పురుషులవి పిచ్చివేషాలా?
అమ్మాయి మెప్పు కోసం ఏదైనా చేస్తే చాలు... పిచ్చివేషాలు అన్న టైటిల్ మాకు ష్యూరు!
ఏం చేస్తాం! తప్పదు. ప్రకృతి అలా రాసిపెట్టింది మాకు. మగాళ్లు చేసే నిర్వాకాలకు ప్రకృతిని ఎందుకు నిందిస్తావ్ అంటారా? నిజాలు మాట్లాడక తప్పడం లేదు. వాస్తవాల గుట్టు విప్పక తప్పడం లేదు.
కటిల్‌ఫిష్ అనే ఒక చేప కాని చేప ఉంది. నిజానికి మన తెలుగువాళ్లే దానికి ‘కుటిల’ ఫిష్ అని పేరు పెట్టారేమో! ఇంగ్లిషు వాళ్లు దాన్ని తమ ధోరణిలో కటిల్ అని చదివారేమో!! ప్రకృతిలోని ఓ అమాయకపు ప్రాణికి కుటిల చేప అని పేరు పెట్టడానికి నీకు సిగ్గులేదా అని తిట్టకండి. దాని నైజం మన మగాళ్ల లాంటిదే. దాన్ని తిట్టడమంటే మనల్ని తిట్టుకోవడమే. మనల్ని మనం తిట్టుకోగలమా! కటిల్‌ఫిష్ జాతిలోని అమ్మాయిని ఆకర్షించడానికి మగవన్నీ కిందామీదా పడతాయి. ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. ఈ పోటీలో భాగంగా పిచ్చివేషాలన్నీ వేస్తాయి. తప్పదు మరి. అలా పిచ్చివేషాలు వేయకపోతే ఛాన్సులన్నీ బలమైన కటిల్‌ఫిష్‌కే. రాజ్యం వీరభోజ్యంలాగా... ఏది శక్తిమంతమో దానికే ఆడది సొంతం. పైగా చిన్నవి పోరాటంలో పెద్దవాటిని గెలవలేవు. అందుకే ఈ పిచ్చివేషాలు.
చిన్న కుటిల చేపలు చిన్నదాని వేషం వేస్తాయి. ఆడవేషంలో కులుకులొలుకుతూ, హొయలుపోతూ, సొగసులీనుతూ, సోలిపోతూ అమ్మాయిలా వేషం కడతాయి. మగ కటిల్‌చేపకు నాలుగు జతల చేతులు. ఆడ చేపకు మూడే. అందుకే ఆడ చేప మనసు దోచేందుకు ఆ ఎగస్ట్రా చేతుల్ని దాచేసి, ఎగస్ట్రా వేషాలు వేస్తాయవి. పొందుకోసం తెగ ట్రై చేస్తాయవి.
అందుకే మానవుల్లో మగాళ్ల వేషాలను పిచ్చివేషాలన్నట్టే... ‘కడలి ఊసరవెల్లి... ఆ కటిల్ చేప... ఈ కుటిల చేప’ అంటూ పేరు పెట్టాయి. మీకో విచిత్రం చెప్పనా... వీరత్వంతో, ధీరత్వంతో, జబర్‌దస్తిత్వంతో, జబ్బబలతత్వంతో ఆడదాన్ని సొంతం చేసుకున్న పెద్దచేప చేసిన శుక్రదానాన్నీ, కుటిలంతో జటిలమైన సమస్యను ఎదుర్కొని తనను చేరి తనకు కాన్కగా ఇచ్చిన వీర్యదానాన్నీ... ఇలా పలు పలు వీర్యాలన్నింటినీ సేకరిస్తుంది ఆడచేప. తన వద్ద ఉన్న అన్ని వీర్యాలనూ వరసగా నిలబెట్టి ఏదో ఒకదాన్నే స్వీకరిస్తుందా గడుసు ఆడ చేప. వీర్యాల స్వయంవరంలో ఒకే ఒక దానికి పట్టం కడుతుంది. ఆ వీర్యంతోనే తన అండం ఫలదీకరణం అయ్యేలా చూస్తుంది.
విచిత్రం ఏమిటంటే... ఆడవేషంలో తన వద్దకు వచ్చి శుక్రకణాలను దానం చేసిన కుటిల చేప వీర్యానికే తొలి ప్రాధాన్యం ఇస్తుంది. తన గర్భసంచీలో స్థానం ఇస్తుంది. ఎందుకంటే... అది రౌడీయిజమ్స్ కంటే ఇంటెలి‘జెమ్స్’కే ప్రాముఖ్యమిస్తుందది.
మహామహాకవి గాలీబ్ ఏం రాశాడు?
‘‘అందగత్తెలతో ముచ్చటాడు కొరకు
చిత్రలేఖన విద్య నేర్చితిని నేను’’ అన్నాడు.
కుంచె పట్టడం కుదరకపోయినా, రంగువేయడం రాకపోయినా, బొమ్మగీయడానికి అలనాడు ఆయన సిద్ధపడ్డట్టే... లెక్కలు చేయలేకపోయినా ఎంపీసీలూ, రికార్డులు వేయలేకపోయినా బైపీసీలంటూ ఇప్పటికీ పిచ్చివేషాలకు మేం సిద్ధమే. ఏం చేస్తాం. ఆడువారి కోసమే పాడుబుద్ధి... ఈ మగబుద్ధి. మత్స్యావతారంలోనే కాదు... మానవావతారంలోనూ ఇంతే. కటిల్ చేపలైనా... కుటిల మానవులైనా మగాళ్లు మగాళ్లే. వారి వేషాలు వేషాలే. పిచ్చివేషాలైనా తప్పదు మరి...
అతివను ఆకర్షించడం కోసం... బహుకృత వేషం!
ఆడవారి దృష్టిలో అది ఓ పిచ్చివేషం!!