
తప్పు చేశాం!
వేదిక
మా అబ్బాయికి పెళ్లయి ఏడాది దాటింది. ఒక్కగానొక్క కొడుకు. మిగతావాళ్లతో పోలిస్తే కొంచెం గారాబంగానే పెంచాం. నా భర్త గవర్నమెంటు ఉద్యోగి. మా అబ్బాయిని పెద్ద చదువులు చదివించి విదేశాలకు పంపాలనుకునేవాళ్లం. వాడికి మాత్రం ఎలాంటి ఆశలు, ఆశయాలు ఉండేవి కావు. మా గోలపడలేక... పల్టీలు కొడుతూ కష్టపడి డిగ్రీ పూర్తిచేశాడు. తీరిక దొరికితే చాలు క్రికెట్ గ్రౌండ్‌కి వెళ్లడం తప్ప ఉపయోగపడే ఆలోచనేదీ చేసేవాడు కాదు. వాళ్లనాన్నగారు తనకు తెలిసిన చోట ఉద్యోగంలో పెట్టించారు. ఓ మూడునెలల పనిచేసి ‘నాకు నచ్చలేదు... నాకిష్టమైన ఉద్యోగాన్ని నేను వెతుక్కుంటాను’ అని ఉద్యోగం వేటలో పడి ఓ ఏడాది గడిపేశాడు. మధ్యలో వ్యాపారం చేస్తానంటూ... ఏవో రెండు మూడు ప్రయోగాలు చేసి ఊరుకున్నాడు.
ఆ వంకతో నా దగ్గర చాలా డబ్బు తీసుకుని వృథా చేశాడు. పెళ్లి చేస్తే... వాడే దారిలో పడతాడని పెళ్లి చేద్దామనుకున్నాం. ముందు మంచి ఉద్యోగంలో పెట్టి తర్వాత పెళ్లి చేయడం మంచిది కదా అని తెలిసినవారి దగ్గర ఉద్యోగంలో చేర్పించాం. అదే నెలలో ఏదో మంచి సంబంధం వస్తే వెంటనే పెళ్లి చేసేశాం. పెళ్లయిన రెండో నెలలో ఉద్యోగం మానేశాడు. తోటి ఉద్యోగితో ఏదో గొడవ కారణంగా కంపెనీవాళ్లే వీణ్ణి ఉద్యోగంలో నుంచి తీసేశారని తర్వాత తెలిసింది. ఉద్యోగం పోయి ఏడాది కావస్తోంది. గట్టిగా మాట్లాడితే వేరు కాపురం అంటాడేమోనని భయం. పోనీ వాడిష్టం అనుకుని ఊరుకుందామంటే కోడలి తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాను.
‘మీ అబ్బాయి గురించి మీకు ముందే తెలుసు కదా! అత్తయ్యా... రూపాయి సంపాదన లేకుండా ఇలా ఖాళీగా తిరుగుతుంటే రేపు నా భవిష్యత్తు ఏంటి’ అని మొన్నామధ్య నా కోడలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాను. ‘వాడే మారతాడమ్మా’ అన్నాను. ‘మారాకనే పెళ్లి చేయకపోయారా...? అంటూ నిలదీసింది. ఆ అమ్మాయి అడిగినదాంట్లో నిజం ఉంది. డిగ్రీ చదువుకున్న అమ్మాయి ఆ మాత్రం మాట్లాడ్డం తప్పుకాదు. మేం చేసిందే తప్పు.
- విజయలక్ష్మి, గుంటూరు