రెండోరోజు అలంకారం బాలాత్రిపురసుందరి
దేవీనవరాత్రులు
నిర్మలమైన మనస్సుకూ, నిత్యసంతోషానికీ చిహ్నాలు చిన్నారులు. నవరాత్రి వేడుకలో ఈ రోజు అమ్మవారిని బాలాత్రిపురసుందరిదేవిగా అలంకరిస్తారు. బాల్యం దైవత్వంతో సమానమని ప్రతీకాత్మకంగా నిరూపించడమే ఈ అలంకరణ ఆంతర్యం. బాలారూపంలో అమ్మను దర్శించే భక్తులకు ఎటువంటి మనోవికారాలకు లోనుకాని ప్రశాంత చిత్తం కలుగుతుందని విశ్వాసం.
దిక్కులన్నిటినీ కాంతిపుంజాలతో నింపుతూ జ్ఞానాన్ని ప్రదానం చేసే అభయ హస్తంతో, వరదానం చేస్తూ స్ఫటికమాల, విద్యాప్రదాయినిగా, పుస్తకాన్ని, ఎర్రకలువను చేత ధరించి చతుర్భుజాలతో మోమున చిరు మందహాసంతో శ్రీబాలాత్రిపురసుందరీదేవి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది.
శ్లోకం : దధానాకర పద్మాభ్యామక్షమాలా కమండలూ! దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యమత్తమా!
భావం : వరదాభయ హస్తాలతో జ్ఞానం అనే అక్షరమాలను స్ఫటికమాలను ధరించి జ్ఞానప్రదానం చేయుము జగద్ధాత్రీ!
అర్చన, సందర్శన ఫలమ్ : ఉన్నతవిద్య, విశేషజ్ఞాన సంపదలు చేకూరతాయి.
నివేదన : కట్టెపొంగలి, దధ్యోదనం