దగ్గర వారితో కష్టాలను పంచుకుంటేనే కాసింత ఉపశమనం కలుగుతుందనేది ఇప్పటి వరకు అందరూ నమ్మే సంగతి. అయితే, ఒక తాజా పరిశోధన ఇందుకు పూర్తి విరుద్ధమైన వాస్తవాన్ని బయటపెట్టింది. కష్టాలను, సమస్యలను ఇతరులతో పంచుకుంటే ఉపశమనం కలగడం కంటే, మానసిక ఆందోళన, దిగులు పెరిగి పరిస్థితి మరింత జటిలమవుతుందని బ్రిటిష్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంకషైర్‌కు చెందిన మానసిక చికిత్స నిపుణులు ఈ అంశంపై విస్తృత పరిశోధన నిర్వహించారు.
సమస్యలకు స్పందించి సహాయానికి, సమస్య నుంచి త్వరగా బయటపెట్టే సలహాలు ఇచ్చేవారికి సమస్యలు వెల్లడించడంలో పొరపాటు లేదని, అయితే, వినడానికి ఎవరో ఒకరు దొరికారు కదా అని అదే పనిగా సమస్యల గురించి చెప్పుకుంటూ పోతే ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా, మానసిక ఆందోళన మరింత పెరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఏదైనా సమస్యల ఎదురైనప్పుడు ఆత్మీయులతో చెప్పుకుంటే, వారి నుంచి ఏదో ఒక పరిష్కారం లభిస్తుందని చాలామంది ఆశిస్తారని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ రాబిన్ బెయిలీ చెబుతున్నారు. అయితే, సమస్యలను వినేవాళ్లలో చాలా కొద్దిమంది మాత్రమే పరిష్కారానికి సహకరిస్తారని, మిగిలిన వాళ్లు ఊరకే వింటూ జాలి కురిపిస్తారని, దీని వల్ల సమస్యల్లో చిక్కుకున్న వారి పరిస్థితి మరింత దిగజారుతుందని వివరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment