‘గే’ సెక్స్‌కు శిక్షగా రాళ్లతో కొట్టి చంపే చట్టాన్ని తెచ్చిన బ్రూనై దేశ సుల్తాన్ ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్న తాజా పరిస్థితుల్లో.. ఎల్జీబీటీ (లెస్బియన్స్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్) హక్కులపై చర్చ మరింత విస్తృతం అయింది. ప్రముఖ మహిళా గణిత శాస్త్రవేత్త శకుంతలాదేవి జీవించి ఉండగా ‘గే’ల హక్కులపై ‘ద వరల్డ్ ఆఫ్ హోమో సెక్సువల్స్’ అనే పుస్తకం రాయడానికి ఆమెను ప్రేరేపించిన అంశాలు కూడా మనదేశంలో ఇప్పుడు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
మూడు సంవత్సరాల వయసున్న చిన్నారి శకుంతల తండ్రితో కలిసి సర్కస్ సెంటర్‌లో కూర్చొని ఉంది. ఆమె చుట్టూ కళాకారులు, జంతువులు ఉన్నా ఆమె దృష్టంతా తన ముందర ఉన్న కార్డుల మీదే ఉంది. వాటినే పరిశీలిస్తోంది ఆ అమ్మాయి. శకుంతల తండ్రి సంప్రదాయ కన్నడ కుటుంబంలో జన్మించారు. సర్కస్‌లో పనిచేయాలనే కోరికతో ఇంటి నుంచి పారిపోయి, సర్కస్ కంపెనీలో చేరారు. అక్కడ ఆయన తాడు మీద నడిచాడు, సింహాలను ఆడించాడు, బంతులను చేతులలోకి మార్చుకుంటూ ఆడాడు. తర్వాత సర్కస్ షో పూర్తయింది. టెంట్లన్నీ తీసేశారు. అప్పుడు ఆయన కాలక్షేపం కోసం కుమార్తె ముందు పేక ముక్కలతో రకరకాల మ్యాజిక్కులు చేయడం ప్రారంభించారు.
అయితే, అమ్మాయి చిన్నపిల్లనీ, ఆ మ్యాజిక్కులు అర్థం చేసుకునే వయస్సు కాదనీ అనుకున్నాడు. కాని ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ ఆటను తన జ్ఞాపకశక్తితో గెలుచుకుంది శకుంతల. అది చూడగానే, శకుంతల పుట్టుకతోనే గణిత శాస్త్రంలో మేధావి అని, అంకెలను బాగా గుర్తుపెట్టుకోగలదని అర్థం చేసుకున్నాడు. ఆమెకు లభించిన వరాన్ని గుర్తించి, ఇక సర్కస్‌లో పని మానేసి, కూతురిలోని నైపుణ్యాన్న వెలికి తీసుకురావాలనుకున్నారు. రోడ్డు షోలు ప్రారంభించారు, పెద్ద పెద్ద అంకెలను ఆమె ఏ విధంగా గుర్తు పెట్టుకుంటోందో తెలియచేయడం ప్రారంభించారు.
ఐదు సంవత్సరాల వయసు వచ్చేనాటికే శకుంతల ఎన్నో లెక్కలను అవలీలగా చేసేసేది. తన ఆరో ఏట మైసూరు విశ్వవిద్యాలయంలో పెద్ద ప్రదర్శన ఇచ్చింది శకుంతల. 1980లో లండన్ ఇంపీరియల్ కాలేజీలో 13 స్థానాల రెండు అంకెలను కేవలం 28 సెకన్లలో భాగించి, 26 స్థానాల అంకెను అవలీలగా చెప్పేసింది శకుంతల. ఈ ప్రశ్నను కంప్యూటర్ చేత అడిగించారు. అదీ అలాగే చూపించింది! అంతే.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కించుకున్నారు శకుంతల. దానితో పాటు హ్యూమన్ కంప్యూటర్‌గా ప్రసిద్ధి చెందారు. ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రసిద్ధి చెందిన శకుంతల హోమో సెక్సువాలిటీ హక్కుల కోసమూ పోరాడారు. ఆ సంగతి చాలా కొద్దిమందికే తెలుసు.
ఎందుకు మళ్లారు?!
1960 మధ్య ప్రాంతంలో, లండన్‌లో ప్రొఫెసర్లు, పరిశోధకుల ఎదుట మేథమేటికల్ స్కిల్స్ ప్రదర్శించి, భారతదేశానికి తిరిగి వచ్చారు శకుంతల. కోల్‌కత్తాలో ఐఏఎస్‌గా పనిచేస్తున్న పరితోష్ బెనర్జీని వివాహం చేసుకున్నారు. వారి జంట చూడముచ్చటగా ఉంది అనుకున్నారు అందరూ. అయితే కొద్దికాలానికే బెనర్జీ హోమో సెక్సువల్ అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ 21వ శతాబ్దంలోనూ ఇది పెద్ద విషయమే. మరి అప్పట్లో పెద్ద దుమారమే కదా. తాను ఒక ‘గే’ని వివాహం చేసుకున్నానని తెలుసుకున్న శకుంతలకు ప్రపంచం తల్లకిందులైపోయింది. ఈ విషయం మీద కఠినంగా ప్రవర్తించకుండా, తను బాధపడకుండా, హోమోసెక్సువాలిటీ గురించి చదవడం ప్రారంభించారు. గే కమ్యూనిటీ హక్కుల గురించి తెలుసుకున్నారు.
మరికొందరు హోమోలను కలిసి, వారి మనోగతాన్ని, అనుభవాలను తెలుసుకుని, ఆ వివరాలను భద్రంగా పొందుపరిచారు, సమాజం నుంచి వారు ఏం కోరుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు, వారు ఏ విధంగా జీవనం సాగిస్తున్నారో గ్రహించారు. ‘గే’ హక్కుల ఐపీసీ సెక్షన్ 377ను 2018లో తీసుకువచ్చారు కాని శకుంతల ఈ విషయం గురించి 1977లోనే గొంతు విప్పారు. ‘గే’తత్వాలు, జీవన విధానాలు, జీవిత అవసరాల మీద తాను చేసిన పరిశోధనను, ఇంటర్వ్యూలను కలిపి ‘ద వరల్డ్ ఆఫ్ హోమో సెక్సువల్స్’ పేరున పుస్తకంగా తీసుకువచ్చారు. ఈ పుస్తకం ద్వారా వారి సమస్యలను, ఇబ్బందులను వెలుగులోకి తీసుకురావడం శకుంతల ఉద్దేశం. అయితే అప్పట్లో ఆమె రచించిన పుస్తకానికి పెద్దగా స్పందన రాలేదు.
కాని కాలంలో వచ్చిన మార్పుల కారణంగా, ఇప్పుడు ఈ పుస్తకాన్ని హోమో సెక్సువల్స్ మీద రాసిన మొట్టమొదటి పుస్తకంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. తాను అందుకున్న మిగతా పురస్కారాలతో పాటు, హోమో సెక్సువల్స్ గురించి ముందుగా స్పందించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు శకుంతల. ‘‘నేను మనిషిని కావడమే ఈ పుస్తకం రాయడానికి నాకున్న అర్హత. ఇటువంటివారి పట్ల సానుభూతి చూపటం, భరించటం సరికాదు, వారిని అంగీకరించాలి’ అంటారు శకుంతల. ‘‘విలక్షణంగా ఉండటం ధర్మవిరుద్ధం కాదు. వీరి దగ్గరకు ఎవ్వరినీ రానీయకుండా చేయకూడదు. ఇటువంటి జీవన విధానం కూడా సృష్టిలో భాగమే. దీనిని ఎవ్వరూ వ్యతిరేకించకూడదు’ అంటారు శకుంతల.
జయంతి
భర్తతో విడాకులు
‘ద వరల్డ్ ఆఫ్ హోమో సెక్సువల్స్’.. పుస్తకంగా వచ్చిన తరవాత రెండు సంవత్సరాలకు శకుంతల తన భర్త బెనర్జీ నుంచి విడాకులు తీసుకున్నారు. ఆ తరవాత శకుంతల తనకు ఇష్టమైన గణితశాస్త్రం గురించి ప్రచారం చేస్తూ, విద్యార్థులకు లెక్కలు సులువుగా అర్థమయ్యేందుకు అనువుగా పుస్తకాలు రాశారు. శకుంతలాదేవి సంప్రదాయ విద్య నేర్వకపోయినా, తనకు సంక్రమించిన విద్య ద్వారా నైపుణ్యాన్ని పెంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా లెక్కలలో ఆరితేరిన వ్యక్తిగా గుర్తింపు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment