
పోరుసత్వం
సింగరేణి సంస్కరణలో భాగంగా ఆ యాజమాన్యం తొలగించిన కార్మికులను మళ్లీ విధుల్లోకి చేర్చుకోవాలంటూ ఓ డిసి్‌మస్డ్ కార్మికుడి
సింగరేణి సంస్కరణలో భాగంగా ఆ యాజమాన్యం తొలగించిన కార్మికులను మళ్లీ విధుల్లోకి చేర్చుకోవాలంటూ ఓ డిసి్‌మస్డ్ కార్మికుడిగా పదేళ్ల క్రితం తన తండ్రి చేపట్టిన ఒంటరి పోరును ఆయన మరణానంతరం కూడా నేటికీ కొనసాగిస్తున్నారు రాధిక. తండ్రి నుంచి ఉద్యమ వారసత్వం పొందిన ఆమె... ‘కార్మికులకు నేనున్నా’నంటూ వారితో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు చేయడంతో పాటు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన సింగరేణి డిస్మిస్డ్ కార్మిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రామిల్ల రాజలింగు కూతురైన రాధిక పోరాట నేపథ్యం గురించి ఆమె మాటల్లోనే...
నాన్న, అమ్మ పద్మ, చెల్లి సురేఖ... ఇదీ మా కుటుంబం. మాది మందమర్రి. అమ్మ మంచిర్యాల ఏరియా ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సు. మా చదువు, అమ్మ ఉద్యోగం రీత్యా మేం చిన్నప్పుడే మంచిర్యాలకు వచ్చేశాం. నాన్న మాత్రం మందమర్రిలోనే ఉండిపోయారు. అప్పుడప్పుడు మంచిర్యాల వచ్చి వెళ్లేవారు. మాకు ఊహ వచ్చిన తర్వాత నాన్నను కలిసిన సందర్భాలు తక్కువ. అమ్మే కష్టపడి మమ్మల్ని చదివించింది. ఇప్పుడు నేను ఇండస్ట్రియలిస్ట్‌ని. నా భర్తతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నా.
పోయాకే తెలిసింది!
ఫిబ్రవరి 09, 2014 మా నాన్న చనిపోయిన రోజు. అప్పుడు నేను హైదరాబాద్‌లో ఉన్నా. నాన్న చనిపోయిన సంగతి తెలిసిన వెంటనే మందమర్రికి బయల్దేరా. నాన్న పార్థివదేహాన్ని ఆయన దీక్షకు కూర్చొన్న శిబిరం దగ్గరే ఉంచడంతో.. ఆయన్ను చూడడానికి చాలా మంది వచ్చారు. ఎక్కువ మంది గుమిగూడితే గొడవ అవుతుందని భావించిన పోలీసులు భౌతికకాయాన్ని బలవంతంగా శ్మశానానికి తరలించారు. నేను వెళ్లే సరికే అంతిమయాత్ర అయిపోయింది. నేనే అంత్యక్రియలు చేశా. అప్పుడు అక్కడున్న వాళ్లు చెప్పారు మా నాన్న గడిపిన జీవితం గురించి. ఆయన ఆశయం గురించి. అప్పటి వరకు డి స్మిస్డ్ కార్మికుల గురించి నాన్న చేపట్టిన న్యాయపోరాటం గురించి మాకు తెలిసింది కొంతే. కానీ నాన్న చనిపోయిన తర్వాత.. ఆయన చేపట్టిన ఉద్యమం.. చేసిన పోరాటం గురించి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లు చర్చించుకుంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. ‘‘బతికిన్నాళ్లూ మా కోసమే బతికాడు. ఎవరి దగ్గరా చేయి చాపలేదు. ప్రయాణానికి డబ్బు లేకపోతే మందమర్రి నుంచి మంచిర్యాల వరకు (15కి.మీ) నడుచుకుంటూ వెళ్లేటోడు. ఆకలైనా చెప్పుకొనేటోడు కాదు. తినడానికి లేకపోతే తాగి పడేసిన కొబ్బరిబొండాల్లో నుంచి కొబ్బరి తీసి తిన్నాడమ్మా మీ నాన్న’’ అని నాన్న స్నేహితులు చెప్పడం నన్ను కలిచివేసింది. పదకొండో రోజు పిండప్రదానం చేయడం సంప్రదాయం. ఇంట్లో మగ పిల్లలు లేకపోవడంతో పిండ ప్రదానం చేయాలని నేనే మందమర్రిలోని యాపల్ ప్రాంతానికి వెళ్లా. కానీ నా కంటే ముందే అక్కడ వందకు పైగా డిస్మిస్డ్ కార్మికుల పిల్లలు మా నాన్నకు పిండ ప్రదానం చేయాలని ఉండడం చూసి నా కళ్లనిండా నీళ్లు వచ్చాయి. నాతో పాటు అందరూ మా నాన్నకు పిండ ప్రదానం చేశారు. నాన్న చేసిన ఉద్యమం నాకు తోబుట్టువులనూ ఇచ్చిందని తెలుసుకున్నా. ఇలాంటి పలు సంఘటనలు నన్ను మా నాన్న ఆశయ సాధన వైపు అడుగులేసేలా చేశాయి.
నిరసనలు... విజ్ఞప్తులు
డిస్మిస్డ్ కార్మికులతో, వారి కుటుంబ సభ్యులతో కలిసి నేటికీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. నాయకులకు, అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నా. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని డిస్మిస్డ్ కార్మిక సంఘ నేతలు కొప్పుల భాస్కర్ (కొత్తగూడెం), బుర్ర సారయ్య (భూపాలపల్లి)తో కలిసి ఉద్యమాలు చేపడుతున్నా. నాన్న ప్రారంభించిన పోరాటాన్ని కార్మికుల సమస్య పరిష్కారమయ్యేంత వరకు కొనసాగించాలన్నదే నా ఆశయం.
వేలమంది కోసం ఒక్కరు
రాధిక తండ్రి రామిల్ల రాజలింగు 2004 మే 24 న ఒంటరిగా దీక్షలో కూర్చున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఉన్న సుమారు 7వేల మంది డిస్మిస్డ్ కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 2006లో మందమర్రి నుంచి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం వరకు, 2009లో మందమర్రి నుంచి హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ వరకు పాదయాత్ర చేశారు. చివరకు తన ఆశయం కార్యరూపం దాల్చకుండానే ఏడాది క్రితం తుది శ్వాస విడిచారు.