అటెండెంట్స్... అటెన్షన్ ప్లీజ్! | To be alert in an emergency? | Sakshi
Sakshi News home page

అటెండెంట్స్... అటెన్షన్ ప్లీజ్!

Published Mon, Mar 23 2015 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM

అటెండెంట్స్...  అటెన్షన్ ప్లీజ్!

అటెండెంట్స్... అటెన్షన్ ప్లీజ్!

వైద్యపరమైన అత్యవసర పరిస్థితి (మెడికల్ ఎమర్జెన్సీ) ఎవ్వరికీ రాకూడదుగానీ...

ఎమర్జెన్సీలో ఏమేం చేయాలి?
 

వైద్యపరమైన అత్యవసర పరిస్థితి (మెడికల్ ఎమర్జెన్సీ) ఎవ్వరికీ రాకూడదుగానీ... ఎవరి ఇంట్లోనైనా సదరు కుటుంబ సభ్యులకు ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్ ఎదురైతే కాళ్లూ చేతులు ఆడవు. ఎదుటివారిలో ఎలాగైనా పేషెంట్‌ను కాపాడాలనే తపన.  కానీ ఏం చేయాలో తోచదు. ఎవరైనా పేషెంట్ ఎమర్జెన్సీలో  ఉన్నప్పుడు అతడితో పాటు... అతడి తోడున్నవాళ్ల మనఃస్థితి ఇది. కానీ నిజంగా ఒక పేషెంట్ ఏదైనా వైద్యపరమైన అవసరంతో మెడికల్  ఎమర్జెన్సీ పరిస్థితిలో ఉంటే... ఆయా లక్షణాలను బట్టి అతడికి ఏం చేయాలో తెలిస్తే రోగికి తోడుండే సహాయకుడికి (అటెండెంట్‌కు)  కాస్త కాళ్లూ చేతులూ కదులుతాయి. వాటిని ఉపయోగించి  రోగిని రక్షించడానికి ఏమేం చేయాలో తెలుస్తుంది.  అనేక మెడికల్ ఎమర్జెన్సీ  కేసుల్లో రోగిగానీ... లేదా ఆ సమయంలో అతడికి తోడున్న వ్యక్తిగానీ  ఏం చేయాలన్న అంశంపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం.
 
 
గుండెపోటు వచ్చినప్పుడు లేదా  గుండె అకస్మాత్తుగా ఆగినప్పుడు...
 
 ఈ లక్షణాలు గుర్తెరగండి... అప్రమత్తం కండి... గుండెపోటు లక్షణాలను తెలుసుకుంటే... రోగి గానీ లేదా అతడికి తోడుగా ఉన్న వ్యక్తి (అటెండెంట్)గానీ అప్రమత్తమై రోగిని రక్షించవచ్చు  ఛాతీకి ఎడమవైపున పట్టినొక్కుతున్నట్లుగా నొప్పి  ఛాతీభాగమంతా మంట  ఛాతీపై వచ్చిన నొప్పి దవడ లేదా కడుపు పైభాగానికి లేదా మెడవైపునకు లేదా భుజంవైపునకు పాకుతున్నట్లుగా అనిపించడం  గుండెదడ (పాల్పిటేషన్స్)  విపరీతంగా చెమటలు పట్టడం  వికారం లేదా వాంతి కావడం  చిన్నపనికీ తీవ్రంగా అలసట చెందడం  అకస్మాత్తుగా తలతిరిగినట్లుగా అనిపించడం  శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటే వెంటనే రోగి గానీ లేదా రోగి వెంట ఉండే సహాయకులు (అటెండెంట్)గానీ అప్రమత్తం కావాలి.
 
కాలాతీతం చేయవద్దు...

చాలా సందర్భాల్లో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు అది పొట్టలో గ్యాస్ నిండటం వల్ల అసౌకర్యంగా ఉంటుందంటూ కొందరు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. యాంటాసిడ్ వంటివి తీసుకుని ఆసుపత్రికి రాకుండా సొంత చికిత్స చేసుకుంటుంటారు. కానీ ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో వెంటనే ఆసుపత్రికి తరలించడం మంచిది. సాధారణంగా ఇలాంటి లక్షణాలు కనిపించిన రోగుల్లో సగానికి పైగా ఆసుపత్రికి చేరడంలో ఆలస్యం చేసిన కారణం వల్లనే మరణిస్తుంటారు. వారు సకాలంలో గనక ఆసుపత్రికి చేరితే బతికే అవకాశాలు చాలా ఎక్కువ.

 ఇదీ విండో పీరియడ్...

లక్షణాలు కనిపించగానే రోగి ప్రాణరక్షణకు అవకాశం ఉన్న బంగారు ఘడియలను విండో పీరియడ్‌గా పరిగణిస్తారు. లక్షణాలు కనిపించగానే రోగిని కనీసం 12 గంటల లోపు దగ్గర్లో ఉన్న అన్ని వసతులు గల పెద్ద ఆసుపత్రికి తరలించాలి. ఆసుపత్రికి చేరగానే అక్కడ రక్తనాళంలో ఏర్పడిన అడ్డంకిని తొలగించడానికి చికిత్స చేస్తారు. ఈ చికిత్సను ‘రీ-పెర్‌ఫ్యూజన్ థెరపీ’గా పేర్కొంటారు. ఆసుపత్రికి చేరగానే రక్తనాళాల్లో ఏర్పడ్డ అడ్డంకిని పేల్చివేసేందుకు అవసరమైన ‘ఫిబ్రినోలైటిక్ థెరపీ’ ఇంజెక్షన్‌లను అరగంటలోపే ఇస్తారు. లేదా రక్తనాళాలను వెడల్పు చేసే ప్రైమరీ యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలను చేసి రక్తనాళంలోని అడ్డంకులను 90 నిమిషాలలోపే తొలగిస్తారు.
 
రోగి లేదా రోగి సహాయకులు ఈలోపే చేయాల్సిందిదే...

రోగికి గుండెపోటు వచ్చినప్పుడు దాని స్పందనలు సక్రమంగా లేకపోవడం (రిథమ్ తప్పడం జరుగుతాయి కాబట్టి ఈ పరిస్థితిని అరిథ్మియా అంటారు), లేదా అకస్మాత్తుగా ఆగిపోవడం జరగవచ్చు. ఈ ప్రమాదాన్ని నివారించడానికి ఆసుపత్రికి వచ్చే లోపు రోగికి ఆస్పిరిన్ వంటి రక్తాన్ని  పలుచబార్చే టాబ్లెట్లను వెంటనే ఇవ్వాలి.  దీనివల్ల ఆసుపత్రిలో జరిగే అసలు చికిత్స ప్రక్రియకు ముందే... రక్తం పలుచబారిపోయి గుండెకండరానికి కలిగే నష్టం చాలా తగ్గుతుంది. ప్రాణాపాయం తప్పుతుంది. కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు సీపీఆర్ అనే ప్రథమ చికిత్స చేయాలి. ఈ ప్రథమ చికిత్స ప్రక్రియను అందరూ నేర్చుకోవడం అవసరం.

 
క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ  డిసీజ్ (సీవోపీడీ)

ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక మెడికల్ ఎమర్జెన్సీ కండిషన్. ఊపిరితిత్తులకు గాలిని చేరవేసే వాయునాళాలు బిగుసుకుపోవడం గానీ లేదా వాటిలో ఏవైనా అడ్డంకులు కలగడం వల్ల ఈ మెడికల్ ఎమర్జెన్సీ ఏర్పడవచ్చు.
 
ఈ లక్షణాలు గుర్తిస్తే తక్షణం అప్రమత్తం కావాల్సిందే...
 
ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది  దగ్గు  కఫం ఎక్కువగా ఉత్పత్తి అవుతూ దగ్గినప్పుడల్లా కఫం పడుతూ ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం అప్రమత్తమై రోగిని ఆసుపత్రికి తరలించాలి. సాధారణంగా పొగతాగేవాళ్లలోనూ, లేదా వాయుకాలుష్యంలో ఎక్కువసేపు గడిపేవాళ్లు, దుమ్ము ధూళిలో ఎక్కువగా సంచరించేవారు, చాలా తక్కువ గాలివచ్చే ప్రదేశాలలో వంట చేసేవారు ఈ కండిషన్‌కు లోనయ్యే అవకాశాలు ఎక్కువ. దాంతో వారిలో ఆక్సిజన్ పాళ్లు తగ్గి, కార్బన్‌డైఆక్సైడ్ పాళ్లు పెరిగి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది.
 
తక్షణఉపశమన చర్యలివే...


రోగికి పై లక్షణాలు కనిపించినప్పుడు ఆసుపత్రికి తీసుకువచ్చే లోపే కొంత ప్రథమ చికిత్స చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఉదాహరణకు రోగి వంటగదిలో పొగ మధ్యన ఉంటే అతడిని/ఆమెను పొగలోంచి ధారాళంగా మంచి గాలి వీచే ప్రదేశంలోకి తీసుకురావాలి. పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మాన్పించాలి. మందుల షాపులో లభించే వాయునాళాలను వెడల్పు చేసే మందులు (బ్రాంకోడయలేటర్స్)ను పీల్చేలా చేయాలి. ఇది మొదటి దశ చికిత్స (ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్‌మెంట్) గా ఇవ్వాలి.
 ఇక అప్పటికీ ఆయాసం తగ్గకపోతే ఆసుపత్రికి తరలించాలి. అక్కడ డాక్టర్లు పరీక్షించి వారికి అవసరమైతే ఆక్సిజన్ పెట్టడం లేదా బై-పాప్, సీ-పాప్ వంటి చికిత్సలు అందించడం వంటివి చేస్తారు.
 
ఫిట్స్ (సీజర్స్)
 
ఎపిలెప్సీ అని పిలిచే ఫిట్స్ అనే కండిషన్ పట్ల రోగుల్లోనూ సాధారణ ప్రజల్లోనూ చాలా అపోహలు ఉన్నాయి. ఫిట్స్‌నే వైద్యపరిభాషలో సీజర్స్ అని కూడా అంటారు. మెదడులో ఉత్పన్నమయ్యే సంకేతాలలో మార్పులు రావడం వల్ల ఫిట్స్ వస్తాయి. కానీ ఈ పరిస్థితిలో కనిపించే భయంకరమైన పరిణామాల వల్ల ఈ వ్యాధి పట్ల ఈ ఆధునిక యుగంలోనూ దీని పట్ల అనేక భయాలూ, అపోహలూ, దురభిప్రాయాలూ ఉన్నాయి. ఈ రోగుల పట్ల వివక్ష ఉంది. ముఖ్యంగా పల్లెల్లో వీరిపట్ల చాలా వివక్షతో వ్యవహరిస్తారు. మహిళలకు ఫిట్స్ ఉంటే ఇక వారి పట్ల వివక్షకు అంతం ఉండదు. ఫిట్స్ వచ్చే మహిళలకు పిల్లలు కలగరనే అపోహ ఉంది. ఒకవేళ పిల్లలు కలిగితే వారికీ ఫిట్స్ వస్తాయనే ఇంకో అపోహ కూడా ఉంది. కానీ ఇవన్నీ అపోహలే/దురభిప్రాయాలే.

లక్షణాలతోనే ఇబ్బంది...

ఫిట్స్ వచ్చిన వ్యక్తి అకస్మాత్తుగా కింద పడి గిలగిలా కాళ్లూ, చేతులూ, కనుగుడ్లూ, తలను కదిలిస్తూ కొట్టుకుంటాడు  పూర్తిగా గానీ, పాక్షికంగాగానీ స్పృహ కోల్పోతాడు  ఒక్కోసారి పళ్లు బిగుసుకుపోవడం వల్ల నాలుక పళ్ల మధ్య చిక్కుకునిపోయి  నోట్లోంచి రక్తం వస్తుంది. ఇది నాలుక తెగడం వల్ల కలిగే పరిణామమే తప్ప నిజానికి నోట్లోంచి రక్తస్రావం కాదు  ఒక్కోసారి తనకు తెలియకుండానే మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోయి మూత్రం పోస్తాడు  ఇలాంటి లక్షణాల నుంచి బయటపడ్డ తర్వాత కూడా రోగి చాలా సేపు అయోమయంగా, మత్తుగా బలహీనంగా ఉంటాడు.

లక్షణాలు కనిపించగానే సహాయకులు చేయాల్సిందివే

రోగి తల ఒక పక్కకు ఓరగా ఉండేట్లుగా పడుకోబెట్టాలి. దీనివల్ల అతడి నోట్లోంచి వచ్చే స్రావాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించకుండా జాగ్రత్త తీసుకున్నట్లు అవుతుంది. దాంతో రోగి యదాతథంగా ఊపిరి తీసుకుంటూ ఉంటాడు. వీలైతే దువ్వెన లేదా స్కేల్ వంటిదాన్ని రోగి పళ్ల మధ్య ఉంచడం వల్ల రోగి నాలుక కొరుక్కోకుండా ఉంటాడు.
 
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే...
 
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం వల్ల అకస్మాత్తుగా మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు అందులో రక్తం కనిపించడం వంటి లక్షణాలతో రోగి ఆందోళనతో భయభ్రాంతులకు లోనుకావచ్చు. లేదా అకస్మాత్తుగా పొత్తికడుపులో నొప్పితో విలవిలలాడిపోవచ్చు. అలాంటి సందర్భాల్లో రోగిని ఆందోళన పడకుండా చూడాలి. చికిత్సతో ఆ పరిస్థితి తగ్గుతుందని రోగికి భరోసా కల్పించడం వంటి సాంత్వన వాక్యాలు పలకాలి. ఇక మూత్రంలో రక్తం కనిపించడం, పొత్తికడుపులో నొప్పి కిందివైపునకు పాకుతున్నట్లుగా రావడం, వికారం, వాంతులు, జ్వరం, మూత్రం పరిమాణం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే రోగిలో మూత్రపిండంలో గానీ లేదా మూత్రపిండం నుంచి మూత్రాశయానికి మూత్రాన్ని తీసుకువచ్చే నాళాల్లో  (యురేటర్స్‌లో)గానీ రాయి వంటిది ఉండవచ్చు. ఒకవేళ ఆ రాయి పరిమాణం పెద్దదిగా ఉండి అది మూత్రప్రవాహానికి అడ్డుపడితే మూత్రపిండాల వైఫల్యానికి దారితీయవచ్చు. అందుకే ఇలాంటి సందర్భాల్లో రోగిని ఆసుపత్రికి తీసుకురావాలి. అక్కడ ఎక్స్-రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ఇంట్రావీనస్ పైలోగ్రామ్, అబ్డామినల్ సీటీ స్కాన్ వంటి పరీక్షలు నిర్వహించి తగిన చికిత్స చేస్తారు.
 
పక్షవాతం
 
మన శరీర అవయవాల్లో అన్నింటినీ నియంత్రించే కీలకమైన భాగం మెదడు. ఏ కారణం వల్లనైనా మెదడుకు తగినంత రక్తసరఫరా జరగకపోతే మెదడుకు అందాల్సిన ఆక్సిజన్, పోషకాలు అందక అది పక్షవాతానికి దారితీయవచ్చు. పక్షవాతంలో రెండు రకాలుంటాయి...
  ఇస్కిమిక్ స్ట్రోక్ : మెదడుకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో ఏదైనా అడ్డంకి ఏర్పడి మెదడుకు తగినంత రక్తం అందకపోవడం వల్ల వచ్చే పక్షవాతం

 హేమరేజిక్ స్ట్రోక్ : మెదడులోని ఏదైనా రక్తనాళం అకస్మాత్తుగా చిట్లిపోవడం వల్ల మెదడు కణజాలానికి రక్తం అందక వచ్చే పక్షవాతం.
  ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాల్సిందే...  ముఖంలో గానీ లేదా చేయి/కాలులో ఒకవైపున అకస్మాత్తుగా బలహీనంగా అనిపించడం  అకస్మాత్తుగా అయోమయానికి లోనుకావడం  మాట్లాడటంలో గానీ  లేదా ఎవరైనా చెప్పేది అర్థం చేసుకోవడంలో ఇబ్బంది  చూడటంలో ఇబ్బంది  నడవడం కష్టమైపోవడం  నిలబడి ఉన్నప్పుడు బ్యాలెన్స్ కోల్పోవడం  అకస్మాత్తుగా తలనొప్పి
 
పక్షవాతంలో విండో పీరియడ్ ఇలా...

 పై లక్షణాలు కనిపించిన వెంటనే రోగిని కనీసం మూడు నుంచి నలుగున్నర గంటలలోపు ఆసుపత్రికి తరలించాలి. అంటే గుండెపోటుతో పోలిస్తే పక్షవాతంలో విండో పీరియడ్ చాలా తక్కువ.
 
విషం తీసుకున్నప్పుడు...
 
ఎవరైనా విషం తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఇతరుల సూచనలకు స్పందించకపోయినా, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా, కండరాలు బిగుసుకుపోతున్నా వెంటనే ఆంబులెన్స్‌కు ఫోన్ చేయాలి. ఈలోపు డాక్టర్‌కు ఫోన్ చేసి సలహా అడగాలి. అంతేగానీ విషాన్ని కక్కించడానికి వెంటనే ప్రయత్నించకూడదు. ఎందుకంటే కొన్ని రకాల విషాలు కక్కించే సమయంలో మరింతగా హాని చేస్తాయి.
 
అగ్నిప్రమాదాల్లో...

 
అగ్నిప్రమాదంతో ఎవరికైనా నిప్పు అంటుకున్నప్పుడు అది మరింత విస్తరించకుండా చూడాలి. కాలిన ప్రదేశాన్ని పై నుంచి ధారగా పడే చల్లటి నీళ్లతో 10- 15 నిమిషాల పాటు కడగాలి. ఆ తర్వాత కాలిన చోట యాంటీసెప్టిక్ లోషన్ రాసి ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
 
 
మధుమేహ రోగుల్లో హైపోగ్లైసీమియా  

 
మధుమేహ రోగుల్లోని చాలా మందిలో కనిపించే ఎమర్జెన్సీ ఇది. సాధారణంగా చక్కెర రోగుల్లో తగిన అవగాహన లేకపోవడం వల్ల తాము తక్కువగా తిన్నప్పుడూ లేదా ఏమీ తిననప్పుడు కూడా యథావిధిగా రక్తంలో చక్కెరను నియంత్రించే మాత్రలు వేసుకుంటూ ఉంటారు. దీని వల్ల రోగి రక్తంలోని చక్కెర పాళ్లు 70 ఎంజీ/డీఎల్‌కు తగ్గినప్పుడు రోగిలో తీవ్రంగా ఆకలివేసినట్లుగా అనిపించడం, శరీరమంతా వణికిపోవడం, తీవ్రంగా చెమటలు పట్టడం, గుండెదడ, బలహీనత, అలసట, అయోమయం, మగతగా అనిపించడం ఒక్కోసారి స్పృహతప్పడం, సీజర్స్ (ఫిట్స్) రావడం, కొన్నిసార్లు కోమాలోకి వెళ్లిపోవడం కూడా జరగవచ్చు.  పై లక్షణాలు కనిపిస్తే వెంటనే 3-4 టీ స్పూన్ల చక్కెర గానీ లేదా 5-6 చాక్లెట్ క్యాండీలు ఇవ్వాలి. ఇక కప్పు పాలలో ఒక స్పూను తేనె వేసి గానీ లేదా చక్కెరతో అరకప్పు పళ్లరసం ఏదైనా తాగించాలి. స్పృహ తప్పిన వారికి ద్రవపదార్థాలు తాగించకూడదు. చక్కెర/గ్లూకోజ్ పౌడర్ నోట్లో వేయవచ్చు.
 
 
రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డప్పుడు

 
రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారిని రక్షించే క్రమంలో కొందరు వాహనంలో చిక్కుబడ్డ వారిని బలవంతంగా బయటకు లాగుతుంటారు. ఎలాంటి ఇబ్బందీ లేకుండా బయటకు రాగలిగే పరిస్థితి ఉంటేనే ఈ పని చేయాలి. లేకపోతే ఈ క్రమంలో వారికి మరిన్ని గాయాలు అయ్యే అవకాశాలున్నాయి. ఒక్కోసారి రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ ద్విచక్రవాహనదారులు బైక్ కింద ఇరుక్కుని ఉంటే వారిని అకస్మాత్తుగా లాగడం సరికాదు. ఇందువల్ల వారి మెడ దగ్గర ఉండే వెన్నుపూసలు కదలిపోయి రోగి పూర్తిగా అచేతనం (పారలైజ్) అయ్యే అవకాశాలుంటాయి. అంతేకాదు... రోగికి గుచ్చుకుపోయిన వస్తువులు ఏవైనా ఉంటే వాటిని బలవంతంగా లాగడం కూడా సరికాదు. ఇక రోగికి రక్తస్రావం అవుతూ ఉంటే అక్కడ బలంగా అద్ది ఉంచి రక్తస్రావాన్ని నిలిపేందుకు ప్రయత్నించాలి. ఈ ప్రక్రియను ‘టార్నిక్వెట్’ అంటారు.
 
మీ సేవాభావం... కావాలి ఇతరులకు ఆదర్శం!

 
మీ సేవాభావం ఇతరులకు ఆదర్శం కావాలని ‘సాక్షి’భావిస్తోంది. దాంతో మరింత మంది స్ఫూర్తి పొందాలని ‘సాక్షి’ ఆశిస్తోంది. తద్వారా సమాజానికి హితం చేకూరాలన్నది సాక్షి ఆకాంక్ష. అందుకే వైద్య రంగంలో విశేష సేవలు అందించిన వారికి ‘సాక్షి ఎక్స్‌లెన్సీ అవార్డు’లు ఇవ్వాలని సంకల్పించింది. వ్యక్తిగతంగా గానీ లేదా ఏదైనా సంస్థాగతంగా గానీ మీరు అందించిన వైద్య సేవలను తెలియజేస్తూ పంపే ఎంట్రీలను సాక్షి ఆహ్వానిస్తోంది. ఈ వైద్యసేవలు కేవలం ఉచిత వైద్య శిబిరాల వంటి సంప్రదాయ పద్ధతుల్లాంటివే కాకుండా... వైద్యపరిశోధన ద్వారా ఏదైనా ఒక పరికరం రూపకల్పన... తద్వారా ఒక సమూహానికే లబ్ధి చేకూరడం వంటివైనవి కూడా కావచ్చు.

ఇందుకు 2014 సంవత్సరానికి గాను మీరందరించిన సేవలను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఆ ఏడాది వైద్యపరంగా సమాజానికి మీరందరించిన సేవలను తెలుపుతూ మీ ఎంట్రీలను పంపండి. మీ సేవాకార్యకలాపాలందించిన దృష్టాంతాలకు తగిన ధ్రువీకరణ పత్రాలను జతచేస్తూ ఏప్రిల్ 7 లోపు మీ ఎంట్రీలను ఈ కింది చిరునామాకు పంపండి. సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్, సాక్షి టవర్స్, 6-3-249, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 500 034. కేవలం వైద్యపరమైన సేవా విభాగంలోనే గాక... ఈ ఏటి తెలుగు ఎన్నారై, రైతు, పారిశ్రామికవేత్త, విశేష ప్రతిభ కనబరచిన విద్యార్థి, విశేష సేవలందించిన స్వచ్ఛంద సేవాసంస్థ, యంగ్ అఛీవర్స్, నాటకరంగంలో అత్యుత్తమ ప్రతిభ చూపిన స్త్రీ, పురుషులకూ సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డులు ప్రకటిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement