
ఆ కోట రహస్యం ఏమి?
రష్యన్ రిపబ్లిక్ దేశమైన తువాలో ఉన్న పదమూడు వందల సంవత్సరాల క్రితం నాటి పార్-బజిన్ కోట గురించి ఇప్పటికీ సందేహాలు ఉన్నాయి.
రష్యన్ రిపబ్లిక్ దేశమైన తువాలో ఉన్న పదమూడు వందల సంవత్సరాల క్రితం నాటి పార్-బజిన్ కోట గురించి ఇప్పటికీ సందేహాలు ఉన్నాయి. ఆ కోట నిర్మాణం వెనుక ఉద్దేశం ఏమిటి? అది వేసవి విడిది కోసం చేసిన నిర్మాణమా? ఖగోళశాలా? రాజకీయ మంతనాలు జరిపే వేదికా? టువ దీవిలో వెలసిన కోట గురించి ఎన్నోసార్లు ఎన్నో చర్చలు జరిగినప్పటికీ కచ్చితమైన జవాబు ఏదీ ఇప్పటి వరకు లభించలేదు.
‘ఈ నిర్మాణం దేని గురించి?’ అనే కోణంలో 1957లో కొన్ని పరిశోధనలు కూడా జరిగాయి. ‘మోస్ట్ మిస్టీరియస్ ఆర్కియలాజికల్ మాన్యుమెంట్’గా గుర్తింపు ఉన్న ఈ కట్టడం రష్యా-మంగోలియా సరిహద్దుల్లో మాస్కోకు 3,800 కిలోమీటర్ల దూరంలో ఉంది. ‘పార్-బజిన్’ అంటే తువన్ భాషలో ‘మట్టి ఇల్లు’ అని అర్థం. రెండు భూకంపాలను ఎదుర్కొన్న ఈ కట్టడం... ఇప్పటికీ పూర్వపు దర్పంతోనే కనిపిస్తుంది. ‘‘ఈ కట్టడం చైనా నిర్మాణశైలిలో నిర్మితమైంది. అది టాంగ్ వంశీకుల పాలన కాలంలో కనిపించే నిర్మాణ శైలి’’ అని ‘ది యూరోపియన్ ఆర్కియాలజిస్ట్’ పత్రికలో రాశారు ఇరినా అర్జన్‌స్టెవా అనే ఆర్కియాలజిస్ట్.
‘పార్-బజిన్’ అనేది వేసవి విడిది, ప్రయోగశాల కాదని... బౌద్ధారామమని తాజాగా చెబుతున్నారు ఇరినా. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో బౌద్ధబిక్షువులు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసేవారని ఇరినా వాదాన్ని బలపరిచే ఆర్కియాలజిస్ట్‌లు చెబుతున్నారు. ‘ఈ కట్టడం ఉద్దేశం ఏమిటి?’ అనే ప్రశ్న గురించి తరతరాలుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా... దాని నిర్మాణసొగసు విషయంలో మాత్రం అందరికీ ఏకాభిప్రాయమే ఉంది.‘‘నేను ప్రపంచంలో ఎన్నో ప్రదేశాలను చూశాను. ఇలాంటి కట్టడాన్ని మాత్రం ఎప్పుడూ చూడలేదు’’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కితాబు ఇచ్చిన ఈ కట్టడం కాలాతీతంగా... ఎప్పుడూ చర్చల్లో ఉంటూనే వస్తుంది.