
వినాయక చవితి అంతరార్థం
భారతీయులు జరుపుకునే పండుగలన్నీ కూడా ఎన్నో ప్రయోజనాలని సాధించటానికి ఉద్దేశింపబడినాయి.
భారతీయులు జరుపుకునే పండుగలన్నీ కూడా ఎన్నో ప్రయోజనాలని సాధించటానికి ఉద్దేశింపబడినాయి. వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక, పర్యావరణ, మానవీయ, అభివృద్ధి జరగటానికి దోహదపడే విధంగా పండుగ చేసుకునే పద్ధతిని ఏర్పరచటం జరిగింది. అందులోని అంతరార్థాన్ని తెలుసుకుంటే పండగ పరమార్థం తెలుస్తుంది. జీవితంలో కొత్త వెలుగు వస్తుంది.
వినాయక చవితి పిల్లలు సంబరంగా చేసుకునే పండగ. విద్యాధిదేవత కనుక ఆయన్ని పూజిస్తే చదువు బాగా వస్తుందని పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. పూజ అయినాక పుస్తకాలకి పూజ చేసి, వినాయకుడి ముందు గుంజీలు తీస్తారు. ఆయనకి ఇష్టమట! కారణం.... మన శరీరంలో భూతత్త్వాన్ని నియంత్రించే మూలాధారానికి అధిపతి గణపతి. ఆ చక్రం శరీరాకృతిని, దానికి హేతువులైన ఎముకలని, కండరాలని నియంత్రిస్తుంది. కుదురు కలిగేట్టు చేస్తుంది. పిల్లలకి ఇవి అత్యావశ్యకాలు కదా! అవి సరిగా ఉండాలంటే మూలాధారం సరిగ్గా పని చేయాలి. గుంజీలు మూలాధారాన్ని చక్కబరుస్తాయి. అందుకని గణపతి ఎదుట పిల్లల చేత గుంజీలు తీయిస్తారు. (పెద్దలు చేస్తే కూడా మంచిదే ననుకోండి) ఇది వైయక్తికం.
గణపతి అనే పేరు ఎందుకొచ్చిందంటే... గణం అంటే సమూహం. ఎక్కడెక్కడ సమూహాలు ఏకోన్ముఖంగా పని చేయాలో అక్కడ వాటి చేత పని చేయించే శక్తికి గణపతి అని సంకేతించారు. దేవత గణాలు, మన శరీరలో ఉండే విభిన్న అవయవాలకి సంబంధించిన కణాల సముదాయాలు అక్షరాల సముదాయాలు, సంగీతంలో ఉండే స్వరాల సముదాయాలు... ఇలా ఎన్నో! వాటిని చెదిరి పోకుండా, ఒకే లక్ష్యం వైపు నడిపించ గల శక్తి. గణపతిని పూజించి ఆ తత్త్వాన్ని తెలుసుకున్న వారికి సమూహాలని, అంటే గుంపుని, లేదా మందని తన వెంట నడిపించటం తెలుస్తుంది.
ఈ పండుగలో ఇమిడి ఉన్న ఖగోళ విజ్ఞానం: భారతదేశం లోని మహర్షులు ఖగోళ విజ్ఞానాన్ని కూడా పురాణ గాథలుగా మలచి ఇచ్చారు. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు సూర్యోదయానికి ముందు తూర్పున ఆకాశంలో ఏనుగు తొండం ఆకారంలో ఒక నక్షత్ర సముదాయం, దానికి కిందగా మూషిక ఆకారం కల నక్షత్ర సముదాయం కనపడుతాయి. మొత్తం దృశ్యం మూషికం మీద ఏనుగు తొండం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సూర్యోదయానికి ముందుగా కనిపించే నక్షత్రానికి సంబంధించిన దేవతని ఆనాడు ఆరాధించాలని ఋగ్వేదోక్తి. భాద్రపద శుద్ధ చవితి నాడు సూర్యోదయానికన్న ముందు తూర్పున హస్తానక్షత్రం ఉదయిస్తుంది కనుక ఆ నాటి దైవతం హస్తిముఖుడు. హస్తి ముఖమున్న దైవతం గణపతి అవటం వల్ల ఆనాడు పూజించటం సంప్రదాయమయింది.
ఫాలచంద్రుడు: సూర్యాస్తమయం తరువాత హస్తానక్షత్రం పైన చంద్రోదయం అవుతుంది. చూడటానికి చంద్రుడు గజముఖుడి నుదురులాగా ఉంటుంది. అప్పుడు ఆకాశం వినాయకుని స్వరూపం లాగా దర్శన మిస్తుంది. మధ్యలో ఒక చుక్క ఉండి విశాలమైన ఆకాశం వినాయకుడి బొజ్జలాగా దర్శనమిస్తుంది. ఈశాన్యం నుండి నైరుతి వరకు ఒక పట్టి లాగా విస్తరించిన పాలపుంత యజ్ఞోపవీతం లాగా కనిపిస్తుంది. ఈశాన్యంలో గుంపుగా ఉండే నక్షత్రాలు పడగెత్తిన పాముతల లాగా ఉండి నాగ యజ్ఞోపవీతం అనిపిస్తుంది. అందుచేత భాద్రపద శుద్ధ చవితినాడు పూజించే దైవతాన్ని, హస్తి ముఖుడు, మూషిక వాహనుడు, లంబోదరుడు, నాగ యజ్ఞోపవీతుడు మొదలైన నామాలతో పిలవటం జరుగుతుంది.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అనేది విష్ణువుకి సంబంధించిన స్తుతి గణపతిది కాదు అనిపించి, అన్న వారు కూడా ఉన్నారు. బుధగ్రహానికి అధిష్ఠాన దైవం విష్ణువు. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు. అందుకే వినాయకుణ్ణి కూడా విష్ణువుగా (సర్వవ్యాపి అనే అర్థంలో) స్తుతించటం చూస్తాం. శుక్లాంబర ధరం... అనే శ్లోకం ఈ అర్థం లోనే అన్వయం చేసుకోవాలి.
పత్రి పూజ: బుద్ధుడికి ప్రీతి పాత్రమైన రంగు ఆకుపచ్చ. ఈ కారణంగానే ఆకుపచ్చరంగులో ఉండే అన్ని రకాల పత్రులతోనూ వినాయకుడికి పూజచేసే ఈ సంప్రదాయంలో పిల్లలకి ఈ ఋతువులో మొలకెత్తి పెరిగే మొక్కలని పరిచయం చెయ్యటం, వేటిని ఉంచాలో, వేటిని పనికి రావని తీసేయ్యాలో తెలియచెప్పాలన్న అంతరార్థముంది. అంతేకాదు, ఈ 21 పత్రుల నుండి వచ్చే గాలి పర్యావరణాన్ని పరిశుభ్రం చేస్తుంది. నిమజ్జనం చేసినప్పుడు నీటిని శుభ్రపరచి, కొంతకాలం నీటిలో క్రిమికీటకాదులు చేరకుండా కాపాడుతుంది.
నిమజ్జనం: సాధారణంగా తొమ్మిది లేదా ఏడు, ఐదు, మూడు రోజులు పూజించిన వినాయకుణ్ణి నిమజ్జనం చేయటం సంప్రదాయం. ఇది మరి ఏ ఇతర పూజల్లోనూ కనపడదు. చెరువులోని మట్టితోచేసిన గణపతిని మళ్ళీ ఓషధులతో కలిపి నీటిలో కలపటం పర్యావరణ పరిరక్షణే. ఈ ప్రక్రియలో భూమి పొరలు చక్కగా పైకి కిందకి సరిచెయ్యబడటం జరుగుతుంది.
శ్యమంతకోపాఖ్యానం: ఈ కథ ఎవరికిచ్చిన సౌకర్యాన్ని (వరాన్ని) వారే ఉపయోగించుకోవాలని, శుచిగా లేని వారు పవిత్రమైన , విలువైన వాటిని ధరిస్తే మేలు కలుగకపోగా కీడు కలుగుతుందని, అతి విలువైన దేదైనా లభిస్తే దానిని రాజుకి (ప్రభుత్వానికి) అందిస్తే అందరికి ఉపయోగ పడుతుందని, ఇవ్వకుండా తామే ఉంచుకుంటే అది ప్రాణాంతకం కూడా అవవచ్చునని తెలియ చేస్తోంది. ఇది తెలుసుకుంటే వినాయక వ్రత ఫలితం పూర్తిగా లభిస్తుంది. తెలిసిచేసుకుంటే వినాయకచవితి మనకి ఎన్నో విషయాలని నేర్పుతుంది. జీవితాలని సరిదిద్దుతుంది.
ఇంతకూ వినాయకుడు బ్రహ్మచారా? కాదా?
హస్తానక్షత్రం కన్యారాశికి చెందింది. ఈ కారణంగా వినాయకుణ్ణి బ్రహ్మచారిగా, తరచూ బాలుడుగా వర్ణించటం కనపడుతుంది. కన్యారాశికి అధిపతి బుధుడు. బుధుడు అంటే పండితుడు అని కూడా అర్థం. బుద్ధి బాగా వికసించిన వాడు అని ఆ మాటకి అర్థం. బుద్ధిని ఆశ్రయిస్తే సిద్ధి లభిస్తుంది. దానివల్ల క్షేమం, లాభం కలుగుతాయి. అందుకే సిద్ధి బుద్ధి, వినాకుడి భార్యలు (శక్తులు) గా, క్షేముడు, లాభుడు కుమారులు (వినాయకుడి పూజకి ఫలితాలు) గా ప్రతీకాత్మకంగా చెప్పబడింది. వినాయకుడికి భార్యాపిల్లలు ఉన్నారనటంలోని అంతరార్థం ఇదే. - డా. ఎన్. అనంతలక్ష్మి