సూరవరపు సుబ్బారావు
ప్రకృతి అందాలకు నిలయం కోనసీమ. రుచికరమైన పాలకోవాకు కండ్రిగ పాలకోవా ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. విదేశాల్లో స్థిరపడిన స్థానికులు, స్థానికేతరులు పనిగట్టుకుని కండ్రిగ వచ్చి పాలకోవాను తీసుకు వెళ్తుంటారు. కోవాలోని మాధుర్యాన్ని ఈ గ్రామం మొత్తం భారత దేశానికి పంచుతోంది. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు సుమారు 5 కిలోమీటర్లు దూరంలో ఉంది కండ్రిగ గ్రామం. అక్కడ ఆదిలక్ష్మీస్వీట్ (పాలకోవా) స్టాల్, అటుగా వెళుతున్నవారిని తన దగ్గరకు తియ్యగా రప్పించుకుంటుంది.
ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సుమారు 30 ఏళ్ల క్రితం సూరవరపు సుబ్బారావు.. కొత్తపేట – అమలాపురం రోడ్డు కండ్రిగ రేవు దగ్గర చిన్న కాఫీ హోటల్ ప్రారంభించారు. 20 ఏళ్ల క్రితం ఆయన కుమారుడు సూరవరపు వీరరాఘవులు హోటల్‌ని మరింత అభివృద్ధి చేయ టం కోసం పాలకోవా తయారీ ప్రారంభించారు. అంతే.. వీరి జీవితాలలో మాధుర్యం వచ్చి చేరింది. వ్యాపా రం పెరగటంతో, విశాలమైన స్థలంలో ఆదిలక్ష్మి స్వీట్స్ అండ్ టీ స్టాల్ ప్రారంభించిన కొద్దికాలానికే పాలకోవా వ్యాపారమూ చెందింది.
పాలకోవా పాకం
ఊక పొయ్యి మీదే...
గ్యాస్ స్టౌ, స్టీమ్ విధానం ఉన్నా ఇక్కడ మాత్రం ఊక పొయ్యి మీదే పాలకోవా తయారుచేయటం ప్రారంభించారు. నాలుగు బట్టీలతో రెండు ఊక పొయ్యిలు పెట్టి, ఎంత వేగంగా పాలకోవా తయారుచేస్తున్నా, ఇలా ప్లేటులోకి తీస్తుండగానే, అలా ఎగరేసుకుపోతున్నారు పాలకోవా ప్రియులు. ప్రొప్రయిటర్ పెద్ద కాపు కుటుంబ సభ్యులు పదహారు మందితో పాటు మరో పది మంది కలిసి, రోజుకు సుమారు 100 కేజీల కోవా తయారుచేస్తున్నారు.
పాలకోవా ముద్ద
తయారీ...
ఊక పొయ్యి మీద ఇత్తడి గంగా ళాలు పెట్టి, పాలు పోసి మీగడ కట్టకుండా గరిటె తిప్పుతూ, సుమారు గంట సేపు మరగకాగి ముద్దలా అవుతున్న సమయంలో పంచదార (20 లీటర్లు పాలకు, మూడు కేజీల పంచదార) వేసి, పాలు, పంచదార పాకాన్ని గరిటెతో విరామం లేకుండా, దగ్గర పడేవరకు కలిపి, నెయ్యి పూసిన పళ్లెంలో పోస్తారు. గట్టిపడేవరకు గరిటెతో బాగా కలుపుతారు. ఇలా గట్టి పడటం కోసం ప్రస్తుతం ఒకరకమైన గ్రైండర్ వాడుతున్నారు. గ్రైండర్‌లో వేసిన అరగంటకు ముద్దలా మారిపోతుంది. ఆ మిశ్రమాన్ని బిళ్లలుగా తయారుచేసి ప్యాకింగ్ చేస్తారు. ఇలా ఈ పాలు కోవాగా మారి కవర్లలోకి వెళ్లడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. అయితేనేం, కోవా తిన్నవారు ఇచ్చే తియ్యటి మాటలు వారి జీవితమంతా వారి మనసులో పదిలంగా నిలుస్తున్నాయి. – జగతా రాంబాబు, సాక్షి, కొత్తపేట,తూ.గో. జిల్లా
నాణ్యమైన పాలతోనే కోవా
చుట్టుపక్కల గ్రామాల్లోని రైతుల నుంచి గేదె పాలు సేకరిస్తాం. ఇందులో ఒక్క చుక్క కూడా నీరు కలపకుండా, కోవా కోసమే ఉపయోగిస్తాం. 500 లీటర్లు పాలకు సుమారు 100 కేజీలు కోవా తయారవుతుంది. గ్యాస్, స్టీమ్ పొయ్యిలు అందుబాటులోకి వచ్చినా వాటిపై కోవా వండితే ఇంత రుచి రాదు. ఊక పొయ్యి మీద వండితేనే ఘుమఘుమలాడుతూ ఇంత తియ్యగా వస్తుంది. అందుకే ఊక పొయ్యి బట్టీల మీదే కోవా తయారుచేస్తున్నాం. ఇలా వేడివేడిగా ఉండగానే, అలా చల్లగా కొనేస్తుంటారు. 25 గ్రాములు, 50 గ్రాములు చొప్పున కోవా బిళ్లలను తయారుచేస్తాం. – సూరవరపు సుబ్బారావు, నిర్వాహకుడు
Comments
Please login to add a commentAdd a comment