యోగ కళాసాధన
కోణము అంటేనే మనకు క్షేత్ర గణితము (Men-surat-ion) గుర్తుకు వస్తుంది. అనేక ఆసనాల్లో చేతులను, కాళ్లను ఏ యాంగిల్‌లో ఉంచాలి, ఎన్ని డిగ్రీల కోణంలో ఉంచాలి అనేది చెప్పబడుతుంది. ఎప్పుడైతే చేసే విధానంలో లైన్, ఎలైన్‌మెంట్ ఉండి, శరీరం-మనస్సు-ఆత్మ పూర్తి సామరస్యంతో పనిచేస్తాయో ఆ క్రియ ఒక కళగా పిలవబడుతుంది. ఒక కళకు ఉండాల్సిన అన్ని అర్హతలు యోగాకు ఉన్నందువల్ల యోగాను ఒక కళగా కూడా అభ్యసించవచ్చు. యోగా వల్ల అందం, ఆరోగ్యం రెండూ చేకూరతాయి కనుకనే ప్రపంచవ్యాప్తంగా యోగాకు విస్తృతమైన ఆదరణ లభిస్తోంది.
1. ఉత్థిత పార్శ్వ కోణాసన: రెండు కాళ్ల మధ్య 3 నుండి 5 అడుగుల దూరంతో కుడిపాదం ముందువైపునకు, ఎడమ పాదం పక్కవైపునకు, రెండు పాదాలు సమాంతర రేఖలో ఎడమకాలు వీలైనంత వరకూ స్ట్రెచ్ చేసి ఉంచాలి. తర్వాత, ఎడమ చేతిని పైకి తీసుకువెళ్లి తల ప్రక్కనే ముందుకు స్ట్రెచ్ చేస్తూ ఎడమకాలు, ఎడమ చేయి సమాంతర రేఖలో ఏటవాలుగా కుడిచేయి క్రిందకు, కుడి అరచేయి నేలమీద, కుడిపాదం ప్రక్కనే బయటివైపునకు (కుడి టిబియా నేలకు 90 డిగ్రీల కోణంలో నిలువుగా) ఉంచాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత అదే క్రమంలో మళ్ళీ వెనుకకు సమస్థితికి రావాలి. కుడిచేయి క్రింద పెట్టలేకపోతే ఏదైనా బ్లాక్ (ఇటుక)ను ఆధారంగా ఉపయోగించవచ్చు లేదా కుడి మోచేయి కుడి మోకాలుమీద సపోర్టుగా పెట్టుకోవచ్చు.
2. పార్శ్వకోణాసన: పైన పేర్కొన్న ఆసనం నుంచి సమస్థితికి రాకుండా కుడికాలు వెనుకకు తీసుకొని కాళ్ళు రెండు కలపాలి. అలాగే శరీరాన్ని భూమికి ఏటవాలుగా 45 డిగ్రీల కోణంలో ఉంచి కుడికాలిని ముందుకు కుడిపాదం కుడిచేతికి ప్రక్కకు తీసుకువచ్చి క్రమంగా వెనుకకు సమస్థితిలోకి రావచ్చు.
3. ఉత్థిత హస్తపాదాంగుష్ట పార్శ్వకోణాసన: పై ఆసనం నుంచి వెనుకకు సమస్థితిలోకి రాకుండా కుడికాలి బ్రొటనవేలిని కుడిచేతితో పట్టుకొని కాలుని స్ట్రెచ్ చేస్తూ మోకాలు స్ట్రెయిట్‌గా చేస్తూ పైకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ, 3 లేదా 5 సాధారణ శ్వాసలు తీసుకుని వెనుకకు పార్శ్వ కోణాసనంలోకి, తరువాత ఉత్థిత పార్శ్వకోణాసనంలోకి వచ్చి సమస్థితిలోకి రావాలి. ఇది సీనియర్ సాధకులకు మాత్రమే సాధ్యపడుతుంది. కాలు చేతితో పట్టుకోలేకపోతే తాడు వంటి వస్తువు సాయం తీసుకోవచ్చు.
యోగావగాహన: హఠయోగ 6 విధాలుగా చెప్పబడుతుంది.
1. సృష్టిక్రమ - చిన్న వయస్సు (10 నుండి 20 సం॥ఉన్నవారికి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు చేసే సాధన.
2. శిక్షణక్రమ - (20 నుండి 40 సం॥వయస్సు) ఆసనాలు, ప్రాణాయామం, ముద్రాబంధనాలు చేయడంలో పర్‌ఫెక్షన్ దిశగా చేసే సాధన.
3. రక్షణక్రమ - (40 సం॥పైన) పూర్తిగా రిలాక్సేషన్ టెక్నిక్‌ను అనుసరిస్తూ ఆరోగ్యం కాపాడుకోవడానికి చేసే సాధన.
4. ఆధ్యాత్మికక్రమ - ఆత్మ సాక్షాత్కారం స్వీయ వాస్తవికతను తెలుసుకునే దిశగా చేసే సాధన.
5. చికిత్సాక్రమ - శ రీరంలోని రుగ్మతలను తీసివేయడానికి చేసే సాధన.
6. శక్తిక్రమ - శరీరంలో అంతర్గతంగా ఉన్న శక్తిని అపారంగా పెంచుకునే దిశగా చేసే నిరంతర సాధన.
యోగి, భోగి, రోగి: ఆధునిక ప్రపంచానికి తేలికగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే హఠయోగాన్ని మూడు విధాలుగా విభజింపవచ్చు.
1. యోగులు చేసే యోగా: అన్ని ఆసనాలు చాలా తేలికగా శ్రమలేకుండా, చెమటోడ్చకుండా తక్కువ సమయంలో పూర్తి చేసి, ఎక్కువ సమయాన్ని ధ్యానంలో గడిపే విధానం
2. భోగులు చేసే యోగా: రోజులో ఎక్కువ భాగం విలాసవంతంగా తిరగడానికి వారాంతపు వేడుకలు జరుపుకోవడానికి శారీరక పటుత్వం అవసరం గనుక దానికి కావలసిన యోగాను ప్రతీరోజు చెమటోడ్చి, కష్టపడి చేసే విధానం. ఈ తరహా భోగలాలస ఉన్నవారు ఐహికసుఖాల మీద నుంచి దృష్టిని అంతరంగ ప్రపంచంలోకి మళ్లించి యోగులుగా మారే ప్రయత్నం చేయకపోతే... కొంత కాలం తర్వాత తప్పనిసరిగా రోగులుగా మారవలసి వస్తుంది.
3. రోగులు చేసే యోగా : రోగాల నుంచి ఉపశమనం కొరకు చేసేటటువంటి చికిత్సాక్రమం విధానం.
ఉపయోగాలు
తొడలు, తుంటిభాగం, మోకాళ్లు, చీలమండ బలంగా అవుతాయి. గజ్జలు, వీపు, వెన్నెముక, నడుము, ఊపిరితిత్తుల మధ్యభాగాలు, భుజాలు సాగదీయబడతాయి. పొట్ట కండరాలు, పొట్ట దగ్గర అవయవాలకు చక్కగా మర్దన జరుగుతుంది. శ్వాసకోస వ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ, కండర, ఎముకల వ్యవస్థలకు చాలా మంచిది.
ఎ.ఎల్.వి కుమార్
ట్రెడిషనల్
యోగా ఫౌండేషన్