లండన్ : రోజూ మల్టీవిటమిన్స్ తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలూ దరిచేరవనే ధీమా పనికిరాదని తాజా అధ్యయనం హెచ్చరించింది. మల్టీవిటమిన్స్‌తో గుండె జబ్బులు, స్ర్టోక్‌లు నివారించవచ్చనే ప్రచారంపై దృష్టి సారించిన ఈ అథ్యయనం ఇవన్నీ అపోహలేనని తేల్చింది. బర్మింగ్‌హామ్‌లోని అలబామా యూనివర్సిటీ పరిశోధకులు 12 ఏళ్ల పాటు 2000 మందిని పరిశీలించిన అనంతరం సమర్పించిన పత్రంలో సప్లిమెంట్స్ వాడకం గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపదని నిర్ధారణకు వచ్చారు.
మల్టీవిటమిన్లు గుండెకు మేలు చేయకపోగా, వీటి వాడకంతో తమ ఆరోగ్యం మెరుగుపడుతుందనే ధీమాతో ప్రజలు పొగతాగడం, జంక్ ఫుడ్ తినడాన్ని కొనసాగిస్తారని అథ్యయన రచయిత డాక్టర్ జూన్సెక్ కిమ్ హెచ్చరించారు.మల్టీవిటమిన్స్, మినరల్ సప్లిమెంట్‌లు కార్డియోవాస్కులర్ జబ్బులను నివారించలేవని ఆయన స్పష్టం చేశారు. తమ అథ్యయన వివరాలతో మల్టీవిటమిన్లు, మినరల్ సప్లిమెంట్లపై అపోహలు తొలిగి, గుండె జబ్బుల నివారణకు మెరుగైన పద్ధతులకు ప్రజలు మొగ్గుచూపుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
గుండె జబ్బులకు దూరంగా ఉంటాలంటే పండ్లు, కూరగాయలను అధికంగా తీసుకోవడం, వ్యాయామం చేయడంతో పాటు, ధూమపానానికి స్వస్తిపలకడం వంటి అలవాట్లను అలవరుచుకోవాలని సూచించారు. ఈ అథ్యయనం అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ సర్క్యులేషన్‌లో ప్రచురితమైంది.
Comments
Please login to add a commentAdd a comment