యానల్ ఫిషర్ అంటే...
హోమియో కౌన్సెలింగ్స్
నా వయసు 68 ఏళ్లు. నేను మలబద్దకంతో బాధపడుతున్నాను. మలవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పారు. ఆపరేషన్ అవసరమన్నారు. నాకు ఆపరేషన్ అంటే భయం. హోమియోలో దీనికి చికిత్స ఉందా?
– సంపత్‌కుమార్, నిడదవోలు
మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది.
కారణాలు: ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం – అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్‌ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది.
లక్షణాలు : తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట.
వ్యాధి నిర్ధారణ: సీబీపీ, ఈఎస్‌ఆర్, ఎమ్మారై, సీటీస్కాన్
చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. ఏ సైడ్‌ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స చేయడం హోమియో విధానం ప్రత్యేకత. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే తప్పక మంచి ఫలితం ఉంటుంది.
డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరక్టర్,
పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్
ఆ గడ్డలు తగ్గుతాయి...
హోమియో కౌన్సెలింగ్స్
నా వయసు 36 ఏళ్లు. నా ఒంటిపై మాటిమాటికీ బొబ్బల్లా వస్తున్నాయి. ఒక వారం రోజుల పాటు జ్వరం వస్తోంది. ఆ బొబ్బలు నొప్పి కలిగిస్తూ, ఆ తర్వాత గట్టిగా మారి, పగులుతున్నాయి. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? రమ్య, హైదరాబాద్
చర్మం కింద ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే చీముతో నిండిన బొబ్బలను ఆబ్సెస్ / బాయిల్స్ (గడ్డలు / దిమ్మెలు) అంటారు. కురుపులు / గడ్డలు అని కూడా పిలిచే ఈ ఆబ్సెస్ సాధారణంగా బ్యాక్టీరియా / పరాన్నజీవులు లేదా ఇంజెక్షన్ ద్వారా కూడా వస్తుంటాయి. పొగతాగే అలవాటు లేదా ఊబకాయం ఉన్నవారిలో ఇవి సర్వసాధారణం. చర్మం కింద ఉండే సన్నటి పొరలో వ్యాపిస్తాయి. ఇవి ఎగుడుదిగుడుగా ఉండి చీముతో నిండి ఎరుపు / పసుపు / తెలుపు రంగులో చిన్న బంతి లేదా బఠాణీ ఆకృతితో ఉంటాయి. చాలా నొప్పి కలిగిస్తుంటాయి.
ఇవి రావడానికి కారణాలు: ∙రోగ నిరోధక శక్తి లోపించడం ∙అపరిశుభ్రమైన ఆహారం తినడం ∙సూక్ష్మజీవులు లేదా పరాన్న జీవుల ఇన్ఫెక్షన్ వల్ల ∙ఈ వ్యాధి సోకిన వారితో సన్నిహితంగా ఉండటం వల్ల
లక్షణాలు: ∙చర్మంపై బొబ్బలు / గడ్డలు / గాయాలు ∙వికారం ∙చర్మం ఎరుపు రంగులోకి మారడం ∙గడ్డను తాకితే తీవ్రమైన నొప్పి ∙చీము స్రవించడం ∙వాపు
చికిత్స: ఆబ్సెస్ / బాయిల్స్‌కి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి లక్షణాలను, శరీరతత్వాన్ని విశ్లేషించి వైద్యులు తగిన మందును సూచిస్తారు. ఈ సమస్యకు హోమియోలో కాల్కేరియా, హెపార్ సల్ఫ్, ఇక్తియోలమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాలి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో)
స్టార్ హోమియోపతి, హైదరాబాద్
బిగుసుకునే కండరాలు.. తీవ్రమైన నొప్పి
వాస్క్యులార్ కౌన్సెలింగ్
నా వయసు 39 ఏళ్లు. లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. రోజూ కాలేజీకి వెళ్లడం కోసం మూడు గంటల జర్నీ చేస్తుంటాను. గత నాలుగైదు వారాల నుంచి హఠాత్తుగా కాలి పిక్కల కండరాలు బిగుసుకుపోతున్నాయి. తీవ్రమైన నొప్పి వస్తోంది. ఒక్కోసారి క్లాస్‌లో ఇలా జరిగితే భరించలేని బాధతో కళ్లనుంచి నీళ్లు రాలుతుంటాయి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? పరిష్కారం చెప్పండి. - సరళకుమారి, హైదరాబాద్
మీరు ఎదుర్కొంటున్న సమస్యను ఇంగ్లిష్‌లో ‘మజిల్‌క్రాంప్స్’గా పేర్కొనవచ్చు. రోజూ గంటల తరబడి బస్సులో కూర్చోవడం, ఆపైన క్లాస్‌లో చాలా సేపు నిలబడటం వంటి అంశాలు మీ కండరాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తున్నాయి. నిద్ర పోయే సమయంలో విశ్రాంతి చేకూరడం వల్ల కండరాలు కోలుకొని సాధారణ స్థితికి చేరుకుంటాయి. అయితే మీకు అవసరమైనంత నిద్ర లేకపోవడం, ఆహారంలో పోషకాలు లోపించడం వంటి పరిస్థితుల్లో కండరం కోలుకోవడం జరగదు. అప్పుడు కండరాల తీవ్రంగా అలసిపోయి మీ అనుభవంలోకి వస్తున్నట్లుగా బిగుసుకుపోతాయి. ఇలా జరిగినప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ అకస్మాత్తుగా జరిగే ఈ కండరసంకోచం నొప్పి విపరీతంగా ఉంటూ రోజువారీ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తుంది.
కండరాలు ఒక్కసారిగా గుంజుకుపోయినట్లుగా జరగడం ఎప్పుడైనా జరగవచ్చు గానీ చాలా సందర్భాల్లో నిద్రపోయినప్పుడు కండరాలు బిగుసుకుపోతే ఆ నొప్పితో వెంటనే మేల్కొంటారు. ఇలా కాలికండరాలు అకస్మాత్తుగా మన ప్రమేయం లేకుండా బిగుసుకుపోవడాన్ని ‘మజిల్ క్రాంప్స్’ / ‘చెర్లీ హార్స్’ అంటారు. మన వృత్తి, వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. మెలకువగా ఉన్నప్పుడు, నిద్రలో, వ్యాయామం చేస్తున్నప్పుడు.. ఎప్పుడైనా ఇలా జరగవచ్చు. బిగుసుకుపోయిన కండరాలు మామూలుకంటే గట్టివిగా ఉండటమే కాకుండా కొన్నిసార్లు వడితిరిగి కనిపిస్తాయి. విపరీతమైన అలసట, డీహైడ్రేషన్, కొన్ని మందులు వాడకం వంటి కారణాలతో మజిల్ క్రాంప్స్ రావచ్చు.
కండరాలు తీవ్రంగా అలసిపోవడం, వ్యాయామానికి ముందు తగినంతగా స్ట్రెచ్ చేయకపోవడం, రక్తంలో ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం, ఫాస్ఫేట్) పరిమాణం తగ్గిపోవడం ఇందుకు దారితీస్తాయి. ఒక్కోసారి పైన పేర్కొన్న వాటిలో ఒకటి కంటే ఎక్కువ అంశాలు మజిల్‌క్రాంప్స్‌కు దారితీస్తాయి. మంచి పోషకాహారం, కంటి నిండా నిద్ర, వ్యాయామం ప్రారంభించడానికి ముందు స్ట్రెచింగ్ వంటి జాగ్రత్తలతో మజిల్ క్రాంప్స్‌ను నివారించవచ్చు. అయినప్పటికీ మజిల్ క్రాంప్స్ వస్తుంటే వెంటనే డాక్టర్‌కు చూపించుకోవాలి.
డాక్టర్ దేవేందర్ సింగ్, సీనియర్ వాస్క్యులార్ అండ్
ఎండోవాస్క్యులార్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్