కలివిడిగానా? విడివిడిగానా?!
జీవితంలో మీకు బాగా ఇష్టమైన రోజులు ఏవి? అని ఎవరైనా అడిగితే టక్కున వచ్చే సమాధానం‘కాలేజీ డేస్’ ఎందుకంటే ఆ అనుభూతులే ప్రత్యేకం. 20 యేళ్ల వయసులోని ఆ అనుభవాలు 60 యేళ్ల వయసులో నెమరువేసుకోవడానికి కూడా అనుభూతులను అందిస్తాయి. అలాంటి కాలేజీ వాతావరణాన్ని... ‘‘ఎక్కడెక్కడీ చిట్టిగువ్వలూ, ఏడనుంచినో గోరువంకలూ కాలేజీ క్యాంపస్‌లోనే నాట్యంచేసేనే...కాలేజీ క్యాంపస్ అంటే కోడెకైనాలే...’’ అంటూ వర్ణించాడు సినీకవి. నిజంగా టీనేజ్‌లో ఫస్ట్‌టైమ్ కాలేజీలోకి అడుగుపెట్టే వారి మనసులోని భావనకు ఆ పదాలు చాలవు. అయితే ఎవరికైనా ఊహల్లోని ఆ రంగుల హరివిల్లు ఒక్కమాటతో చెదిరిపోతుంది. మీరు చదవబోయేది కో ఎడ్యుకేషన్ కాలేజీ కాదు అని అంటే!
చేయి చాచి స్నేహం కోరిన స్నేహితులు, క్యాంటీన్ కబుర్లు, సినిమా కోసం కాలేజీ బంకులు, క్లాస్‌లో అలర్లు, లెక్చరర్‌తో తిట్లు, చిన్ని చిన్ని గొడవలు, ఫ్రెషర్ పార్టీలు, యాన్యువల్ పార్టీలు, సెమిస్టర్ పరీక్షల హడావిళ్లు, వారాంతాల చిన్ని చిన్ని విహారయాత్రలు..! ఏ కాలేజీలోనైనా, ఎవరి కాలేజీ జీవితంలోనైనా ఇవన్నీ ఉంటాయి. అయితే కో ఎడ్యుకేషన్‌ను మిక్స్ చేస్తే అమ్మాయిల ఓర చూపులు, ఆమెను మెప్పించడానికి అబ్బాయిలు పడే పాట్లు, క్లాస్‌రూమ్‌లో సైన్స్ పాఠాల మధ్య కలుసుకొన్న చూపులు...కూడా ఉంటాయి. ఒకవేళ కో ఎడ్యుకేషన్‌కాకపోతే కాలేజీ పుస్తకంలో ఈ పేజీలన్నీ మిస్సింగ్. కోఎడ్యుకేషన్ అంటే ఒక మ్యాజిక్ కార్పెట్. అయితే నేటి కార్పొరేట్ వరల్డ్‌లో కో ఎడ్యుకేషన్ కరవవుతోంది. జూనియర్ కాలేజీల్లో కో ఎడ్యుకేషన్ ప్రసక్తే లేకుండా పోగా... డిగ్రీ కాలేజీల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఇంజనీరింగ్ కాలేజీలు మాత్రం కొంత వరకూ మినహాయింపు.
విద్యార్థులపై ఇది ఏవిధమైన ప్రభావం చూపుతుంది?
క్లాస్ రూమ్‌లో అమ్మాయిలు లేకపోతే... అబ్బాయిలు మాత్రమే ఉంటే! ఈ పరిస్థితిని ఊహించుకోవడానికే చాలామంది అబ్బాయిలు ఇష్టపడరు. అయితే అబ్బాయిలు అలాగైతేనే బుద్ధిగా ఉంటారని, క్లాస్‌లో అమ్మాయిలు లేకపోతేనే వారు చదువు మీద దృష్టిపెడతారనేది చాలా మంది పెద్దల అభిప్రాయం. కానీ టీనేజ్‌లో కో ఎడ్యుకేషన్ లేకుండా ఇండివిడ్యువల్ కాలేజీల్లో చదవడం వల్ల ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనాలేమీ ఉండవని చెబుతోంది అమెరికన్ అధ్యయనకర్తలు చేసిన ఒక సర్వే. 1968 నుంచి 2013 వరకూ ఎల్‌కేజీ నుంచి 12వ తరగతి వరకూ చదువుకొన్న 16 లక్షల మందికి పైగా విద్యార్థినీ విద్యార్థుల ఫలితాలను విశ్లేషించి తాము ఈ విషయాన్ని చెబుతున్నామని వారు తెలిపారు. కేవలం చదువు మాత్రమే కాదు, విద్యార్థి రేపటి పౌరుడిగా తీర్చిదిద్దబడే విద్యాలయాల్లో వివిధ వయసుల వాళ్లు, అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉండటమే మంచిదని వారు పేర్కొన్నారు. విద్యార్థి మనస్తత్వం, సబ్జెక్టుపై పట్టు, అవ గాహన, బాడీ లాంగ్వేజ్, ప్రవర్తన, దూకుడుతనం వంటి అంశాలపై కో ఎడ్యుకేషన్ ప్రభావం చూపే అవకాశం ఉందని వారు విశ్లేషించారు.
కో ఎడ్యుకేషన్‌లో చదవని విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేకంగా నష్టం లేకపోయినప్పటికీ, కో ఎడ్‌లో చదువుతున్న విద్యార్థులు మాత్రం ఒక విధంగా స్నేహపూర్వకమైన జీవనశైలికి అలవాటు పడే అవకాశాలున్నాయని అధ్యయనకర్తలు అభిప్రాయపడ్డారు.
అబ్బాయిలు మంచి ఫలితాలను సాధించారట!
అయితే యూరప్‌లోని మనస్తత్వ శాస్త్రవేత్తలు, అధ్యయనకర్తలు మాత్రం ఇందుకు భిన్నమైన అభిప్రాయాన్ని వినిపించారు. కో-ఎడ్యుకేషన్ కాలేజీల కంటే అబ్బాయిలకు మాత్రమే పరిమితం అయిన కాలేజీల్లోనే అబ్బాయిలు మంచి ఫలితాలు సాధించారని వారు తేల్చారు. కోఎడ్ కాకపోతే చాలా విషయాల గురించి అబ్బాయిలకు ఆలోచనలు రావని వారు అన్నారు. పూర్తిగా సాధ్యం కాని అంశం మీద మన ఆలోచన పోదు. కాబట్టి అబ్బాయిలు పక్క చూపులు చూడటానికి అవకాశం ఇవ్వవని వారు చెప్పుకొచ్చారు. ఇండియాలో బాలుర కోసమే ప్రత్యేకంగా గురుకులాలు ఉండేవని యుక్తవయసులో ఉన్న వారికి వేరే ఆలోచనలు రానీయకుండా విద్యాబోధన జరిగేదని యూరప్ అధ్యయనకర్తలు విశ్లేషించారు.
కలివిడిగా చదవడం మంచిదే!
ఏదైనా దొరకనంత వరకూ దాహం ఎక్కువగా ఉంటుంది. కో ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు తాము ఏదో కోల్పోతున్నామనే భావనలో పడిపోతున్నారు. ఇక కో ఎడ్యుకేషన్‌లో చదివి క్లాస్‌మేట్‌లతో ప్రేమలో పడే వారూ లేకపోలేదు. అయితే అలాంటి వారి సంఖ్య నూటికి రెండు మూడు శాతం మాత్రమే. కాబట్టి పిల్లలను కో ఎడ్యుకేషన్‌కు దూరం పెట్టి, పరిమితులు విధించడం అంతమంచిది కాదు. నేటి యువతలో కూడా కో ఎడ్యుకేషనే కావాలనే కోరిక ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో అనేక విద్యాసంస్థల యాజమాన్యాలు తప్పనిసరిగా కో ఎడ్యుకేషన్‌ను ఏర్పాటుచేయవలసి వస్తోందని నాతో చెప్పుకున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఒకే క్లాస్‌రూమ్‌లో ఉండటం వల్ల కొన్ని మంచి పనులు కూడా ఉంటాయి. నీ క్లాస్‌లో అమ్మాయిల ముందు అల్లరి పాలు కాకూడదు.. అనే భావనతో చాలా మంది అబ్బాయి డీసెంట్‌గా నడుచుకోవడానికి, తన మీద అందరికీ మంచి ఇంప్రెషన్ కలగాలని బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది.
- యండమూరి వీరేంద్రనాథ్, ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస బోధకుడు