మూలకణాలతో క్యాన్సర్లకు వ్యాక్సిన్!
ప్రాణాంతకమైన క్యాన్సర్‌పై పోరులో మనిషి కీలకమైన విజయం సాధించాడు. శరీరంలోని ఏ కణంగానైనా మారిపోగల సామర్థ్యమున్న మూలకణాలతో రొమ్ము, ఊపిరితిత్తుల, చర్మ కేన్సర్లను అడ్డుకోగల వ్యాక్సిన్‌ను స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అంతేకాదు.. క్యాన్సర్ మళ్లీమళ్లీ తిరగబెట్టకుండా ఈ వ్యాక్సిన్ నిరోధించగలదని పశువులపై జరిపిన పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. నాలుగు రోజుల వయసున్న పిండంలో ఉండే కణాలను పిండ మూల కణాలుగా చెబుతారు.
ఎదిగిన తరువాత కొన్ని అవయవాల్లో అతితక్కువ మోతాదులో ఉండేవి ఇన్‌డ్యూస్డ్ ప్లూరీ పోటెంట్ స్టెమ్‌సెల్స్ అంటారు. స్టాన్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు దాదాపు 75 ఎలుకల్లోకి ఈ ప్లూరీ పోటెంట్ మూలకణాలను ఎక్కించారు. రేడియోధార్మికత సాయంతో ఈ కణాలను చైతన్యరహితం చేసిన తరువాత శరీరంలోకి ఎక్కించినప్పటికీ రోగ నిరోధక వ్యవస్థ దీనికి స్పందించింది. నాలుగు వారాల్లో దీని ప్రభావం కనిపించడం మొదలైంది. దాదాపు 70 శాతం ఎలుకల్లో రొమ్ము కేన్సర్ కణాలను శరీరం తిరస్కరించగా.. మిగిలిన వాటిల్లో కణితుల సైజు బాగా తగ్గిపోయింది.
ప్లూరీపోటెంట్ స్టెమ్‌సెల్స్‌కు, కేన్సర్‌కణాలకు సారూప్యతల కారణంగా రోగ నిరోధకవ్యవస్థ పూర్తిస్థాయిలో చైతన్యవంతమై కేన్సర్ కణాలపై దాడులు మొదలుపెట్టిందని శాస్త్రవేత్తల అంచనా. ప్లూరీ పోటెంట్ స్టెమ్‌సెల్స్‌లోకి మరిన్ని ఎక్కువ యాంటీజెన్లను జొప్పించి వ్యాక్సిన్‌ను తయారు చేస్తే రోగ నిరోధక వ్యవస్థలోని టి–కణాలు మరింత ఎక్కువ ప్రభావం చూపుతాయని.. తద్వారా క్యాన్సర్‌ను నిరోధిస్తాయని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు.
సౌరశక్తితో రికార్డు!
సూర్యుడి నుంచి భూమ్మీదకు వచ్చే శక్తి మొత్తాన్ని ఒడిసిపట్టుకోగలిగితే పెట్రోలు, డీజిల్, గ్యాస్‌ల అవసరం అస్సలు ఉండదన్నది అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ స్థాయిలో శక్తిని విద్యుత్తుగా మార్చేందుకు తగిన టెక్నాలజీ, పదార్థాలు మనకు అందుబాటులో లేవంతే! అయితే... ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో హానెర్జీ అనే కంపెనీ శాస్త్రవేత్తలు కీలక విజయం సాధించారు. అత్యంత పలుచగా ఉంటూనే పడిన సూర్యకాంతిలో 25.1 శాతాన్ని విద్యుత్తుగా మార్చే కొత్త తరం సోలార్ ప్యానెల్స్‌ను ఈ కంపెనీ అభివృద్ధి చేసింది.
డ్రోన్లు మొదలుకొని అనేక ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు బ్యాటరీల అవసరమే లేకుండా చేయగల పరిణామం ఇది. గాలియం ఆర్సనైడ్ పదార్థంతో తయారైన ఈ కొత్త ప్యానెల్స్ ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇదేరకం సోలార్‌ప్యానెల్స్ కంటే రెండు రెట్లు ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి చేయడం విశేషం. పలుచగా ఉండటం.. కావాల్సిన విధంగా మడత పెట్టేందుకు అనువుగా ఉండటం తదితర కారణాల వల్ల ఈ హానెర్జీ ప్యానెల్స్‌ను బ్యాక్‌ప్యాక్‌లు మొదలుకొని బస్సు, కార్లపైకప్పుల వరకూ ఎక్కడ కావాలంటే అక్కడ అతికించుకుని విద్యుత్తు పొందవచ్చునని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. నిజానికి హానెర్జీ యూరోపియన్ కారు తయారీ సంస్థలతో ఈ రకమైన ఒప్పందాలను కూడా కుదుర్చుకుంటోంది.
అతుక్కుంటాయి.. వివరాలిస్తాయి!
ఐసీయూలో ఉన్న రోగిని మీరెప్పుడైనా చూశారా? ఒళ్లంతా కప్పేసిన తీగలు, సెలైన్, ఇతర గొట్టాలతో కనిపిస్తారు వారు. అత్యవసర పరిస్థితుల్లో శరీరం తాలూకూ స్పందనలన్నింటినీ గుర్తించేందుకు ఈమాత్రం ఏర్పాట్లు అవసరం. ఇకపై మాత్రం కాదు. ఎందుకంటారా? ఫొటోలో కనిపిస్తోందే.. అలాంటి స్టిక్కర్లతోనే గుండెకొట్టుకునే వేగం మొదలుకొని రకరకాల వివరాలను సేకరించేందుకు నార్త్‌వెస్టర్న్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త జాన్ ఎ.రోజర్స్ వినూత్నమైన టెక్నాలజీలను సిద్ధం చేస్తున్నారు.
శరీరం కదలికలకు తగ్గట్టుగా కదులుతూనే వివరాలు సేకరించగల ఈ వినూత్నమైన వేరబుల్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఐసీయూలో మాత్రమే కాదు.. దీర్ఘకాలికవ్యాధి తరువాత కోలుకునే క్రమంలోనూ ఎంతో ఉపయోగపడుతుంది. కండరాల కదలికలు, గుండె పనితీరు, నిద్ర తాలూకూ నాణ్యత వంటి అనే విషయాలను వైద్యులకు తెలియజేయగలవు ఈ స్టిక్కర్లు. గొంతు వద్ద అతికించుకునే స్టిక్కర్... రోగులు ఆహారాన్ని సక్రమంగా మింగ గలుగుతున్నారా, లేదా? అతడి స్వరపేటిక ఎలా పనిచేస్తోంది? వంటి అంశాలను కూడా గుర్తించగల సెన్సర్లను కలిగి ఉంటుంది.
ప్రస్తుతం ఉపయోగించే మైక్రోఫోన్ల కంటే ఇవి చాలా మెరుగైన ఫలితాలిస్తాయని రోజర్స్ అంటున్నారు. రోగులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత కూడా వీటిని వాడుతూ ఉండవచ్చునని, ఎప్పటికప్పుడు వివరాలు డాక్టర్ల కంప్యూటర్లు లేదా స్మార్ట్‌ఫోన్లలో నమోదవుతూ ఉంటాయని వివరించారు.
కాలేయ వ్యాధికి కార్బోహైడ్రేట్లు తక్కువ ఉన్న ఆహారం మేలు!
కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇటీవలి కాలంలో అనేక పరిశోధనలు చెబుతున్నాయి. తాజాగా ఫ్యాటీ లివర్ వ్యాధి విషయంలోనూ ఈ రకమైన ఆహారం ఎంతో మేలు చేస్తుందని గుర్తించారు కేటీహెచ్ రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ శాస్త్రవేత్తలు.
మద్యంతో సంబంధం లేని రకమైన ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్న కొందరు ఊబకాయులకు రెండు వారాల పాటు తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం అందించినప్పుడు వారి జీవక్రియలతోపాటు కడుపు/పేవుల్లోని బ్యాక్టీరియాలోనూ తేడాలు కనిపించాయని ఈ రెండు పరిణామాలు కాలేయంలోని కొవ్వు తగ్గేందుకూ దోహదపడ్డాయని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త మార్డినోగీ తెలిపారు.
కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం శరీరంలో ప్రమాదకరమైన హెపాటిక్ కొవ్వుల ఉత్పత్తి ప్రక్రియపై ప్రభావం చూపిందని, బి విటమిన్ల మోతాదుతోపాటు ఫోలిక్ యాసిడ్‌లను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా ఎక్కువైందని వివరించారు. ఈ రకమైన ఆహారం బరువు తగ్గేందుకు, గుండెజబ్బుకు దారితీసే ప్రమాదాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుందని చెప్పారు. అయితే శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉన్న వారు ఆహారపు అలవాట్లను మార్చుకునే ముందు వైద్యులను సంప్రదించడం మేలని సూచించారు. పరిశోధన వివరాలు సెల్ మెటబాలిజం తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment