
ఇంట ఆమె గెలిచింది... రచ్చ ఆయన గెలిచాడు
చెఫ్... అని గూగుల్‌లో ఇమేజెస్ వెతకండి... అందులో ఎంతమంది ఆడవాళ్లున్నారో లెక్కపెట్టండి. మౌస్‌ను ఎంత కిందికి దించినా కనపడటం లేదా? ప్రతి ఇంట్లోనూ స్త్రీ చేతి వంటే మనం తింటున్నాం. కానీ దాదాపు ప్రతి హోటల్లోనూ పురుషుడే మనకు వండి పెడుతున్నాడు.
దీనికి కారణాలేంటని ఆరా తీస్తే సమాధానాలు, విశ్లేషణలు బోలెడొచ్చాయి. స్త్రీకి మానసికంగా సహనం ఎక్కువే ఉండచ్చు గాని శ్రమతో కూడిన సహనాన్ని భరించడానికి ఆమె శరీర నిర్మాణం అనుకూలంగా ఉండదు. గతంలో గ్యాస్ స్టౌలు, పనిని సులువు చేసే ఆధునిక పాత్రలు, ఇతర సదుపాయాలు లేకపోవడంతో, ఎక్కువమందికి ఒకేసారి వంట చేయడం స్త్రీలకు కష్టమయ్యేది. సహాయకులను పెట్టుకుందామన్నా, మగసహాయ కులు కావాలి. అప్పటి సమాజం దీనిని పూర్తిస్థాయిలో అనుమతించలేదు. వంట బాగా వచ్చిన స్త్రీలు... సొంత ఇంటి వేడుకల వరకు ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేవారు. వృత్తిగా స్వీకరించడానికి అనువైన పరిస్థితు లు ఉండేవి కావు. దీంతో స్త్రీలకు సామర్థ్యాలున్నా ఈ రంగంలోకి రాలేదు. ఎక్కువమంది స్త్రీలు చెఫ్‌లుగా లేకపోవడానికి ప్రధాన కారణం ఇదే.
ఏదైనా ఒక రంగంలో స్త్రీలు అసలు వేలు పెట్టే పరిస్థితులే లేనపుడు, తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారినా అది అందరికీ తెలిసి, దానిని అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఆ విషయం సమాజం అంగీకరించడానికి మరింత సమయం పడుతుంది. అందుకే స్త్రీలు చెఫ్‌లుగా రాణించే పరిస్థితులు కొన్నేళ్ల క్రితమే వచ్చినా వారు ఈ రంగం వైపు మొగ్గు చూపలేకపోయారు. ఇంకో విషయం.. వంట ఓ కళ. స్త్రీలకు మాత్రం వంట ఒక దినచర్య. పైగా ఇళ్లలో కుటుంబసభ్యుల ఆకలి తీర్చడం ప్రధానం. అందువల్ల వంటను ఒక కళగా, ప్రయోగాలు చేసే అంశంగా స్త్రీలు చూసేవారు కాదు. మరో కారణం ఏంటంటే... ఈ రంగంలో గతంలో వేతనాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఖరీదైన రెస్టారెంట్లు, ఫైవ్‌స్టార్ హోటళ్లు రావడం, ప్రజలు తినడానికి బయటకు వెళ్లడాన్ని ఇష్టపడుతుండటం వల్ల అవకాశాలు బాగా పెరిగాయి. వాటితోపాటు ఆదాయం కూడా పెరిగింది.
దీంతో ఇప్పుడు స్త్రీలు చెఫ్ లుగా రాణించే అవకాశాలు పెరుగుతున్నాయి. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో చేరుతున్న స్త్రీల శాతం పెరుగుతోంది. కాకపోతే ఈ టైమింగ్స్ వారిని ఇంకా నియంత్రిస్తున్నాయి. కొత్తగా వచ్చిన వెసులుబాటు ఏంటంటే... గతంలోలా భారీ పాత్రలతో డీల్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే... ఆర్డర్లకు అనుగుణంగా ‘చెఫ్’లు వాటిని ఇద్దరు, ముగ్గురు, మహా అయితే ఏడెనిమిది మందికి సరిపడే తక్కువ పరిమాణాల్లో వండితే చాలు. ఏదేమైనా తమకు బాగా తెలిసున్న పనిలో స్త్రీలు ఇంత ఆలస్యంగా రావడం ఒక విచిత్రం!
- ప్రకాశ్ చిమ్మల