
సంపద సద్వినియోగంతోనే దైవ ప్రసన్నత
రమజాన్ కాంతులు
మానవుల వద్ద ఉన్నదంతా దైవప్రసాదితమే. దాన్ని ఒక అమానతుగా దైవం మన దగ్గర ఉంచాడు. అందుకని ఆయన చూపినమార్గంలో, ఆయన ఆదేశించిన రీతిలో సద్వినియోగం చేసినప్పుడే దైవప్రసన్నత ప్రాప్తిస్తుంది. ఈ భావన ప్రతి విశ్వాసి హృదయంలో అనునిత్యం, నిరంతరం మెదులుతూ ఉండాలి. వాస్తవానికి జకాత్ వ్యవస్థ సమాజంలో ప్రజలకు ఆర్థికన్యాయం అందించే అపురూప సాధనం.ఇది ప్రజల హృదయాలనుండి స్వార్థం, సంకుచితత్వం, పిసినారితనం, కాఠిన్యం, ద్వేషం లాంటి దుర్గుణాలను దూరంచేసి, వాటిస్థానంలో ప్రేమ, పరోపకారం, త్యాగం, సహనం, సానుభూతి, స్నేహశీలత, ఔదార్యం, కారుణ్యంలాంటి అనేక ఉన్నత మానవీయ గుణాలను పెంపొందిస్తుంది.
జకాత్‌ను రమజాన్ మాసంలోనే చెల్లించాలన్న నియమం ఏమీ లేకపోయినా, ఈ మాసం శుభాల దృష్ట్యా అధికశాతంమంది ప్రజలు ఈనెలలోనే జకాత్ చెల్లింపుకు ప్రాధాన్యతనిస్తారు. ఈమాసంలో చేసే దానధర్మాలకు అనేకరెట్లు పుణ్యం లభిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అల్లాహ్ అందరికీ చిత్తశుద్ధితో జకాత్ చెల్లించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం.
– ముహమ్మద్ ఫారూఖ్ జునైద్