పేదరికమే కట్టేసింది!
బతుకుఛిద్రం
అవును, వాళ్లిద్దరినీ పేదరికమే కట్టేసింది. ప్రపంచంలో అన్నింటికంటే క్రూరమైనది ఏదంటే.. అది పేదరికమే. పేదరికం అంత క్రూరంగా ఉంటుందా? రాజస్థాన్‌లోని ఉమేశ్, జీవాలను చూస్తే అవునని చెప్పక తప్పదు.
ఉమేశ్‌కి ఎనిమిదేళ్లు. రాజస్థాన్‌లోని కోల్యారి గ్రామం. గడచిన ఐదేళ్లుగా అతడు జీవిస్తున్నది పశువుల పాకలోనే, ఆవుల పక్కనే. మరో కుర్రాడు జీవాకి పదకొండేళ్లు. ఉదయ్‌పూర్‌కి దగ్గర్లోని బయాడి గ్రామం. అతడిని చెట్టుకి కట్టేసి పొలంలో పని చేసుకుంటాడు అతడి తండ్రి హుర్మారామ్. ఈ పిల్లలిద్దరికీ మతిస్థిమితం లేదు. ఎప్పుడు స్తబ్దుగా ఉంటారో, ఎప్పుడు మితిమీరిన ఉత్సాహంతో పరుగులు తీస్తారో ఊహించడం కష్టమే. అలాంటి పిల్లలను ఇరవై నాలుగ్గంటలూ కనిపెట్టుకుని ఉండడం ఒక మనిషికి సాధ్యమయ్యే పని కాదు. ఇంట్లో వాళ్లు వంతుల వారీగా పంచుకుంటే తప్ప సాధ్యం కానేకాదు. కన్న బిడ్డలను కడుపులో పెట్టుకుని సాకాలని ఎవరికుండదు? ఇలాంటి బిడ్డలనైతే మరీ ఎక్కువగా చూసుకోవాలి. మరి ఇలా కనిపెట్టుకుని చూడడానికి అమ్మానాన్న ఉంటేనే కదా! ఉమేశ్ తండ్రి భగవతి లాల్, తల్లి మనుదేవి హెచ్‌ఐవితో పోయారు. నానమ్మ, తాతే దిక్కు. వాళ్లకు వయసైపోయింది.
అయితే ఆ కట్టేసేదేదో ఇంట్లోనే ఒక పక్కన కట్టేస్తే... ఇంట్లోనే ఆడుకుంటూ, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతాడు కదా అంటే... నిజమే. కానీ ఉమేశ్‌కి ఒకటి, రెండు అవసరాలకు బయటకు వెళ్లడమూ తెలియదు. ఇంట్లోనే చేస్తే శుభ్రం చేసే ఓపిక ఆ ముసలివాళ్లకు లేదు. అందుకే ఉమేశ్ ఆవు పక్కన మరో గుంజకు బంధీ అయ్యాడు. ఆవు చేసినట్లే అక్కడే అన్నీ చేస్తున్నాడు. కట్టు విప్పితే పరుగులు పెట్టి పారిపోతాడని, అతడిని పట్టుకుని రావడం తన వల్ల అయ్యే పని కాదని, అందుకే కట్టేయక తప్పడం లేదంటోంది 75 ఏళ్ల నానమ్మ పీపీ బాయ్. ఉమేశ్ పుట్టడం బాగానే పుట్టాడని, మూడేళ్ల వరకు బాగానే ఉన్నాడని, తల్లిదండ్రులు మరణించిన తర్వాత అతడిలో విపరీత ప్రవర్తన మొదలైందంటోందామె. వైద్యం చేయించాలంటే డబ్బులేదని కన్నీళ్ల పర్యంతమైంది పీపీబాయ్.
జీవాకి పోలియోతోపాటు బుద్ధిమాంద్యం కూడ. ఎక్కడ వదిలితే ఎటు వెళ్లిపోతాడో తెలియదు. ఎక్కడ నుంచి జారిపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడో ఊహించలేం. గతంలో జరిగాయి కూడా. అందుకే చెట్టుకి కట్టేసి పొలం పనులు చేసుకుంటున్నాననంటాడు హుర్మారామ్. ఆ రాష్ట్ర చైల్డ్‌వెల్ఫేర్ కమిటీ ప్రతినిధుల జోక్యంతో ఉమేశ్, జీవాలు ఇటీవల విడుదలయ్యారు. అధికారులు వాళ్లను రెస్క్యూ హోమ్‌కి తరలించారు. ఇలాంటి పిల్లలను కట్టేయడం నేరమని వారిని మందలించారు అధికారులు. వారి మేధోపరిణతికి తగ్గట్లుగా వ్యవహరిస్తూ అన్ని విషయాలనూ తెలియచెప్పాలని కౌన్సెలింగ్ ఇచ్చారు. నిజానికి కౌన్సెలింగ్ ఇవ్వాల్సింది ఆ పేద తండ్రికి, నానమ్మకు కాదు. దేశంలో ఇంకా పోలియోను తరిమి కొట్టలేని పాలకులకు, హెచ్‌ఐవి బాధితుల పిల్లలకు సరైన పునరావాసం కల్పించలేని ప్రభుత్వానికి.