అక్కడ అమ్మాయిని పేరడిగితే అపార్థాలైపోతాయి.. | Vietnam language And Culture Special Story | Sakshi
Sakshi News home page

చితేన్‌ లాజీ

Published Sat, Aug 31 2019 7:53 AM | Last Updated on Sat, Aug 31 2019 7:53 AM

Vietnam language And Culture Special Story - Sakshi

సంప్రదాయ దుస్తులలో వియత్నామీ యువతి (ప్రతీకాత్మక చిత్రం)

అపరిచితురాలైన వియత్నామీ అమ్మాయిని ‘చితేన్‌ లాజీ?’ అని అడిగితే అపార్థాలైపోతాయి. ‘మీ పేరేమిటండీ’ అని ఈ మాటకు అర్థం. కావాలంటే అపరిచితురాలైన అబ్బాయిని ‘మీ పేరేమిటండీ? అని అడగొచ్చు. ఏమని అడగాలి వియత్నామీ భాషలో? ఆచార్య రాజారెడ్డిని అడగండి. ఇవనే కాదు, వియత్నాం భాష గురించి ఆయన ఎన్నెన్నో మంచి విషయాలు చెబుతారు.

వియత్నాంలో మోటార్‌ బైక్‌లు ఎక్కువ. మన దగ్గరలా రోడ్లనిండా కార్లు కనిపించవు. ఎటు చూసినా బైకులే. అక్కడి మహిళలు కూడా బైక్‌ల మీదే బయటి పనులు చక్కబెట్టేస్తుంటారు. ఇక వియత్నామీలు ఇష్టంగా తినే నూడుల్‌ సూప్‌ ‘ఫో’ ఆ దేశపు జాతీయ ఆహారం అనే అనుకోవాలి. ‘ఫో’ను వండని, ‘ఫో’ ఉండని హోటళ్లు, రెస్టారెంట్‌లు ఉండనే ఉండవు. కాఫీ ఘుమఘుమలు ఏ వేళనైనా దేశమంతటా వ్యాపించి ఉంటాయి. బ్రెజిల్‌ తర్వాత కాఫీ ఎక్కువగా పండే దేశం కూడా ఇదే. ‘ఎగ్‌ కాఫీ’ వియత్నాం స్పెషల్‌. పర్యాటక కేంద్రాలైతే ఎంత రమణీయంగా ఉంటాయో పని గట్టుకుని చెప్పనక్కర్లేదు. ఆ కల్చర్, కట్టడాలు, ప్యారడైజ్‌ బీచ్‌లు ఆ దేశానికే ప్రత్యేకం. రెండు రోజుల క్రితమే ఇండియా టూరిజం వియత్నాం టూరిజంతో ‘టైఅప్‌’ అయింది కూడా.

వియత్నామీ భాష, సంస్కృతులపై ఆచార్య రాజారెడ్డి ప్రసంగం (ఫైల్‌ ఫొటో)
అయితే వీటన్నిటికన్నా విలక్షణమైనది వియత్నామీ భాష. ‘‘విలక్షణమైనదే కాదు, మధురమైనది కూడా’’ అంటారు ఆచార్య కోనాపల్లి రాజారెడ్డి. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ‘సౌత్‌ ఈస్ట్‌ ఏషియా అండ్‌ ఫసిఫిక్‌’ విభాగానికి ఆయన ముఖ్య సలహాదారు. ఆయనకేమిటి వియత్నాంతో సంబంధం? సంబంధం కాదు. బంధం. భారతదేశంలో వియత్నాం భాష మీద పరిశోధన చేసిన ఏకైక వ్యక్తి రాజారెడ్డి! భారత ఆర్మీ అధికారులు వియత్నాంకు వెళ్లే ముందు ఎస్వీయూకు వచ్చి రాజారెడ్డి దగ్గర వియత్నాం భాషలో శిక్షణ పొందారంటే చూడండి. ఎస్వీయూలో చాలామంది బోధన బోధనేతర సిబ్బందికి కూడా ఆయన పెద్దన్నయ్య. రాజారెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళెం సమీపంలోని కోటూరుగ్రామంలో జన్మించారు. బంగారుపాళెంలో చదివారు. చిత్తూరులో బి.ఏ. డిగ్రీ. తర్వాత ఎస్వీయూ నుంచి హిస్టరీలో ఎం.ఏ. పట్టా. ఆ తర్వాత ఆచార్య వి.యం.రెడ్డి పర్యవేక్షణలో వియత్నాం భాషలో పరిశోధన. ఈ పరిశోధన కోసం వియత్నాంలో ఆయన చాలాకాలం గడిపారు. ఫ్రెంచ్‌ డిప్లొమాను, వియత్నమీజ్‌ లాంగ్వేజ్‌ డిప్లొమాలను కూడా పొందారు. వియత్నాంలో పరిశోధన చేస్తున్న రోజుల్లోనే ఇంటర్వ్యూ లేకుండా నేరుగా ప్రత్యేక మినహాయింపుతో ఎస్వీయూలో అధ్యాపకుడిగా చేరారు. ఎస్వీయూ ఇండోచైనా విభాగంలో అధ్యాపక వృత్తిని చేపట్టారు. ఆ తర్వాత ఆచార్యులుగా, సెంటర్‌ ఫర్‌ సౌత్‌ ఈస్ట్‌ ఏసియా అండ్‌ పసిఫిక్‌ డైరెక్టరుగా, పాఠ్య ప్రణాళికా సంఘ అధ్యక్షులుగా ఉన్నారు. భారత విదేశాంగ విధానం, వియత్నాం ఆధ్యయనం వంటి ప్రత్యేకాంశాలపై ఎన్నో పరిశోధనలు చేశారు. వియత్నాంలో జరిగిన కొన్ని సమావేశాలకు భారత ప్రభుత్వ ప్రతినిధిగా హాజరయ్యారు.

రాజారెడ్డి వల్ల ఎస్వీయూలోని ఆయన స్నేహితులైన అధ్యాపకులకు కాస్త వియత్నాం భాషతో పరిచయం ఏర్పడింది. మో...తాయ్‌...బా... అంటే ఒకటి...రెండు...మూడు. శతబ్‌ అంటే సైకిల్‌. అంగ్‌ తేన్‌ లాజీ అంటే మగవారిని మీ పేరేమి అని అడగడం... చితేన్‌ లాజీ అంటే ఆడవారిని మీ పేరేమి? అని అడగడం. ఇలాంటి చిన్న చిన్న పదాలను, వాక్యాలను ఆయన స్నేహితులు సరదాగా వల్లె వేస్తుంటారు. సెప్టెంబర్‌ 2 వియత్నాం నేషనల్‌ డే. ఆ దేశ స్వాతంత్య్ర దినం. ఆ సందర్భంగానే సంస్కృత ప్రాకృత భాషల రంగరింపుతో తీపెక్కిన వియత్నామీ భాష గురించీ, ఆ భాషాఫలాలను తెలుగులో నేల సాగు చేస్తున్న రాజిరెడ్డి గురించీ.  – ఆచార్య పేటశ్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement