ఒంటరి తుంటరి | special chit chat with hero ram | Sakshi
Sakshi News home page

ఒంటరి తుంటరి

Published Thu, May 28 2015 10:52 PM | Last Updated on Sun, Sep 3 2017 2:50 AM

ఒంటరి తుంటరి

ఒంటరి తుంటరి

దేవదాసు  జగడం కి రెడీ. ఎంత మస్కా కొట్టినా గణేశ్‌... రామరామ కృష్ణకృష్ణ అంటూ మసాలా హరి కథ లు చెప్పకుండా
కందిరీగర కుట్టిన ఒంగోలు గిత్తరీ శివం  ఎత్తినట్టు మనందర్నీ పండగ చేస్కో మంటున్నాడు. ఎందుకంటే ప్రేమంట!రి అంటున్నాడు ఈ ఒంటరి తుంటరి!

 
 తెరపై కనిపించి 18 నెలలయినట్లుంది?

  ‘మసాలా’ సినిమా సమయంలో కథలు వినడమే పనిగా పెట్టుకున్నా. అలా విన్న కథల్లో మూడు కథలు బాగా నచ్చాయి. ఆ కథలను డెవలప్ చేసి, ఆ తర్వాత షూటింగ్ మొదలుపెట్టాం. వాటిలో ‘పండగ చేస్కో’ ఒకటి. వాస్తవానికి ‘పండగ చేస్కో’ గత ఏడాది ఆగస్ట్‌లో విడుదల కావాల్సి ఉంది. అలా జరగకపోవడంతో నేను స్క్రీన్‌పై కనిపించి 18 నెలలయ్యింది.

మీ గత చిత్రాలు మూడూ (‘ఎందుకంటే ప్రేమంట’, ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’) ఫెయిలయ్యాయి. మీ మీద ఆ ఎఫెక్టేమీ లేదా? ఇప్పుడో సినిమా వస్తోందంటే నెర్వస్‌గా...?

(మధ్యలోనే అందుకుంటూ...) ఎందుకుండదు? ఫ్లాప్‌ల ఎఫెక్ట్ కచ్చితంగా బిజినెస్ మీద ఉంటుంది. (నవ్వులు...) వ్యక్తిగత విషయానికి వస్తే, నేనూ అందరి లాంటి మనిషినే కదా... కష్టపడి చేసిన సినిమా పోయినప్పుడు డిజప్పాయింట్ అవుతా. కాకపోతే, సర్దుకొని తరువాతి సినిమాలోకి దిగిపోతా. ‘మసాలా’ జరుగుతున్నప్పుడే సినిమాలకు స్క్రిప్ట్ బాగుండడం ముఖ్యమని గ్రహించి, స్క్రిప్టులు వినడం, కొనడం మొదలుపెట్టా.

చాలా స్క్రిప్టులు కొని, సిద్ధం చేశారా?

లైన్ బాగున్నాయని అనుకొన్నవన్నీ తీరా పూర్తి స్క్రిప్టుగా రెడీ చేసినప్పుడు బాగుండకపోవచ్చు. మొత్తానికి కొన్ని పూర్తి బౌండ్ స్క్రిప్టులు తయారయ్యాయి. తాజాగా ‘పండగ చేస్కో’, ఇప్పుడు సెట్స్ మీద ఉన్న ‘హరి (గాడి) కథ’, ‘శివమ్’ అలా కొని, తయారు చేసుకున్న కథలే. 2014 అంతా నేను ఖాళీగా ఉన్నట్లు కనిపించినా ఈ ఏడాది మూడు సినిమాల షూటింగ్‌లు, మూడు రిలీజ్‌లతో బిజీగా ఉండగలిగా.
     
ఆ మధ్య కొంచెం సన్నబడినట్లున్నారు?


‘పండగ చేస్కో’ కోసం తొమ్మిది కిలోలు తగ్గాను.
     
ఇంజక్షన్స్ ద్వారా అయితే సులువుగా తగ్గిపోవచ్చట?

     
తగ్గొచ్చు కానీ అది మంచిది కాదు. బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా అది సహజంగానే జరగాలి.
     
తొమ్మిది కిలోలు ఎలా తగ్గారు?

 
ముందు ఈ  చిత్రంలోని పాత్రకు తగ్గ కాస్ట్యూమ్స్ కొన్నాను. నా సైజ్‌కన్నా కొంచెం చిన్న సైజ్ డ్రెస్‌లు కొనుక్కున్నాను. వాటికి తగ్గట్టుగా తగ్గా. వర్కవుట్స్, డైట్.. ఈ రెంటినీ సక్రమంగా పాటించి బరువు తగ్గా.
     
మరి.. మళ్లీ పెరగడానికి కారణం?
     
{పస్తుతం ‘శివమ్’ సినిమా కోసం పెరగాల్సి వచ్చింది. నాలుగైదు కిలోలు పెరిగాను.
     
మీరు సినిమాల్లో చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తారు. విడిగా కూడా హైపర్ యాక్టివా?

     
ఇష్టమైన పని చేసేటప్పుడు తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది. నేను విడిగా కూడా చాలా యాక్టివ్.

మీ అల్లరిని కంట్రోల్ చేయడానికి మీ అమ్మగారు చాలా ఇబ్బందిపడేవారేమో! మీ బ్రదర్, సిస్టర్ ఎలా ఉండేవారు?

ఇద్దరూ సెలైంటే. నేనేమో బాగా అల్లరి. అన్నయ్య కోటా అల్లరి, నా కోటా అల్లరి కలిపి నేనే చేసేవాణ్ణి. కంట్రోల్ చేయడానికి అమ్మ కష్టపడేది.
     
సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరూ లేరా?

     
అందరితో పరిచయాలు ఉన్నాయి. కానీ, ఇంటికెళ్లిపోయి టైమ్ స్పెండ్ చేసేంత క్లోజ్ కాదు. నా సెకండ్ స్టాండర్డ్ ఫ్రెండ్సే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు.

 పార్టీల్లో పెద్దగా పాల్గొనరట?

అవును. ఆ సబ్జెక్ట్‌లో నేను బాగా వీక్. పార్టీలకు వెళ్లను. ఇండస్ట్రీలో ఉన్నవాళ్లతో క్లోజ్ కాకపోవడానికి అదొక కారణం అయ్యుండొచ్చు.
     
పార్టీయింగ్ మీద సదభిప్రాయం లేదా?

అలా ఏం లేదు. పార్టీలు చేసుకుంటే తప్పేం కాదు? కానీ, నాకు ఇష్టం ఉండదు. అందుకే వాటికి దూరంగా ఉంటాను. మామూలుగా రోజంతా కష్టపడ్డాక ఓ పార్టీకి వెళ్లి రిలాక్స్ అవ్వాలని కొంతమంది అనుకుంటారు. కానీ ‘అబ్బా.. పార్టీకి వెళ్లాలా?’ అని నేననుకుంటాను. నాకెందుకో అవి పెద్ద ఎంజాయబుల్‌గా అనిపించవు.

మరి.. మీకు ఎంజాయబుల్‌గా అనిపించేది ఏంటి?
   
పొద్దున్నే షూటింగ్‌కెళ్లి, మర్నాడు షూటింగ్‌కెళ్లి, ఆ మర్నాడూ షూటింగ్‌కెళితే అదే పెద్ద ఎంజాయ్‌మెంట్. ‘ప్యాకప్’ అనే పదం నాకిష్టం ఉండదు. సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా ‘తర్వాత సీన్ ఏంటి?’ అని అడుగుతుంటాను. ‘ఏం లేదు. ఇక ఇంటికెళ్లడమే’ అంటారు. అప్పుడు కదులుతాను.
     
పెళ్లి గురించి ఆలోచించరా?
     
ఈ మధ్యే 27లోకి అడుగుపెట్టా. పెళ్లికి ఇంకా వెయిట్ చేయొచ్చు.  సినిమా రిలీజులే మన చేతుల్లో లేవు. ఇక, పెళ్లి మన చేతిలో ఎక్కడుంటుంది? (నవ్వులు).
     
అది సరే... ఇంకొంచెం హైట్ ఉండి ఉంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా?

     
నా హైట్ ఐదు అడుగుల తొమ్మిది అంగుళాలు.

కానీ, అంత హైట్ కనిపించరే?
     
‘దేవదాసు’ సినిమా చేసినప్పుడు నాకు పదిహేడేళ్లు. 21 ఏళ్ల వయసు వరకూ ఎదుగుతారనే విషయం తెలిసిందే. ‘దేవదాసు’ అప్పుడు 5 అడుగుల 6 అంగుళాలు ఉండేవాణ్ణి. అప్పట్నుంచీ 21ఏళ్ల వరకూ మరో మూడు అంగుళాలు పెరిగాను. కెరీర్ పరంగా ఎదగడంతో పాటు హైట్ కూడా పెరిగాను. ‘దేవదాసు’ నుంచి నన్ను చూసినవాళ్లకి ఆ తేడా తెలియడంలేదు.

స్కూల్ డేస్‌లో మీకు ఏ సబ్జెక్ట్  బాగా ఇష్టం?
     
ఒక్క హిస్టరీ తప్ప అన్నీ ఇష్టమే. మ్యాథ్స్ బాగా ఇష్టం.

లెక్కల గురించి మాట్లాడుకుందాం. మీ జీవితంలో మైనస్‌గా భావించే అంశాలు.. ప్లస్‌గా అనిపించేవి?
     
జీవితం గురించి ఎప్పుడూ దీర్ఘంగా ఆలోచించలేదు. మైనస్‌లు ఉండే ఉంటాయి. ప్లస్‌లు కూడా ఉండే ఉంటాయి. ఆ ప్లస్సులే హీరోను చేసి ఉంటాయి.
     
కెమిస్ట్రీ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే.. హీరోయిన్లతో కెమిస్ట్రీ వర్కవుట్ కావడానికి ఏం చేస్తారు?

     
హీరో, హీరోయిన్ మధ్య ఫ్రెండ్లీనెస్ ఉంటే కెమిస్ట్రీ కూడా బాగుంటుంది. నాతో వర్క్ చేసిన హీరోయిన్స్ అందరూ దాదాపు నాతో బాగుంటారు.
     
ఫలానా హీరోయిన్‌తో రామ్ లవ్‌లో పడ్డాడు? లాంటి వార్తలెప్పుడూ రాలేదు..
     
ఆ కోణంలో ఎవర్నీ చూడలేదు. జెనీలియా, తమన్నా.. ఇలా అందరూ నాకు ఫ్రెండ్సే.
     
విడిగా కూడా క్రష్ లాంటివి ఏవీ కలగలేదా?

     
అవైతే చాలా! కాకపోతే మనసులోనే.
     
టీచర్స్‌ను ఇష్టపడ్డామని కొంతమంది చెబుతుంటారు?

     
నాకు మొదటి నుంచీ టీచర్ అంటే అమ్మలానే అనిపించేది. ఇంట్లో అల్లరి చేస్తే అమ్మ కోప్పడుతుంది.. స్కూల్లో అయితే టీచర్ కోప్పడుతుంది అనుకునేవాణ్ణి.
   
మీ అమ్మగారితో మీ బాండింగ్?
     
ఎవరి మీదా ఆధారపడకుండా మన జీవితాన్ని మనమే లీడ్ చేసుకోవాలని అమ్మ అంటుంది. ఆ మాటల ప్రభావం నా మీద చాలా ఉంది. తల్లితండ్రులంటే భయం ఉండకూడదు.. ప్రేమ ఉండాలని చెబుతుంది. అందుకే, ఏదైనా చేయకూడని పనులు చేయాలనుకున్నప్పుడు, అమ్మా నాన్న తిడతారేమో అని కాకుండా బాధపడతారేమో అనుకుని, చేయడం మానేస్తాను.
     
కిచెన్‌లో హెల్ప్ చేస్తారా?


చేయాలనే కిచెన్‌లోకి వెళతా. కానీ, అది అమ్మకి హెల్ప్ అవదు సరికదా... ఇంకొంచెం పని ఎక్కువైపోతుంది.
     
మీరు చేసే సినిమా కథలన్నీ మీ పెదనాన్నగారు (‘స్రవంతి’ రవికిశోర్) కంపల్సరీగా వింటారా?
     
ముందు ఆయన, ఆ తర్వాత ఇద్దరం కలిసి వింటాం.

     
‘స్రవంతి’ రవికిశోర్ అనే వ్యక్తి లేకపోతే ఈ స్థాయికి వచ్చేవాణ్ణని అనుకుంటున్నారా?
     
కచ్చితంగా ఇండస్ట్రీకి అయితే వచ్చేవాణ్ణి. కానీ పెదనాన్నగారు ఉండటం పెద్ద ప్లస్. ఆయన అనుభవం బాగా ఉపయోగపడుతోంది. ఆయన పాతికేళ్లుగా పరిశ్రమలో ఉన్నారు. ఏ అడుగు వేస్తే ఏమవుతుందో? ఆయనకు తెలుసు. అది నాకు చెబుతారు. ఒకవేళ ఆ గెడైన్స్ లేకపోతే ఎలా పడితే అలా అడుగులు వేసి, కొన్ని చేదు అనుభవాలు ఎదురైన తర్వాత ఏ అడుగు సరో తెలుసుకునేవాణ్ణి. కానీ, ఇప్పుడా అవసరం లేదు. పెదనాన్నగారి గెడైన్స్ ఉంది కాబట్టి, టైమ్ సేవ్ అవుతోంది.

చెన్నైలో పెరిగారు కదా.. మరి తమిళ సినిమాలు?

నాకు ముందు అవకాశం వచ్చిందే తమిళ పరిశ్రమ నుంచి. అప్పటికే వైవీయస్ చౌదరిగారు ‘దేవదాసు’ గురించి చెప్పి, తెలుగు సినిమా ద్వారానే పరిచయం కావాలని ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పటికి తమిళంలో ఒక సినిమా కమిట్ అయ్యా. అది వదులుకుని ఇక్కడికొచ్చా. ఆ తర్వాత తమిళంలో చేద్దామనుకుంటే సరైన కథ దొరకలేదు. కానీ తమిళంలో ఒక షార్ట్ ఫిలిం చేశా.
     
ఆ సినిమా వివరాలు?

ఆ ఫిలిమ్ పేరు - ‘అడయాళమ్’. అంటే ‘గుర్తింపు’ అని అర్థం. నాకు బోల్డంత గుర్తింపు తెచ్చిందా చిత్రం. యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మన దేశంతో కలిపి మొత్తం 60 దేశాల చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. అప్పుడు నా నటనకు ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. దాంతో పెద్ద హీరో అయిపోతాం అని కలలు కనడం మొదలుపెట్టాను. అయితే అప్పటికింకా హీరోగా చేసే వయసు రాలేదు కాబట్టి, చదువు మీద శ్రద్ధ పెట్టా. ఇక్కడ హీరోగా ఎదిగాక పెద్ద పెద్ద తమిళ దర్శకుల నుంచే పిలుపు వచ్చింది. చేస్తే, తమిళ - తెలుగు బైలింగువల్ ఫిల్మ్ చేయాలి. కానీ, తమిళంలో వర్కవుట్ అయ్యే సినిమా, తెలుగులో వర్కవుట్ అయ్యేలా లేదు. తమిళం కోసం తెలుగు వదులుకోవడం నాకిష్టం లేదు. పూర్తి తమిళ సినిమా అయితే చేస్తా.

మీకంటూ ఓ సొంత బ్యానర్ ఉండడం చాలా ప్లస్సేమో?

అవును. కానీ, హీరో కావాలనుకున్న తర్వాత పెదనాన్నగారు ఒకటే అన్నారు. ‘ముందు బయటి  బ్యానర్స్‌లో చేసి, ఆ తర్వాత హోమ్ బ్యానర్‌లో చేయాలని! బయట పది అవకాశాలుంటే అవి వదులుకుని నా బ్యానర్లో సినిమా ఒప్పుకోవాలి’ అన్నారు. ఆ విధంగా ముందు బయటి బ్యానర్స్‌లోనే చేసి, ఆ తర్వాతే హోమ్ బ్యానర్‌లో చేశాను.

‘చంద్రముఖి’ చిత్రంలో రజనీకాంత్ చేసిన తరహా పాత్ర వస్తే చేస్తారా?

అలాంటి పాత్రలకు నా వయసు సరిపోదేమో!

అంటే.. ఆ చిత్రం కొంచెం ఫిమేల్ ఓరియంటెడ్‌లా ఉంటుంది. కానీ, రజనీ పాత్ర ఆ కేరెక్టర్‌కి భరోసాగా నిలుస్తుంది. అలాంటి రోల్ అయితే చేస్తారా?

కథకు కీలకంగా నిలిచే ఆ తరహా పాత్ర అయితే చేస్తా.

‘ఎందుకంటే ప్రేమంట’ ఆశించిన ఫలితం సాధించలేదు కదా! దాంతో ప్రయోగాలకు దూరంగా ఉండాలని...?
     
{పయోగాత్మక చిత్రాలు ట్రై చేస్తూనే ఉంటా. లేకపోతే ‘నైన్ టూ ఫైవ్’ రొటీన్ జాబ్‌లా అయిపోతుంది.
     
‘మసాలా’ తర్వాత మళ్లీ మల్టీస్టారర్ చిత్రాలు ఎందుకు చేయలేదు?

     
మల్టీస్టారర్ చేయడానికి నాకేం ఇబ్బంది లేదు. ప్రాపర్ స్టోరీ కుదరకపోతే చేసినా వేస్ట్. మన తెలుగులో మల్టీస్టారర్స్ పెద్దగా వర్కవుట్ కావేమో అని ఫీలింగ్. పైగా, ఇద్దరు హీరోలకూ భారీగా రెమ్యూనరేషన్లిచ్చి తీస్తాం. తీరా బిజినెస్ ఆ స్థాయిలో అవుతున్నట్లు లేదు. హిందీలో పరిస్థితి మాత్రం వేరుగా ఉంది.

మీరేమో ‘నేను, నా సినిమాలు’ అన్నట్లుగా ఉంటారు. ఎవరితోనూ కలవరు కాబట్టి, మీకు ‘హెడ్ వెయిటే’మో అని చాలామంది అనుకుంటారు?

అనుకుంటారు.. ఏం చేయగలను? నేనెక్కువగా ఇంట్లో  ఉండడానికే ఇష్టపడతాను. నా పనేంటో నేనేంటో అన్నట్లు ఉంటా.

మరి, విహారయాత్రలకు వెళుతుంటారా?
     
ఒంటరిగా ఉండాలనిపించినప్పుడు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటా. అమెరికా, ఆస్ట్రేలియా... ఇలా ఎక్కడికంటే అక్కడికి వెళతాను.

{పకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఓ స్టార్‌గా సమాజానికి ఏమైనా చేయాలనుకుంటారా?
     
తప్పకుండా. కానీ, ప్రెస్‌మీట్ పెట్టి ఆ విషయం చెప్పను. హెల్ప్ చేసే విషయాలకు పబ్లిసిటీ కోరుకోను. నా అభిమాన సంఘాల నుంచి కూడా సమాజ సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి.

మూడు సినిమాల ప్రతికూల ఫలితాల తర్వాత కొత్త సినిమాతో సన్నద్ధమై ప్రేక్షకుల ముందుకు వస్తున్న రామ్.
గమనిక: లీడ్‌లో వాడిన పదాలన్నీ రామ్ వరుస సంఖ్యలో నటించిన సినిమాల పేర్లు.


 - డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement