మీడియాపై కాంగ్రెసోళ్ల చిందులు
మీడియాలో కనిపించాలని నానా తంటాలు పడుతుంటారు రాజకీయ నాయకులు. రకరకాల వేషాలు వేసి, నాటకాలు ఆడైనా కూడా కాసేపు మీడియాలో ఏదో ఒక రకంగా ప్రచారంలో ఉంటే చాలనుకుంటారు. కానీ అదే మీడియాపై ఈ మధ్యకాలంలో మాత్రం పలువురు కాంగ్రెస్ నాయకులు మీడియా కనపడితే చాలు.. గయ్యిమని ఒంటికాలిమీద లేస్తున్నారు. పదే పదే మీడియామీద మండి పడటమే పనిగా పెట్టుకుంటున్నారు. నిన్నకాక మొన్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విలేకరుల సమావేశం పెట్టి మరీ అందరినీ పిలిచి, సాక్షి మీడియా ప్రతినిధిపై విరుచుకుపడ్డారు.
ఇప్పుడు ఆయన నుంచి స్ఫూర్తి పొందారో ఏంటో గానీ.. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా మీడియా మీద మండిపడ్డారు. నోటికి వచ్చినట్లల్లా మాట్లాడారు. అంతేకాదు వేలు చూపించి మరీ బెదిరించారు. ''అసలు వీళ్లతో మాట్లాడటం దండగ'' అని వ్యాఖ్యానించారు. అదేంటి అలా అంటున్నారు, మీరు ఇలా మాట్లాడటం సరికాదని కొంతమంది మీడియా ప్రతినిధులు అన్నా కూడా వేలు పెట్టి బెదిరించినట్లు చూపించి మరీ వ్యాఖ్యానాలు చేశారు. ''మేం మా ముఖ్యమంత్రితో ఏమైనా మాట్లాడతాం. నా నోరు.. నా ఇష్టం. మీకు ఇష్టం వచ్చినది రాసుకోండి'' అంటూ విసురుగా ప్రవర్తించారు.
ఈనెల ఏడో తేదీన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన జరిగితే హైదరాబాద్‌లో అల్లకల్లోలం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ‘అల్లకల్లోలం ఎవరు చేస్తారు?’ అని ఇద్దరు విలేకరులు ప్రశ్నించారు. దీనికి సరైన సమాధానమివ్వని లగడపాటి.. సమావేశం తర్వాత వారితో వాగ్వాదానికి దిగారు. అవివేకంగా మాట్లాడొద్దంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ప్రశ్నలు అడిగితే అవివేకం అంటారేమిటి?’ అని విలేకరులు ప్రశ్నించారు. దీంతో లగడపాటి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘‘నోర్ముయ్... నీ పేరేంటి? నీ ఏరియా ఏంటి?’’ అంటూ ఊగి పోయారు. ‘‘అవసరమైతే చేతులు లేస్తాయి’’ అంటూ చిందులుతొక్కారు. తన వాహనం ఎక్కుతూ.. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. ‘‘నా సంగతేంటో చూపిస్తా... మీ అంతు చూస్తా!’’ అని నిష్ర్కమించారు.
తమకు అవసరమైనప్పుడు, తాము కావాలనుకున్నప్పుడల్లా విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేసి అందరినీ పిలిచి మరీ గంటలకొద్దీ ఉపన్యాసాలు ఇచ్చే బొత్స, లగడపాటి లాంటి నాయకులు తమకు ఏమాత్రం కాస్త వ్యతిరేకంగా అనిపించినా ఇలా చిందులు తొక్కుతూ రచ్చరచ్చ చేస్తున్నారు.