ఒకప్పుడు తెలుగు సినిమాలలో సెట్టింగ్‌లను అట్టలతో వేసేవారు. వాటికి విఠలాచారి అట్టలమోపు అనే పేరు వచ్చింది. ఐదు దశాబ్దాల తరవాత రష్యన్లు ఇప్పుడు అటువంటి అట్టలమోపులు చేస్తున్నారు! హై బడ్జెట్‌లో నిర్మితమైన హాలీవుడ్ చిత్రాలను లో బడ్జెట్‌తో ఇంట్లో దొరికే వస్తువులతో పేరడీ సినిమాలుగా తీస్తోంది అక్కడి ఒక నిర్మాణ సంస్థ.
‘టైటానిక్’ లాంటి ఆస్కార్ అవార్డ్ చిత్రాలను పెద్ద బడ్జెట్‌తో నిర్మించారు నిర్మాతలు. అయితే స్టూడియో 188 అనే ఒక రష్యన్ గ్రూప్ తక్కువ ఖర్చుతో ఆ సినిమాలను రీ మేక్ చేస్తోంది. నమ్మశక్యంగా లేదా! ఒక్కసారి యూ ట్యూబ్ తెరిచి చూడండి. మీకే అర్థమవుతుంది. అది కూడా ఎలా నిర్మించారో తెలుసా? రకరకాల వస్త్రాలు, పట్టా కత్తి, సలాడ్ ప్లేటు, కంప్యూటర్ కీ బోర్డులను ఉపయోగించారు. మాంస ఖండంతో షిప్ ఫన్నెల్‌ను తయారుచేశారు. టైటానిక్ చిత్రంలో జాక్, రోజ్‌లు షిప్ డెక్ దగ్గర నిలబడే సన్నివేశాన్ని పురుషుల లో దుస్తులతో తయారైన ఒక కీ ఇచ్చే బొమ్మతో రూపొందించారు. కెప్టెన్ మీసాలను పేస్టుతో చేశారు.
ఇలా అన్నీ పనికిరాని వస్తువులనే ఉపయోగించి ఈ పేరడీ మూవీని తయారుచేశారు. ఇలా తయారైన పేరడీలు, స్పూఫ్‌లు ఇటీవల యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతున్నాయి. అవన్నీ స్టూడియో 188 వారు హ్యూమర్ కోసం సృష్టించినవే. వీరి శ్రమ వృథాపోలేదు. టైటానిక్ పేరడీ వీడియోను చాలామంది చూశారు. వీరికి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఈ గ్రూప్ అధినేత ఈవ్‌జినీ మఖోటిన్ ఈ పేరడీ గురించి, ‘‘మేం లో బడ్జెట్ రీమేక్ ఫార్మాట్‌లో ఈ పేరడీలు తీసి ఇంటర్‌నెట్‌లో జరిగిన పోటీకి పంపాం. అది కూడా డబ్బుల కోసం’ అంటున్నారు. రష్యాలో ఇంతవరకు ఇటువంటì (టైటానిక్) ప్రమాదం జరగలేదు, కనుక రష్యాలో ఇటువంటి ప్రయోగం చేయడం వల్ల రష్యాకు ఎటువంటి ఇబ్బందులు రావని భావిస్తున్నాం’’ అని చమత్కారంగా అంటున్నారు మఖోటిన్.
స్టూడియో 188 వారు 2018 నుంచి వారి వీడియోలను యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం ప్రారంభించారు. మొట్టమొదట ‘గార్డియన్స్ ఆఫ్ గలాక్సీ’ ట్రైలర్‌ని రష్యన్ డబ్బింగ్‌తో రిలీజ్ చేశారు. ఆ తరవాత టెర్మినేటర్ 2ను ఇంగ్లీష్ ఆడియోట్రాక్‌తో పెట్టారు. దీనికి 3,60,000 వ్యూస్ వచ్చాయి. తక్కువ బడ్జెట్‌లో తీసిన ‘సైలర్ మూన్’ రీమేక్‌కి బాగా హిట్స్ వచ్చాయి. టెర్మినేటర్ వీడియోను రెడ్డిట్ బ్యానర్ మీద పోస్టు చేసినప్పుడు చాలామంది చూశారు. టెర్మినేటర్ 2 లో చేసిన ట్రికీ షాట్స్ వల్ల ఈ వీడియోను ఎక్కువమంది లైక్ చేశారు. ఇందులో ఈవ్‌జినీ మఖోటిన్ సేవియర్ సైబోర్గ్‌గా నటించారు. ‘శరీరం మీద రంగు వేసుకుని, చాలా గంటలు నడిచిన సీన్ కోసం నేను చాలా కష్టపడ్డాను’’ అంటారు ఈవ్‌జినీ మఖోటిన్. స్టూడియో 188లో నలుగురు రష్యన్లు, బెలరూషియన్‌కి చెందినవారు ఒకరు ఉన్నారు. ఇందులో ముగ్గురు స్క్రీన్ రైటర్లు. ‘‘మేం హాలీవుడ్ చిత్రాల మీదే ఆధారపడతాం. అప్పుడే మాకు మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. బాగా పాపులర్ అయిన రష్యన్ చిత్రం ఉంటే, దానిని కూడా పేరడీ చేస్తాం’ అంటున్నారు మఖోటిన్.
చాలామంది ఈ షూటింగ్ చాలా ఫన్ అనుకుంటారు. కాని ఇందుకు వారు చాలా కష్టపడతామని, మూడు గంటలు షూటింగ్ చేశాక, అలసిపోయి, షూటింగు మానేద్దామనుకున్న సంఘటనలు కూడా ఉన్నాయంటారు మఖోటిన్. అత్యంత సంక్లిష్టమైన ‘ద ఫిఫ్త్ ఎలిమెంట్’, ‘ది మ్యాట్రిక్స్’ చిత్రాలను కూడా వీరు పేరడీ చేసి యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. దీనిని తెలుగు యువకులు కూడా ప్రయత్నించ వచ్చేమో. ఒక్కసారి ఈ రష్యన్ల స్టూడియో 188 చిత్రాలో చూస్తే అర్థమవుతుందిగా.
– డా. వైజయంతి
Comments
Please login to add a commentAdd a comment