ఒక మారుమూల సముద్రంలో ఒక ద్వీపం ఉంది. ఓడల మీద సముద్రాలను నాగరకులు గాలించారు. నాగరకులు సర్వ ప్రపంచము, సముద్రపు నీళ్లలో తేలిన ప్రతిమంటిగడ్డ తాము సాధించామని అనుకొన్న తరువాత ఆ ద్వీపం ఉన్నదని తెలుసుకునేందుకే కొన్ని వేల యేండ్లు పట్టినవి. తెలుసుకోవటమే ఆలస్యము. మతాలు, వర్తకులు, తుపాకులు అక్కడికి చేరినవి. ఒక నాగరకజాతి సేనానాయకుడు ఆ ద్వీపానికి సైనిక నియంత. అతడు బ్రహ్మచారి. అనగా అవివాహితుడన్నమాట. ఆ ద్వీపము శీతమండలాల్లో ఉండటం మూలంగా అక్కడి జనులు తెల్లనివాళ్లు. ఇతర ఖండములలోని అనాగరకులవంటివారు. అనగా కోట్ల కొలది సంవత్సరాలు బ్రతికిన జాతి అన్నమాట. చెట్టులో– పుట్టలో, సూర్యునిలో – చంద్రునిలో, మెరుపులో– మేఘములోనేదో దివ్యశక్తి యున్నదని దాని నారాధించినవాళ్లు. జీవుణ్ణి కాలిక్రిం బెట్టి త్రొక్కరు. బంగారము నాణెముగా వాడుకోరు. దానియందు తేజశ్శక్తి ఉన్నదని ఆరాధిస్తారు. కుండపెంకులలో వండుకొని తింటారు. లోహపాత్రలు నాగరకత అని యెరుగరు. శరీరావయవములు కావలసినంత మాత్రము కప్పుగొంటారు. ఈ యనాగరకులు నాగరకులయ్యే రోజులు వచ్చి ఆ ద్వీపం నాగరకుల కంట బడ్డది.
సైనిక నియంత ఒక స్త్రీని చూచాడు. ఆమె అందం అతని కళ్లు పట్టరాకండా ఉండిపోయింది. ఆవిడ మొగుడికి కబురు పంపించాడు– నీ భార్యని నాకు తోలిపెట్టమని. ఆ జీవుడు యేమి చేస్తాడూ? ఇదివరకే తమ ద్వీపంలో జరిగిన ఘోరాలు తెలుసు. అయినా జీవుడు పెనగులాడటం స్వభావం. అది అన్యాయ మని, తన ప్రాణము పోయినా భార్యను వదిలిపెట్టనని కబురంపించాడు. నియంతకు కోపం వచ్చింది. పదిమంది సైనికులు, తుపాకులతో వాని యింటికి వెళ్లాడు. వీళ్లు వస్తారని తెలిసి పొయ్యిలో పెట్టుకొనే పొడుగాటి పుల్లలు తానొకటి, తన పెద్ద కొడుకొకటి చేతులతో పుచ్చుకొని, గుడిసె ముందర నిలుచున్నారు. వారి యాయుధాలను చూస్తే నియంతకు నవ్వు వచ్చింది. అతడు ‘‘ఎందుకు నవ్వుతావు’’ అని యడిగాడు. నియంత అన్నాడు: ‘‘ఓరి మూర్ఖుడా! మా తుపాకులముందు నీ కట్టెపుల్లలు నిలుస్తావా?’’. అతడన్నాడు కదా– ‘‘నా కట్టెపుల్లలు నీ తుపాకులకు సమాధానము చెపుతవని గాదు నే నీ కర్రలు పుచ్చుకొన్నది. నా మనస్సు నీ మనస్సుకు సమాధానం చెప్పవలెనని.’’
ఒక్క కత్తి విసరుతో తండ్రీకొడుకుల తలలు తెగిపోయినవి. నియంత గుడిసెలో ప్రవేశించి అతని భార్యను తీసుకు రాబోయినాడు. ఆరేండ్ల మొదలు చనుబాలు త్రాగే శిశువు వరకు నలుగురు పిల్లలు ఏడవ మొదలుపెట్టారు. ఆ స్త్రీ భర్త శవం, కొడుకు శవం మీదబడి యేడవటం మొదలుపెట్టింది. సైనికులు శవాలను సముద్రంలో పారవేశారు. ఆమె యింక పిల్లలను పట్టుకొని యేడవటం మొదలుపెట్టింది. సైనికులు నియంత ఆజ్ఞతో పెద్దపిల్లలను ముగ్గురినీ తల్లి చేతులలోంచి లాక్కుని పదిపదకొండు సార్లు విదిలించి వేయగా వేయగా వాళ్లు దెబ్బలు తగిలి, ఉస్సురని ప్రాణాలు కడవట్టి చనిపోయినారు. ఆ స్త్రీ పాలుత్రావు పిల్లతో నియంత యింటికి వెళ్లింది.
ఈ కథ జరిగి అయిదేళ్లయింది. ఆ స్త్రీ ఆ పిల్లతో కాలం పుచ్చుతోంది. నియంత– ఆ పిల్లకూడ పోతేగానీ నీవు నాతో సరిగా ఉండవు. స్త్రీ– నీకన్న కర్కోటకుడవు నీవే! ఈ పసిపిల్ల ప్రాణములు కూడా తీస్తావా? నియంత– నిన్ను తీసుకువచ్చినప్పుడు ఇది పసిపిల్ల. ఇప్పుడు కాదే! దీని యీడు పిల్లలను అప్పుడు నీ దగ్గరనుండి లాగివేయలేదా? అట్లాగే యిప్పుడూను. ఆ స్త్రీకి అతనితో అయిదేండ్లున్న తరువాత అతని యేమాటకు ఎంత అర్థమో తెలిసినది. తన బిడ్డ తనకు మిగలదని తెలిసింది. పిల్లను చేతిలో పెట్టి ‘‘యిదిగో, చంపివేయి. ఈ పిల్ల ఉన్నన్నాళ్లు నేను దానిని వదిలిపెట్టలేను’’ అన్నది. అతడు ఆ పిల్లను నరికాడు. ఆమె యేడుస్తూ వెళ్లిపోయింది.
ఆమె కొన్ని రాత్రులు ఉరి పోసుకుందామనుకుంది. పోసికోలేదు. సముద్రములో బడి చద్దామనుకుంది. చావలేదు. కిరసనాయిలు మీద పోసికొని నిప్పు ముట్టించుకుందా మనుకుంది. ముట్టించుకోలేదు. యెన్నో అనుకుంది. ఏమీ చేయలేదు. కొన్నాళ్లకు ఒక రాత్రి నియంత తప్ప త్రాగి మదించిన కళ్లతో ఆమె గదికి వచ్చాడు. నియంత– నీ మగడు, నీ పిల్లలు పోయి పదేళ్లయింది. స్త్రీ– నా ద్వీపపు స్వాతంత్య్రం పోయి పాతిక యేండ్లయింది. నియంత– ఇంకా యెన్నాళ్లీ దుఃఖం? స్త్రీ– ఈ శరీరం వున్నన్నాళ్లు. నియంత– నీకు ఏమి తక్కువగా ఉంది? పూర్వంకన్న మంచిదుస్తులు ధరిస్తున్నావు. మంచి భోజనం చేస్తున్నావు. నీ జాతికన్న నా జాతి గొప్పది. నీ భర్తకన్న నేను గొప్పవాడను. స్త్రీ– నా భర్తకన్న గొప్పవాడవు కావు.
నియంత– కానా!
స్త్రీ– భార్య పిల్లలను రక్షించుకునేందుకు కర్రపుచ్చుకొని నిలబడ్డాడు. రక్షించలేనని తెలుసు. అయినా తన ధర్మం తాను చేశాడు. తాను చచ్చిన తరువాతగాని నిన్ను నా దగ్గరకు రానీయలేదు. నేను నిజముగా నీ భార్యనై ఉంటే నీకన్న బలవంతుడు నాకోసం వస్తే, నీవు పారిపోయేవాడవు. నియంత– మరి యిటువంటివాడితో నీవు సంసార మెందుకు చేస్తున్నావు? స్త్రీ– నేను నీతో సంసారము చేయుట లేదు. నియంత– ఈ మాటలు వింటే యెవరైనా నిన్ను మూఢురాల వనుకొంటారు. స్త్రీ– నేను వాళ్లని మూఢులనుకొంటాను. నియంత– అయితే నీకు నాతో ఉండటం యిష్టం లేదన్నమాట. స్త్రీ– లేదని నీతో చెప్పుట యిది యెన్ని లక్షలో సారి. నియంత– నిన్ను చంపేస్తాను.
స్త్రీ– పదియేళ్ల నుండి అల్లా చేస్తావేమోయని యెదురు చూస్తున్నాను. నియంత– నీకు చావంటే అంత యిష్టమా? స్త్రీ– అంతాయింత యిష్టమా! నియంత– ఎందుకు చావవు? సముద్రంలో పడి చావవచ్చు. ఉరి పోసికొని చావవచ్చు. స్త్రీ– నా కట్లా చావటం యిష్టం లేదు.
నియంత– ఎట్లా చావటం యిష్టం? స్త్రీ– నీకు కోపము తెప్పించి నువ్వు నన్ను చంపితే చావాలని. నియంత– అంటే, నీకు నామీద ప్రేమ ఉన్నదన్నమాట. స్త్రీ– అవును, ఉంది. నా భర్త, నా పిల్లలు నీ చేతిమీదుగా చచ్చారు గనుక అల్లా నీ చేతిమీదుగానే చద్దామన్నంత ప్రేమ. నియంత– ఈ మాటల కేమిగాని నీకు చావటానికిష్టం లేదు. స్త్రీ– పొరపాటు. చావటాని కిష్టం ఉన్నది. ఆ యిష్టము కూడా ఒళ్లంతా తగలబెడుతూ ఉన్నంత యిష్టం. కాని చావు రెండు రకాలు. తనంతట తాను చచ్చే చావు. యెదటివాళ్లు చంపితే చచ్చేచావు. నాకు రెండవ చావే యిష్టం. నియంత– అంటే నాతో కలిసి సుఖించడం యిష్టమన్నమాట.
స్త్రీ– నీవు పశువువు. నీ నాగరకత అంతా నీవు చేసే సురాపానంలో, ధరించే దుస్తుల్లో, తుపాకి మందులో ఉంది. నీ మనసులో లేదు. నీ జాతిలో లేదు. నేను బ్రతుకుచున్నానన్న విషయం నీకాశ్చర్యంగా ఉంది. ఉరి పోసికునో, సముద్రంలో పడో చావటం నా జీవుడికి యిష్టం లేదు. నా జీవుడు ఈ శరీరాన్ని పట్టుకున్నాడు. వాడంతట వాడు వదలిపోడు. ఆ నా చనిపోయిన భర్తకోసం, పిల్లల కోసం గుండె అటమటించి చావటం, మహాగ్ని జ్వాలలలో మ్రగ్గిపోవటం ఈ జీవుడికి యిష్టం. ఈ జీవుడికి యిది యొక అనుభవం. చచ్చిపోవటానికి యిష్టపడడు. సౌఖ్య మనుభవిద్దామని కాదు. దుఃఖమనుభవిద్దామని. సౌఖ్యమో, దుఃఖమో ఈ శరీరంతో పుట్టి, యీ శరీరానికి సంబంధించినవి అనుభవించటమే అతని కిష్టం. ఈ శరీరానికి, యీ జీవుడికి యెడతెగరాని లంకె. నా అంతట నేను చావటం నా కిష్టం లేదు. నీవు చంపితే చచ్చిపోవటం యిష్టం. మృత్యువు దానియంతట అది వస్తే యింకా యిష్టం. అట్లాగే ఈ జీవుడు ఈ శరీరంతో తన యిష్టం వచ్చిన సౌఖ్యాన్ని అనుభవించి సౌఖ్యం అనుభవించా ననుకుంటాడు. ఇతరులవల్ల బలవంతంగా చేయబడ్డ అనుభవం అది వాడికి సౌఖ్యం కాదు. అది దుఃఖమే. ఆ దుఃఖమైనా అనుభవించటం అతని కిష్టం.
నియంత– అయితే నీవు నా కక్కర లేదు. స్త్రీ– ఊరికే అనట మెందుకు? నియంత ఆమెను చంపెను. చనిపోవుచున్న యామె పెదవిమీద సంతోషపు నవ్వు తాండవించెను. కొనయూపిరితో నిట్టనెను: ‘‘నీవు నీ జన్మలో చేసిన మంచి పని యిది యొక్కటియే. నేను చనిపోవు చుంటిని గదా! నీవు తరువాత యేమి చేసెదవు?’’ నియంత– మరల నింకొక స్త్రీని సంపాదించెదను. స్త్రీ– నీకు తగిన మాట! నీ జాతికి జీవుని యిష్టము తెలియదు. ఆమె కొన్ని రాత్రులు ఉరి పోసుకుందామనుకుంది. పోసికోలేదు. సముద్రములో బడి చద్దామనుకుంది. చావలేదు. కిరసనాయిలు మీద పోసికొని నిప్పు ముట్టించుకుందామనుకుంది. ముట్టించుకోలేదు. యెన్నో అనుకుంది. ఏమీ చేయలేదు. కొన్నాళ్లకు ఒక రాత్రి నియంత తప్ప త్రాగి మదించిన కళ్లతో ఆమె గదికి వచ్చాడు.
విశ్వనాథ సత్యనారాయణ
లో లొంగదు
Published Mon, Apr 22 2019 12:26 AM | Last Updated on Mon, Apr 22 2019 12:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment