అంగీకరించాలి. నాకు శక్తి లేదని ఒప్పుకోవాలి.
కానీ, దురదృష్టవశాత్తూ నేను నా కోపాన్ని సమర్థించుకుంటూ వస్తున్నాను. ఎలా? ఎదుటివాళ్లను తప్పుపట్టడం ద్వారా. అంటే వాళ్ల ప్రవర్తనని, వాళ్ల మాటలని నిందించడం ద్వారా. ఎప్పుడైతే నా బలహీనతను నేను సమర్థించుకుంటానో, అప్పుడే నన్ను నేను మెరుగు పరుచుకోడానికి వీలు లేకుండా తలపులు మూసేస్తున్నాను. నా బలహీనత నుంచి నేను బయటికి వచ్చే మార్గాన్ని కోల్పోతున్నాను.
అదే నేను నా బలహీనతను ఒప్పుకుంటే గనుక, ఒప్పుకునేంత సంకల్పశక్తి నాకు ఉంటే గనుక... నాకు నేను సలహా ఇచ్చుకోవడం ద్వారా నా మనసును నేను క్రమేపీ దృఢపరచుకోగలను. అలా నన్ను నేనే ఒక దృఢమైన వ్యక్తిగా, ఎటువంటి పరిస్థితి వచ్చినా కలత చెందకుండా ఉండే వ్యక్తిగా ఊహించుకుంటాను. నన్ను నేనే ఒక క్షమాగుణం ఉన్న వ్యక్తిగా భావించుకుంటాను.
కోపానికి మందు క్షమ. అది చూపించి నన్ను నేను శాంతమూర్తిగా మార్చుకుంటాను. నేను దృఢంగా ఉన్నాననీ, ఎట్టి పరిస్థితుల్లోనూ చికాకు పడననీ, ఎవరూ నన్ను రెచ్చగొట్టలేరని; ఎదుటివారి ప్రవర్తన మీద నాకు అధికారం లేని మాట నిజమే కానీ, నన్ను నేను మాత్రం ప్రశాంతంగానే ఉంచుకుంటాననీ గట్టిగా నిర్ణయించుకుంటాను.
- స్వామి పరమార్థానంద (తెలుగు: మద్దూరి రాజ్యశ్రీ)