
లండన్ : మధుమేహ వ్యాధిగ్రస్తులకు శాకాహారం మేలుచేస్తుందని తాజా అథ్యయనం వెల్లడించింది. శాకాహారం తీసుకోవడం ద్వారా టైప్ టూ మధుమేహంతో బాధపడేవారు బరువు తగ్గడం, గుండె జబ్బులతో మరణించే ముప్పును తగ్గించుకోవచ్చని పరిశోధకులు పేర్కన్నారు. మాంసానికి దూరంగా ఉండటం ద్వారా ఈ రోగులు ఇన్సులిన్, కొలెస్ర్టాల్ స్థాయిలు అదుపులో ఉంటాయని ఫలితంగా గుండె జబ్బులు, స్ర్టోక్ ముప్పును తగ్గించవచ్చని అథ్యయనం పేర్కొంది.
టైప్ టూ మధుమేహంతో బాధపడే వారిలో 60 నుంచి 70 శాతం మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారని అథ్యయన రచయిత, ఫిజిషియన్స్ కమిటీ ఫర్ రెస్పాన్సిబుల్ మెడిసిన్‌కు చెందిన హనా కహ్లెవా చెప్పారు.
కూరగాయలతో కూడిన ఆహారంతో గుండె సమస్యలను తగ్గించుకోవడంతో పాటు అదే సమయంలో టైప్ టూ డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చన్నారు. అధిక ఫైబర్, తక్కువ కొవ్వులతో కూడిన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను అధికంగా తీసుకోవాలని సూచించారు. క్లినికల్ న్యూట్రిషన్ జర్నల్‌లో అథ్యయన వివరాలు ప్రచురితమయ్యాయి.