దివ్యా దత్తా, స్మృతి ఇరానీ
లాక్ డౌన్ కాలం అందరిలో ఉన్న అజ్ఞాత ప్రతిభను వెలికితీస్తోంది. అందుకు బాలీవుడ్ తారలు అతీతులేం కాదు. తమ భావాలను చక్కగా లోకానికి వెల్లడిస్తున్నారు. కొన్నాళ్ళ క్రితం ప్రముఖ నటులంతా కలిసి, తమ తమ ఇళ్ళనుంచే స్ఫూర్తిదాయకమైన వీడియో రూపకల్పనలో పాలుపంచుకున్నారు. అదెంత వైరల్ అయ్యిందో అందరం చూశాం. ఇప్పుడు ఒక నటి తన మనసులోని భావాలను చక్కగా వెల్లడించారు. మనం ఏం చేస్తే అందరి మనసులనూ ఆకట్టుకోగలమో... మంచిని పంచగలమో తెలియజెప్పారు.
బాలీవుడ్ ప్రముఖ నటి దివ్యా దత్తా మనసు చాలా సున్నితమైనది. ఆమెలోనూ ఒక అజ్ఞాత కవయిత్రి అంతర్లీనంగా దాగి ఉంది. నటిగా, మోడల్‌గా మాత్రమే కాకుండా కవయిత్రిగా ఇప్పుడు ప్రపంచానికి తనలోని అక్షరాలకు రూపం కల్పించింది. కరోనా నేపథ్యంలో ఒక పద్యం రాసింది. అందులోని భావాలను తన గొంతులో ఎంతో హృద్యంగా పలికించింది. ‘జబ్ సబ్ ఠీక్ హోగా నా’ అంటూ ఒకసారి అందరి హృదయాలను సన్నగా తట్టి లేపింది. ఈ లలితమైన గీతాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఈ విపత్తు నుండి బయటపడి అందరం ఆహ్లాదంగా ఉన్నప్పుడు కూడా మనం ఈ పనులు చేస్తూనే ఉండాలి. మూడురోజులకొకసారి మనవారందరికీ వీడియో కాల్స్ చేస్తున్నాం. మనం వండిన వంటను ఎలా తయారుచేయాలో వాళ్లకి రెసిపీలు చెబుతున్నాం. మార్కెట్‌లో ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుందో తెలియపరుస్తున్నాం. అంతా సద్దుమణిగాక కూడా మనం ఈ పనులు చేస్తూనే ఉండాలి.
పాత ఆల్బమ్స్ చూస్తూ మన బాల్యాన్ని, మధుర క్షణాలను తీయగా ఆస్వాదిస్తున్నాం. వాటిని చూస్తూ చిన్నప్పుడు తలగడలతో కొట్టుకున్న ఆటలు గుర్తు చేసుకుంటున్నాం. ప్రతిరోజూ ఇల్లు శుభ్రం చేస్తున్నాం. ఆర్‌డి బర్మన్ సంగీతం వింటూ ఆనందిస్తున్నాం. అంతా సద్దుమణిగాక కూడా మనం ఈ పనులు చేస్తూనే ఉండాలి.
వీధి కుక్కలను పలకరిస్తూ వాటికి అన్నం పెడుతున్నాం. మంచి నీళ్లు ఇస్తున్నాం. ఇప్పుడు మనకు చేసిన తప్పులు సరిదిద్దుకునే అవకాశం దొరికింది. అంతా సద్దుమణిగాక కూడా మనం ఈ పనులు చేస్తూనే ఉండాలి.
నిత్యం మన పనులను చేయడానికి వస్తున్న పనివారిని పలకరిస్తూ, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటే, వారి ముఖాలపై నర్తించే చిరునవ్వులు చూడండి. మనలను కంటికిరెప్పలా కాపాడుతున్న మన ఇంటి వాచ్‌మ్యా¯Œ ని ‘టీ తాగావా, టిఫిన్ అయ్యిందా, భోజనం చేశావా’ అని కడుపునిండుగా నవ్వుతూ పలకరించండి. ఈ పనులన్నీ అటూ ఇటూ వెళ్తూ చేసేవే.
ఇంకా కోకిల స్వరాన్ని వింటూ, అది ఏ భావంతో పాడుతోందో అర్థం చేసుకోండి. కాకుల కోసం నీళ్లు పెట్టండి. అంతా సద్దుమణిగాక కూడా మనం ఈ పనులు చేస్తూనే ఉండాలి. అంటూ ఎంతో అనుభూతితో రచించిన ఈ పద్యాన్ని, మనసుకి హత్తుకునేలా చదివారు దివ్యాదత్తా.
Comments
Please login to add a commentAdd a comment