
హిందూ దేవతలలో శయనం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది విష్ణుమూర్తి. ఆయన శేషాన్ని పాన్పుగా చేసుకుని శయనిస్తాడని, అందుకే ఆయనకు అనంతశయనమూర్తి అని పేరు ఉందని అందరికీ తెలిసిన విషయమే. కానీ సదా యోగముద్రలో, యోగిరూపంలో కనిపించే పరమేశ్వరుడు విగ్రహ రూపంలో కనిపించడమే అరుదు. అందులోనూ శయనించిన భంగిమలో కనిపిస్తే మరీ అరుదు. అటువంటి శివరూపాలలో అరుదైన రూపం మన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరుజిల్లా దగ్గర సురుటుపల్లిలో కొలువై ఉంది. ఇక్కడ స్వామివారిని పల్లికొండేశ్వర స్వామి అంటారు. ఇక్కడ అమ్మవారు సర్వమంగలాదేవి మరకతాంబిక అనే పేరుతో నెలకొని వుంది. ఇక్కడ పరమేశ్వరుడు ఒక వైపు ఒరిగి కుడిచేతిని మడిచి తలకింద ఉంచుకొని, తలను అమ్మవారి ఒడిలో ఉంచి విశ్రమిస్తున్న రూపం మనకు గర్భగుడిలో కనిపిస్తుంది. ఈ స్వామి వారి వెనక సూర్యచంద్రులు, దేవతలు ఆయనను సేవిస్తున్నట్లు కనిపిస్తుంది. స్వామివారు సురులతో సేవించబడ్డ పురం కాలక్రమంలో సురుటుపల్లిగా మారిందని క్షేత్ర ఐతిహ్యం.
ఈ స్వామివారి శయనరూపానికి సంబంధించి ఒక పురాణగాథ ఇలా ఉంది.
క్షీరసాగర మథన సమయంలో వెలువడిన విషాన్ని లోకక్షేమం కోసం పరమేశ్వరుడు తన చేతిలో నేరేడుపండు వలే తీసుకుని కంఠంలో దాచుకున్నాడు. ఆ విషప్రభావానికి తాళలేక శివుడు అమ్మవారి ఒడిలో తల ఉంచి కాస్త విశ్రమించాడట. అప్పుడు దేవతలందరూ ఆయన వెనకాల ఉండి శీతలోపచారాలు చేశారట. అదే నేడు మనం చూస్తున్న రూపమని ఈ క్షేత్రపురాణం చెబుతోంది. ఆగమ, శిల్ప శాస్త్రాలలో మరెక్కడా కానరాని శివుడి శయనమూర్తి రూపాన్ని అరుదైనదిగా భావించవచ్చు. కాలకూటవిషాన్ని స్వీకరించిన ఈ స్వామివారిని విషపానమూర్తి, విషాపహరణమూర్తి అని ఆగమ, శిల్పశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ రీతిగా ఈ స్వామివారి శయనమూర్తిని, సర్వమంగలాదేవిని దర్శించి భక్తులు సకల శుభాలను పొందగలరనడంలో ఏ సందేహమూ లేదు. అలాగే ఇక్కడ దక్షిణామూర్తి స్వామి వారు సతీసమేతంగా దర్శనమివ్వడం మరో అద్భుతమైన విషయం.
– డాక్టర్ ఛాయా కామాక్షీదేవి