గృహహింసకు వీసా | Visa to domestic violence | Sakshi
Sakshi News home page

గృహహింసకు వీసా

Published Wed, Jun 1 2016 10:55 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

గృహహింసకు వీసా - Sakshi

గృహహింసకు వీసా

వీసాలు రావడం కష్టమే.
అమ్మాయి పెళ్లి చెయ్యడం?
అమ్మో... అదీ పెద్ద కష్టమే.
ఈ రెండు కష్టాలూ మూడు ముళ్లతో సెటిలైపోతే?
‘అబ్బ! ఎంత బాగుండు!!’
అనుకునే అమ్మాయిల తల్లిదండ్రులు ఎందరో!
ఫారిన్‌లోఉన్న ఒక అయ్య చేతిలో పెడితే...
అమ్మాయి సుఖపడుతుందని ఎంత సంబరమో!
అమ్మా.. సిగరెట్‌లతో కాలుస్తున్నాడే...
బెల్టుతో కొడుతున్నాడే...
అన్నం పెట్టడం లేదే...
కడుపులో తంతున్నాడే...
ఇంట్లోనుంచి బయటికి అడుగుపెట్టనివ్వడం లేదే..
అన్నిటికీ అనుమానిస్తున్నాడే..
నాన్నకు చెప్పకే బాధపడతాడూ...
ఏదో చేసి నన్ను వెనక్కి రప్పించుకోవే.
ఇవీ... తరచు తల్లిదండ్రులు వింటున్న ఆక్రందనలు!
దీనికి పరిష్కారం లేదా?
ఉంది!

 

కాలం మారినా స్త్రీల పట్ల హింసకు కాలం చెల్లలేదు. ముఖ్యంగా గృహహింసకు. స్వదేశంలో సరే విదేశాలలోనూ ఇది పెరిగిపోతోంది. ఎన్‌ఆర్‌ఐ భర్తల ఆగడాలను సహిస్తూ వాళ్ల శాడిజానికి బలవుతున్న బాధితులు ఎక్కువవుతున్నారు. తాజా ఉదాహరణ హైదరాబాద్‌కు చెందిన రమ్యకృష్ణ. అమ్మానాన్నలు ఈ ఒక్కగానొక్క కూతురుని బాగా చదివించారు. తెలియని సంబంధమైతే ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందోనని బంధువుల సంబంధాన్నే ఖాయం చేశారు. అబ్బాయికి ఆస్ట్రేలియాలో ఉద్యోగం. ఘనంగా పెళ్లి చేసి కాపురానికి కావల్సిన వస్తువులను సారెగా ఇచ్చి సాగనంపారు. వెళ్లాక అమ్మాయి కూడా ఉద్యోగంలో చేరింది. కొన్నాళ్లు సవ్యంగానే గడిచిన ఆ సంసారంలో కలతలు వచ్చాయి. రమ్యకృష్ణ తల్లిదండ్రులు జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. బిజినెస్ చేస్తాను డబ్బు సర్దమని అల్లుడు అడిగితే ఇండియాలో లోన్ తీసుకొని మరీ డబ్బు పంపారు. అయినా అబ్బాయి సంతృప్తి పడలేదు. పిల్లలు కలగట్లేదంటూ ఆరళ్లు మొదలయ్యాయి. తన బాధను తల్లితో ఏకరువు పెట్టుకుంది. అంతా చక్కబడ్తుందిలే అని నచ్చజెప్పారు. కాని సమస్య చక్కబడలేదు. రమ్యకృష్ణ ప్రాణాన్ని బలితీసుకుంది. ఆత్మహత్య చేసుకుందని భర్త, కాదు హత్య అని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా రమ్యకృష్ణ జీవితం అలా ముగియాల్సింది కాదు.

 
ఇదో ఇంకో వేధింపు

కరీంనగర్‌జిల్లాకు చెందిన మాధవి బీటెక్ చేసింది. ఎమ్‌టెక్ చేసి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సురేష్‌తో పెళ్లి అయింది. మ్యారేజ్ బ్యూరో ద్వారా కుదిరిన సంబంధం. పెళ్లిచూపులయ్యాక పెళ్లికి 20 రోజుల వ్యవధే ఇచ్చారు అబ్బాయి తరపువాళ్లు. ‘ఇంత త్వరగానా? కుదరదేమో’ అని అమ్మాయి తరపువాళ్లు వెనకడుగువేస్తుంటే..  ‘అబ్బాయికి లీవ్ దొరకదు. కష్టం. మళ్లీ పెళ్లి కోసం రాలేడు’ అంటూ తొందర పెట్టారు. పెళ్లిచూపులప్పుడే సురేష్ ప్రవర్తన మాధవికి నార్మల్‌గా అనిపించలేదు.  ఫోన్లో కూడా ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. ఈ విషయమే తల్లితో చెప్పింది. టెన్షన్ పడ్తున్నాడేమోలే అని తల్లి కొట్టి పారేసింది. అయితే మాధవి సందేహం అబద్ధం కాలేదు. హడావుడి పెళ్లి, అంతకన్నా  హడావుడిగా అమెరికా ప్రయాణం. ల్యాండ్ అయిన వారానికి తెలిసింది మాధవికి తన భర్తకు మగాళ్లంటేనే ఇష్టమని. మోసపోయాననే అవమానం ఆవేశంగా మారింది. ‘నీ పరిస్థితి తెలిసీ నన్నెందుకు పెళ్లి చేసుకున్నావని’ భర్త కాలర్ పట్టుకుంది. ‘మా అమ్మానాన్నా కోసం. చుట్టాలు, ఫ్రెండ్స్ దగ్గర పరువు కాపాడుకోవడానికి’ సమాధానమిచ్చాడు. కుమిలికుమిలి ఏడ్చింది. ఎక్కడ వాళ్ల తల్లిదండ్రులతో చెప్పి తన బండారం బయటపెడ్తుందోనని భయపడ్డ సురేష్ భార్య పాస్‌పోర్ట్ తీసి దాచేశాడు. సెల్‌ఫోన్ లాక్కున్నాడు. ఇంట్లో ల్యాండ్‌లైన్ కట్‌చేశాడు. ఇంటర్నెట్ కనెక్షనూ తీసేశాడు. ఏం చేయాలో పాలుపోలేదు. నెల రోజులవుతున్నా తమ కూతురితో మాట్లాడలేకపోవడం, అన్నిటికీ అల్లుడే ఆన్సర్ చేయడం, మాధవి మాట్లాడలేకపోవడానికి ఏదో ఒక సాకు చెప్పడం ఆమె  తల్లిదండ్రులు అనుమానించేలా చేశాయి. దాంతో వాళ్లు రంగంలోకి దిగేసరికి సురేష్ దొరికిపోయాడు, మాధవి బతికిపోయింది.

 
ఈ మధ్యే జరిగిన ఇలాంటి ఓ డజన్ సంఘటలను ఉదహరించొచ్చు. అన్నిట్లో బాధితులు లోకజ్ఞానంలేని అమాయకులు కాదు. అయినా భర్తల ఆగడాలకు బేలగా బలైపోయారు. కారణం... విదేశీ చట్టాలపట్ల అవగాహన లేకపోవడం. ఇబ్బందుల్లో ఉంటే అత్యవసరంగా ఎవరిని సంప్రదించాలి? ఎలాంటి అడుగువేయాలి అన్న విషయాలు తెలియకపోవడం. అసలు వాటి గురించిన ధ్యేసే లేకపోవడం. ఇక్కడంటే అమ్మా నాన్న, అన్న, అక్క, స్నేహితులు, బంధువులు అందరూ ఉంటారు. మరి దేశంకాని దేశంలో? షెల్టర్ హోమ్స్ ఎక్కడుంటాయి? ఉంటున్న ఊళ్లో అడ్వకేట్లు ఎవరు? వాళ్ల నంబర్లు, కౌన్సిలింగ్ సెంటర్ల  వివరాలు గట్రా తీసుకోవాలి, విధిగా దగ్గరపెట్టుకోవాలి అన్న ఆలోచన ఏ ఆడపిల్లా చేయదు. ఎందుకంటే భర్త మీద నమ్మకం. పెళ్లి కుదరగానే ఫేస్‌బుక్, వాట్సప్ చాటింగ్స్‌లో కాబోయే భర్త మనస్వత్వాన్ని అంచనా వేసే ప్రయత్నమూ చేయదు. ఇక్కడా నమ్మకమే నడిపిస్తుంది. లక్షల కట్నాలు, ఆర్భాటపు పెళ్లి మీద  ఆరాటం తప్ప అమ్మాయి ప్రాక్టికల్ లైఫ్ ఎలా ఉండబోతోందన్న ఆందోళన, ఆలోచనలేదు అమ్మాయి తల్లిదండ్రులకు. అందుకే ఎన్‌ఆర్‌ఐ సంబంధాలు అన్నీ కాకపోయిన చాలా విఫలమై విషాదం మిగులుతోంది. కనుక ముందే జాగ్రత్త పడాలి. విదేశి సంబంధాలు ఖాయం చేసుకునే ముందు నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలి. పెద్ద దేశాల్లో అమ్మాయి సుఖపడేమాట నిజమే కాని ఆ సుఖం చేసుకోబోయేవాడి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి.

 - సరస్వతి రమ

 

మధ్యవర్తులు పోయి మ్యారేజ్ బ్యూరోలు రావడంతో....
ఎన్‌ఆర్‌ఐ సంబంధాలన్నీ దాదాపు షార్ట్‌టైమ్ గడువుతో కుదురుతున్నవే.  ఇంతకుముందు మధ్యవర్తులుండేవాళ్లు. రెండు కుటుంబాల గురించిన విరాలను తెలిపేవాళ్లు.  ఇప్పటి సంబంధాలన్నీ   అన్నీ మ్యారేజ్‌బ్యూరోలు, ఆన్‌లైన్ మ్యాట్రిమోనీలు కుదురుస్తున్నవే కాబట్టి  నచ్చిన సంబంధం గురించి తెలుసుకునే బాధ్యతను అమ్మాయి తరపు దగ్గరి బంధువుకి అప్పగించాలి. ఇర ుకుటుంబాల పెద్ద మనుషుల ముందుకూర్చోని ఆ కుటుంబాల వాళ్లు కట్నకానుకల విషయం కాక అబ్బాయి, అమ్మాయి మనస్తత్వం, ప్రవర్తనల గురించి మాట్లాడాలి. సర్దుబాటు చేసుకోగలరో లేదో అంచనాకు వచ్చే వీలుంటుంది. అమ్మాయి, అబ్బాయి కంపార్టబులిటీ చెక్ చేసుకోవడానికి ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ వెళితే మంచిది.  - పద్మపాల్వాయ్, సైకియాట్రిస్ట్.

 

విదేశీ సంబంధం ఖాయం చేసుకునే ముందు....
అబ్బాయి తరపు ఆనవాళ్లను అంచనావేయాలి.
వాళ్ల ఫ్యామిలీ నేపథ్యాన్ని తెలుసుకోవడం అత్యవసరం. నేర చరిత్ర ఉందేమోనని అనుమానడ్డంలో తప్పులేదు. నివృత్తి చేసుకునే వంకతోనైనా ఆ కుటుంబ వివరాలు తెలుస్తాయి.
అబ్బాయి ఉద్యోగం చేస్తున్న చోటు, జీతం, ఉద్యోగం పర్మినెంటా? టెంపరరా? వగైనా వివరాలు తెలుసుకోవాలి.  అతను ఉంటున్న చోటునూ  తెలుసుకోవాలి. అమ్మాయికి ఏదైనా కష్టం వస్తే చుట్టుపక్కల స్పందించే వాళ్లున్నారా ఆరా తీయాలి.
అతనికి ఎలాంటి వీసా ఉంది, అమ్మాయిని ఏ వీసా మీద తీసుకెళ్తున్నాడు? ఒకవేళ డిపెండెంట్ వీసా మీద వెళితే ఎన్నాళ్లలో ఇండిపెండెంట్ వీసా వస్తుంది? అతని ఉద్యోగం అందుకు పర్మిట్ చేస్తుందా? వంటి విషయాలను వీసా కన్సల్టెన్సీ ద్వారా తెలుసుకోవాలి. సమాచారమంతా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే కాలం  కాబట్టి ఈ విషయాలన్నీ అమ్మాయిలూ తెలుసుకోవచ్చు. పెళ్లాయ్యాక తాను ఏ దేశం వెళ్లబోతోందో ఆ దేశానికి సంబంధించిన చట్టాలు, ఆడవాళ్లకు కల్పిస్తున్న వెసులుబాటు, సౌకర్యాలనూ అమ్మాయిలు తెలుసుకోవాలి. డొమెస్టిక్ వయెలెన్స్‌ను ఫైల్ చేయడానికి అప్రోచ్ కావల్సిన ప్రొసిజర్‌ను తెలుసుకోవాలి.
విదేశాల్లో భారతీయ మహిళలను భర్తలు డొమెస్టిక్ వయెలెన్స్‌కు గురి చేస్తున్నా , అదనపు కట్నం కోసం వేధిస్తున్నా వాళ్ల మీద అక్కడ కోర్టుల్లో కూడా కేస్ ఫైల్ చేయొచ్చు. లేదంటే ఇక్కడా చేయొచ్చు. ఇక్కడ కేస్ ఫైల్ చేస్తే అక్కడున్న భర్తను రప్పించడానికి రెడ్‌కార్నర్ నోటీసు ఉంది. ఒకవేళ భర్త ఇక్కడే ఉండి తప్పించుకోవడానికి విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తే   ‘లుక్ అవుట్‌నోటీస్’ అతన్ని వెళ్లనివ్వకుండా చేస్తుంది.
దేశంలోనైనా, విదేశాల్లో నైనా అత్తింట్లో, భర్త చేతిలో అమ్మాయి ఆరళ్లకు గురవుతుంటే అక్కున చేర్చుకోవడానికి తామున్నామనే భరోసాను తల్లిదండ్రులు కల్పించాలి. అమ్మాయి వేసే ఏ అడుగుకైనా అండగా ఉంటామనే ధైర్యాన్నివ్వాలి.

 - రమ్యకుమారి, హైకోర్ట్ అడ్వకేట్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement