ఆసనం... సంపూర్ణారోగ్యం!
యోగా
హలం అంటే నాగలి. ఈ ఆసనం వేసినప్పుడు శరీరం నాగలి ఆకృతిలో కనిపిస్తుంది. కాబట్టి దీనికి హలాసనం అని పేరు. దీనిని ఎలా చేయాలంటే...
►ముందుగా విశ్రాంతిగా వెల్లకిలా పడుకోవాలి. తర్వాత చేతులను నేలకు ఆన్చి శ్వాసతీసుకుంటూ కాళ్లను ఫొటోలో ఉన్నట్లు 90 డిగ్రీల కోణంలో లేపాలి.
►రెండు చేతులను నడుము మీద ఉంచి శ్వాసతీసుకుంటూ శరీరాన్ని పైకి లేపాలి. ఈ స్థితిలో శరీరం భారం భుజాల మీద ఉంటుంది.
►ఇప్పుడు శ్వాస వదులుతూ కాళ్లను నిదానంగా తల వెనక్కు తీసుకెళ్లి నేలకు ఆనించాలి. ఈ స్థితిలో మోకాళ్లను వంచకూడదు, గడ్డం కంఠానికి తగలాలి, కాలివేళ్లు నేలకు తాకాలి. తర్వాత చేతులను ముందుకు చాపి నేలపై ఉంచాలి. ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉండాలి.
► ఆసనం స్థితి నుంచి వెనక్కు వచ్చేటప్పుడు... అర చేతుల మీద భారాన్ని మోపుతూ వెన్నెముకను మెల్లగా భూమికి ఆనిస్తూ జాగ్రత్తగా నేల మీదకు రావాలి. నడుము పూర్తిగా నేల మీద ఆనిన తర్వాత కాళ్లను నెమ్మదిగా యథాస్థితికి తెచ్చి మడమలను మెల్లగా నేలకు ఆనించాలి. ఈ స్థితిలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, ఇదే ఆసనాన్ని తిరిగి చేయాలి. ఇలా మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.
హలాసనం వేయడం వల్ల...
►కంఠం మీద ఒత్తిడి కారణంగా థైరాయిడ్ గ్రంథి ఉత్తేజితమవుతుంది. గొంతు సమస్యలు తగ్గుతాయి.
►వెన్ను కండరాలు శక్తిమంతం అవుతాయి, జీర్ణక్రియ మెరుగవుతుంది.
►మలబద్దకం వదులుతుంది, అలసట పోయి శరీరం చురుగ్గా ఉంటుంది. మెదడు కణాలు చైతన్యవంతం అవుతాయి.
►పాంక్రియాస్ ఉత్తేజితమై డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
►జుట్టురాలడం – నెరవడం, తలనొప్పి తగ్గుతాయి.
►పైల్స్, గర్భాశయ సమస్యలు, ఊపిరితిత్తులు, కళ్లు– చెవుల సమస్యలు నివారణ అవుతాయి.
►రక్త ప్రసరణ క్రమబద్ధమవుతుంది.
►ముఖం కాంతివంతం అవుతుంది, ఊబకాయం తగ్గి, భుజాలు బలిష్ఠమవుతాయి.
హలాసనాన్ని ఎవరు చేయకూడదు?
స్పాండిలైటిస్, నడుమునొప్పి, వెన్నునొప్పితో బాధపడుతున్న వాళ్లు చేయకూడదు. అలాగే గర్భిణీస్త్రీలు, పీరియడ్స్ సమయంలో ఉన్నవాళ్లు చేయకూడదు.
త్రాటకం
త్రాటక సాధనలో స్థిరంగా కూర్చుని ఒకే బిందువు పై దృష్టిని కేంద్రీకరించాలి. ఇది మనసును స్థిరంగా ఉంచి, స్థూలం నుంచి సూక్షా్మనికి తీసుకెళుతుంది. త్రాటక క్రియలలో నాసికాగ్ర త్రాటక క్రియను చూద్దాం.
►వెన్నెముకను నిటారుగా ఉంచి పద్మాసనం, వజ్రాసనం లేదా మరేదైనా స్థిరమైన స్థితిలోనైనా కూర్చోవాలి.
► ఫొటోలో ఉన్నట్లు ఒడిలో ఎడమచేతి మీద కుడి అరచేతిని ఉంచాలి.
►రెండుసార్లు దీర్ఘంగా శ్వాస తీసుకుని దృష్టిని నాసికాగ్రం మీద కేంద్రీకరించాలి.
►ఎదురుగా ఉన్న బిందువును కళ్లు ఆర్పకుండా చూడ గలిగినంత సేపు చూసిన తర్వాత నిదానంగా కళ్లు మూసుకోవాలి.
►కొద్దిసేపటికి కళ్లు తెరిచి మరికొంత సమయం నాసికాగ్రం మీద దృష్టిని ఉంచాలి. ఇలా అరనిమిషంతో మొదలు పెట్టి రోజుకు 10– 15 నిమిషాల సేపు ఉండగలిగేటట్లు సాధన చేయాలి.
►చివరగా కొంత సమయంలో ధ్యానంలో నిమగ్నం కావాలి. ఈ సమయంలో మనకు ఇష్టమైన వ్యక్తుల మీద మనసును లగ్నం చేయడం అన్నమాట. ఇలా లగ్నం చేయడానికి గురువులు లేదా మరో ఉన్నతమైన వారిని ఎంచుకోవచ్చు. అయితే రాగద్వేషాలకు అతీతమైన వారు అయి ఉండాలి. ఎందుకంటే సాధన చేసే కొద్దీ మనసు లగ్నం చేసిన వారి లక్షణాలు మనకు సంక్రమిస్తాయి. కంటి సమస్యలు ఉన్న వాళ్లు ఒకేసారి ఎక్కువ సేపు చేయకూడదు. సాధన కొద్దీ సమయం పెంచుకోవాలి.
ఏకాగ్రత ప్రాణాయామం
నిటారుగా నిలబడి కళ్లు మూసుకోవాలి. చేతులను నమస్కారం చేస్తున్నట్లు దగ్గరకు చేర్చి బొటనవేళ్లను పువ్వు రెక్కలా విచ్చి ఉంచి, చేతులను మడిచి ఛాతీని తాకుతున్నట్లు ఉంచాలి. ఉచ్వాసనిశ్వాసలు నెమ్మదిగా, సహజంగా ఉండాలి. మనసును శిరస్సు మధ్య భాగంలో కేంద్రీకరించాలి. ఈ స్థితిలో ఒకటి – రెండు నిమిషాలు ఉండాలి.
ప్రయోజనాలు
ఈ అభ్యాసం మనోవాహక నాడికి బలాన్నిస్తుంది. ఏకాగ్రతను పెంపొందిస్తుంది. మనోబలం పెరిగి ఇతర ఇంద్రియాలను వశం చేసుకోవడానికి శక్తి కలుగుతుంది. ఉద్రేకం తగ్గుతుంది.