హ్యాపీనెస్‌కి పెట్‌బడి | Dog Training Classes | Sakshi
Sakshi News home page

హ్యాపీనెస్‌కి పెట్‌బడి

Published Mon, Nov 17 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM

హ్యాపీనెస్‌కి పెట్‌బడి

హ్యాపీనెస్‌కి పెట్‌బడి

‘మా క్యూటీ తప్పిపోయిం’దంటూ పోలీస్‌స్టేషన్‌లో కంప్లయింట్ ఇస్తే.. ఆ క్యూటీ ఒక పెట్‌డాగ్ అని వెంటనే అర్థం చేసుకుని, ఆఘమేఘాలపై  సదరు క్యూటీ గారిని పట్టి తెచ్చివ్వకపోతే ఠాణా పీకి పందిరి వేసినంత పనిచేసే వాళ్లు నగరంలో ఎందరో. ముచ్చటపడి పెంచుకుంటున్న శునకరాజం పరమపదిస్తే.. రోజుల తరబడి శోక సముద్రంలో మునిగిపోయేవాళ్లు, అంత్యక్రియలు సైతం నిర్వహించి, జ్ఞాపకార్థం సమాధులు నిర్మించే వారూ సిటీలో ఉన్నారు. అంతగా పెట్స్‌ని జీవన నేస్తాలుగా భావిస్తున్నవారు వాటి సంరక్షణ కోసం ఎంత వ్యయప్రయాసలైనా సిద్ధమంటున్నారు. నగరంలో నిర్వహిస్తున్న డాగ్‌షోస్...ఓనర్-పెట్ మధ్య బాండింగ్, వాటి ట్రైనింగ్ ప్రొసీజర్ ఇవన్నీ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపకరిస్తున్నాయి .
 
‘కొన్నేళ్లుగా యజమానులు తమ ‘నేస్తా’లకు బెస్ట్ లైఫ్ అండ్ బెస్ట్ ఫుడ్‌ని అందించాలని కోరుకుంటున్నారు. ఆహారం, వసతి కోసం మనపైనే ఆధారపడే శునకాలకు సరైన ఫుడ్‌ని అందించడం, వాటిని ఆప్యాయంగా చూసుకోవడం మన బాధ్యతే’ అని మార్స్ ఇండియా
 (పెడిగ్రీ) డెరైక్టర్ శ్రీనితిన్ సూచిస్తున్నారు. ప్లై బాల్ కాంటెస్ట్, ఎడ్యుకేషన్ ఆన్ పెట్ కేర్, డాగ్స్‌ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నేర్పించే టిప్స్.. ఇవన్నీ డాగ్ షోలలో భాగమే. ఈ తరహా షోలకు విభిన్న రకాల జాతి శునకాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ కెనన్ క్లబ్ ఆదివారం మాదాపూర్ హైటెక్స్‌లో నిర్వహించిన డాగ్‌షోలో దేశం నలుమూలల నుంచి ఏకంగా 40 రకాల బీడ్స్ 300 వరకు పాల్గొన్నాయి. ఇక్కడ పెట్స్‌తో కలసి కుటుంబ సపరివారంగా బయట గడిపే అవకాశాన్ని ఈ డాగ్ షో ద్వారా కల్పించారు. ఈ సందర్భంగా డాగ్ ఓనర్స్‌తో ‘సిటీప్లస్’ ముచ్చటించినప్పుడు పెట్స్‌తో తమ అనుబంధాన్ని ఇలా పంచుకున్నారు.
 
 ..:: చల్లపల్లి శిరీష
 
 అదుంటే పం‘డాగే’...

మా ఆయనకు పెట్స్ అంటే ప్రాణం. మా దగ్గర ‘జర్మన్ షెపర్డ్’ ఉంది. దాని పేరు ‘స్కై’. వాడు (స్కై) టవల్‌తో, ఫుట్‌బాల్‌తో భలే ఆడతాడు. స్కైకి ఇప్పుడు రెండున్నరేళ్లు. మేం ఏం తెచ్చుకున్నా వాడికీ తెస్తాం. పండక్కి మా బట్టల సంగతెలా ఉన్నా వాడికి మాత్రం కచ్చితంగా కొంటాం.
 - శ్రావణి , మలక్‌పేట
 
 ప్రైజ్‌లు తెచ్చే పెట్..

 నా హనీ బ్రీడ్ పేరు ‘లాస ఆప్సో’. వాడికి మూడేళ్లు. రోజూ మమ్మల్ని నిద్ర లేపుతాడు. ఎవరైనా నన్ను ఎంత మంది పిల్లలంటే ముగ్గురని చెప్తాను. నాకు ఇద్దరు పిల్లలు. మూడోవాడు హనీగాడు. నా పిల్లలూ వాడిని ‘తమ్ముడూ’ అనే పిలుస్తారు. ఏది వండుకున్నా తొలి ముద్ద వాడికే. పెట్ షోస్‌లో 12 బెస్ట్ ప్రైజ్‌లు గెలుచుకున్నాడు. హీ ఈజ్ వెరీ క్రేజ్ అబౌట్ ఫొటోస్ అండ్ కెమెరా షూట్స్.                      
 - సునంద
 
మిస్డ్ యూ మై డియర్...


ప్రాజెక్ట్ పనిపై సిటీకి వచ్చా. నా ఫ్రెండ్ డాగ్ షో గురించి చెబితే ఇక్కడికొచ్చా. ఇన్ని రకాల బ్రీడ్స్‌ని ఒకే రూఫ్ కింద చూడటం తొలిసారి. మా హోం ప్లేస్‌కి వెళ్లాక ఇక్కడి ఫొటోలు, వీడియోలు నా ఫ్రెండ్స్‌కి చూపిస్తా. మా ఇంట్లోనూ  పెట్ ఉంది. నౌ అయాం మిస్సింగ్ మై డాగీ!.
 - సబీనా, కాలిఫోర్నియా (యూ.ఎస్)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement