దీపాలి ఘోష్
ఆమె పేరు దీపాలి ఘోష్. ప్రేమను పంచే ఆమె మనసు,
కష్టాలను ఎదుర్కొనగలిగే ఆమె ధైర్యం, ఒంటరిగా ఉన్నా
ఎటువంటి మచ్చ పడకుండా గడిపిన ఆమె నిజాయితీ...
ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచేలా చేశాయి.
ఈ కథ స్వాతంత్య్రానికి పూర్వం ప్రారంభమైంది. బంగ్లాదేశ్‌లో ఒక మారుమూల ప్రాంతం. ఆమె వయసు నాలుగు సంవత్సరాలు. తల్లి మరణించింది. తండ్రి మరో వివాహం చేసుకోలేదు. అత్యంత సంపన్నురాలైన తన సోదరికి పిల్లను అప్పచెప్పాడు. మేనత్త ఆమెను రాకుమార్తెలా పెంచింది. అయినా తన తోటివారు తల్లిదండ్రులతో సంతోషంగా ఆడుకుంటుంటే, ఆ పసి హృదయానికి తల్లిదండ్రులు గుర్తుకు వచ్చేవారు. అలాగే పెరిగి పెద్దదైంది. ఆమె చాలా తెలివైనది, అందమైనది. వంద గ్రామాలకు అధిపతి అయిన ఒక జమీందారుతో ఆమెకు 14వ ఏటే 1945లో వివాహం జరిగింది. ఏ లోటూ లేకుండా జీవితం హాయిగా సాగింది.
భర్తకు ఉద్యోగం ఇప్పించింది!
రెండో ప్రపంచం ముగుస్తున్న ఆ కాలంలో.. బెంగాల్... తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్‌గా చీలిపోయింది. సంపన్నులందరూ తక్కువ ధనంతో పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. ఆమె కూడా భర్తతో కలిసి కలకత్తా నగరం చేరుకుంది. అయితే గత వైభవం లేకపోవడంతో జీవితం దుర్భరంగా మారింది. సంపద పోయినా భర్తలో జమీందారీతనం పోలేదు. ఒక్క పైసా కూడా సంపాదించకుండా, ఆమె మీద అజమాయిషీ చేయడం ప్రారంభించాడు. ఆమె ఎంతో కష్టం మీద భర్తకు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం వేయించింది. చేరిన కొద్ది రోజులకే ఆ ఉద్యోగం మానేశాడు. అప్పటికే వారికి ఐదుగురు సంతానం. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
మామగారు షాపు పెట్టించాడు
కూతురి కష్టాల్ని కళ్లారా చూస్తున్న ఆమె తండ్రి... తాను దాచుకున్న సొమ్ములన్నీ అమ్మేసి, అల్లుడికి ఒక పెద్ద షాపు ఇచ్చాడు. అది కూడా నిలబెట్టుకోలేకపోయాడు భర్త. డబ్బు లేకుండా ఐదుగురు పిల్లల్ని ఎలా పెంచాలా అనే ఆలోచనతో ఆమెకు రాత్రుళ్లు నిద్రపట్టేది కాదు. భర్తను ఎలాగో ఒప్పించి ఉత్తరప్రదేశ్‌లో ఉద్యోగంలో చేర్పించింది. అక్కడ కూడా ఉద్యోగం మానేసి, ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ప్రారంభించాడు. ఇక ఆమె ధైర్యం చేయక తప్పలేదు. తాను ఉద్యోగం చేస్తానని తేల్చి చెప్పేసింది. అతడికి ఆ మాటలు నచ్చలేదు. విడాకులు ఇచ్చేస్తానని బెదిరించాడు. ఆమె అంగీకరించింది. ఇద్దరూ విడిపోయారు. ఐదుగురు పిల్లలతో ఆమె ఘజియాబాద్‌లో ఒక చిన్న ఇంట్లోకి మారింది.
విడాకులు ఒడ్డుకు చేర్చాయి
ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకు నిద్ర లేచేది. డబ్బు కోసం మైళ్ల కొలదీ దూరం నడిచేది. పని నుంచి ఇంటికి వచ్చాక, ఇంటి దగ్గర ట్యూషన్లు చెప్పేది. ఒక్కోసారి పిల్లలంతా భోజనం చేశాక, తనకు మిగిలేది కాదు. నిద్రకు కూడా దూరమైపోయింది. ఒక రాకుమార్తెలా పెరిగి, ఒక రాజకుమారుడిని పెండ్లాడి, అవసరాలు తీరడం కోసం రెండు ఉద్యోగాలు చేయడమంటే విధి పగ పట్టడమే కదా!రోజూ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూ ఉండేది. పనులన్నీ ఒంటరిగా చక్కబెట్టుకోవడం కష్టమని అర్థం చేసుకుంది. ఇంటి పనులు, చదువుకోవడం అన్నీ వారికి వారే చేసుకునేలా పిల్లలకు నేర్పింది.
ఆమెలేదు.. ఆదర్శం ఉంది
పిల్లల్ని పెంచడం కోసమే తన జీవితాన్ని అంకితం చేసింది. వచ్చిన ఆదాయంతో జాగ్రత్తగా జీవించడం అలవాటు చేసుకుంది. పిల్లల్ని వృద్ధిలోకి తీసుకువచ్చింది. నేడు పిల్లలంతా పెద్దవారయ్యారు, అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అందరూ మంచి హోదాలో ఉన్నారు. అయితే అవన్నీ చూడటానికి ఇప్పుడు ఆమె లేదు. నిద్రాహారాలు లేకుండా పనిచేయడంతో ఆమె ఆరోగ్యం క్షీణించి, కన్ను మూసింది. (మనవరాలు సైనీ బెనర్జీ పాల్ ఈ విషయాలన్నీ ఇటీవలే వెల్లడించారు)
Comments
Please login to add a commentAdd a comment