బాకాసురులు
సోల్ / స్వోత్కర్ష
ఎక్కువగా మౌనాన్ని ఆశ్రయించే అంతర్ముఖులు పెద్దగా స్వోత్కర్షకు పాల్పడరు గానీ, ఇంటా బయటా వాగుడుకాయలుగా పేరుమోసిన బహిర్ముఖులు మాత్రం అవకాశం చిక్కినప్పుడల్లా ఎంతో కొంత స్వోత్కర్షకు పాల్పడుతూనే ఉంటారు. కొందరిలో ఈ లక్షణం కాస్త అతిగా ఉంటుంది. నలుగురూ పోగైన చోట అలాంటి వాళ్లను కాస్త కదిపితే చాలు.. తేనెతుట్టెను కదిలించినట్లే! ఇక మొదలెడతారు సొంతడబ్బా మోత.. అలసట చెందే వరకు లేదా అంతరాయం కలిగే వరకు వాళ్లు ఆ మోతను మోగిస్తూనే ఉంటారు.
ఆ మోత ధాటికి వినేవాళ్ల చెవులు దిబ్బెళ్లెక్కడమే కాదు, మైండ్ బ్లాకవుతుంది కూడా. ఇలాంటి వాళ్లే డబ్బారాయుళ్లుగా పేరుమోస్తారు. డబ్బారాయుళ్లకు సమయ సందర్భాలతో నిమిత్తం ఉండదు. తమ మాటలు వినే బకరాలు దొరికితే చాలు, వాళ్లకు పూట గడిచిపోతుంది. స్వోత్కర్షను పెద్దలు అవలక్షణంగా పరిగణిస్తారు గానీ దీనిని అంత తేలికగా తీసిపారేయలేం.
మోతతోనే మేత
చాలామందికి ఈ లక్షణమే జీవనోపాధి. కొన్ని వృత్తులకు ఈ లక్షణం తప్పనిసరి కూడా. పోటీ యుగంలో వ్యాపారాలు నిలదొక్కుకోవాలంటే, సొంతడబ్బా మోతకు మించిన మార్గమే లేదు. ఇదేదో డబ్బా మోతే కదా అని చిత్తమొచ్చిన రీతిలో మోగిస్తే కుదరదు. పైగా, అలాంటి మోత వికటించే ప్రమాదాలూ లేకపోలేదు. అందువల్ల ఆచి తూచి జనాల మెదళ్లలో కదలిక తెచ్చేస్థాయిలో కొంచెం లయబద్ధంగా, ఇంచుక శ్రావ్యంగా మోగించాలి. ఇదొక కళ. దీనికే అడ్వర్‌టైజ్‌మెంట్... ప్రాపగాండా... అని రకరకాల మోడర్న్ పేర్లు ఉన్నాయి. ఎంత మోతకు అంత మేత.
కళాత్మకంగా సొంత డబ్బాను ప్రచారం చేసుకోగలిగే వారికి బువ్వకు లోటుండదు. జీవితం నల్లేరు మీద బండి నడకలా సాఫీగా సాగిపోతుంది. సొంతడబ్బాకు లౌక్యమూ, చాకచక్యమూ తోడైతేనా... ఇక తిరుగే ఉండదు. అలాంటి శాల్తీలు అనతికాలంలోనే ఏకంగా దేశనాయకులుగా అవతరిస్తారు. అలాంటి వారి డబ్బా మోతకు పత్రికలు, టీవీ చానళ్లు లౌడ్‌స్పీకర్లలా ఉపయోగపడుతుంటాయి. రాచరిక కాలంలో మహా మహారాజులకు, చక్రవర్తులకు సొంతడబ్బా మోగించుకునే లక్షణం ఎంతో కొంత ఉన్నా, పాపం వారికి ఆ అవకాశం ఎక్కువగా ఉండేది కాదు.
రాజాధి రాజులు, చక్రవర్తుల డబ్బా మోగించడానికి వారి చుట్టూ వందిమాగధులు మందలాదిగా ఉండేవారు. ఇది ప్రజాస్వామిక యుగం. పల్లకిమోసే బోయీలు కనుమరుగైపోయిన కానికాలం ఇది. నాయకమ్మన్యుల ఘనతను వేనోళ్ల పొగుడుతూ స్తోత్రపాఠాలు చదివే వందిమాగధులు అంతరించిపోయిన శకం ఇది. ఇలాంటి యుగంలో ప్రతిఫలం లేకుండా మన ఘనతను చాటేవారు ఎవరూ ఉండరు. అయితేనేం? మన ఘనతను ఎవరూ చాటకుంటే, మనమే చాటుకుందాం అన్నదే నేటి సిద్ధాంతం.
‘కన్యాశుల్కం’ కథానాయకుడు గిరీశం ప్రవచించిన సిద్ధాంతం ఇదే. పార్టీలకు అతీతంగా ఇప్పటి మన రాజకీయ నాయకులు అనుసరిస్తున్నదీ ఇదే. అందుకే, ఎన్నికలవేళ రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోలన్నీ వాటి సొంతడబ్బాలే. ఎవరి డబ్బా బాగా మోగితే, వారిదే గెలుపు, వారిదే అధికారం.
సోది పురాణం
స్వోత్కర్ష ఆధునిక లక్షణమేమీ కాదు. మానవజాతిలో ఆది నుంచి ఉన్న లక్షణమే. పురాణ పురుషులందరూ ఇలాంటి అవలక్షణం లేని సత్తెకాలపు అమాయకులే అనుకుంటే తప్పులో కాలేసినట్లే! పురాణ పురుషులను పొగడటానికి వారి వారి వందిమాగధ గణాలు ఉండేవి. తమను తాము పొగుడుకునే అవసరం పెద్దగా ఉండేది కాదు. అయినా, వందిమాగధుల పొగడ్తల డోసు చాలదనిపించినప్పుడు కొందరు విజృంభించి మరీ స్వోత్కర్షను వినిపించేవారు. తమ ఘనతను చాటుకొనేందుకు పద్యగద్యాలతో సొంత డబ్బాను మోగించుకునేవారు.
పలు పురాణాలలో ఇలాంటి ఉదాహరణలు కొల్లలుగా దొరుకుతాయి. రామాయణంలోని ఒక ఉదాహరణను చెప్పుకుందాం. విశ్వామిత్రుడి వెంట జనస్థానానికి వెడలిన రామలక్ష్మణులు అక్కడ అరాచకం సృష్టిస్తున్న రాక్షసులను మట్టుబెట్టారు. రామలక్ష్మణుల చేతిలో ఖరదూషణులు మరణించడంతో, అకంపనుడు ప్రాణభీతితో లంకకు చేరుకుని, రావణుడికి జరిగినదంతా చెప్పాడు. అప్పుడు చూడాలి రావణుడి ఆగ్రహం. ఆ ఆగ్రహంలోనే లంకాధీశుడు సొంతడబ్బా మోతకు లంకించుకున్నాడు.
‘నా పేరు చెబితేనే మూడు లోకాలూ గజగజ వణికిపోతాయే! ఈ సాహసానికి ఒడిగట్టిందెవరు? నేను సూర్యుడిని, అగ్నిహోత్రుడిని కూడా కాల్చేస్తానే! అలాంటి నాకు ఆగ్రహం తెప్పించిందెవరు? చెప్పు..’ అంటూ అకంపనుడి మీద విరుచుకుపడ్డాడు. రామాయణ కాలంలో సొంత డబ్బా పాపం ఈ స్థాయిలోనే ఉండేది. అల్ట్రామోడర్న్ కాలంలో సొంతడబ్బా హైటెక్కుటమారాలను సంతరించుకుని, ఆ విధంగా ముందుకుపోతోంది.
సుత్తి లయలు
సొంత డబ్బా కొట్టుకోవడాన్నే, సొంత బాకా మోగించుకోవడం అని కూడా అంటారు. డబ్బా మోతలో లయ ఉంటుంది. బాకా మోతలో శ్రుతి ఉంటుంది. జనాల కర్మకాలి రెండూ ఏకకాలంలో మోగితే, కర్ణభీకర సంగీతం పుడుతుంది. సాధారణంగా ఎన్నికల సమయంలో ఇలాంటి సంగీతమే జనాలను ఓలలాడిస్తూ ఉంటుంది. పత్రికల ద్వారా, టీవీ చానళ్ల ద్వారా, వెబ్‌సైట్ల ద్వారా ఈ సంగీతమే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది కూడా.
సొంతబాకాను దిక్కులు పిక్కటిల్లేలా వినిపించేవాళ్లనే బాకాసురులనవచ్చు. సత్తెకాలపు పెద్దలు స్వోత్కర్షను అవలక్షణంగా ఎంచారు గానీ, నిజానికి దీనిని లలితకళగా పరిగణించాలి. స్వోత్కర్ష చేతగాని వాళ్లను ఆధునిక సమాజం దద్దమ్మలుగానే పరిగణిస్తుందనేది తిరుగులేని బహిరంగ రహస్యం. డబ్బా లయను, బాకా శ్రుతిని చిన్ననాటి నుంచే వంటబట్టించుకోవడం ఈ మాయలోకంలో మనుగడ సాగించడానికి అత్యవసరం.
స్వోత్కర్షను పాఠశాల స్థాయి నుంచే సిలబస్‌లో చేరిస్తే, భావిపౌరులు బాగుపడగలరని, ఆ విధంగా వారి భవిష్యత్తుకు బంగారు బాట ఏర్పడగలదని నిక్కచ్చిగా చెప్పవచ్చు. అందువల్ల మన శాసనకర్తలెవరైనా ఈ దిశగా కృషిచేస్తే, మన దేశం అభివృద్ధి పథంలో ఎక్కడికో వెళ్లిపోగలదని కూడా నిర్మొహమాటంగా చెప్పవచ్చు.