
మోహన్
గుంటర్ గ్రాస్ హైదరాబాద్ వచ్చాడంట గురూ. సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీలో మీటింగ్.
నివాళి
చివర్లో అందరం గుంటర్ గ్రాస్‌కి సెలైంట్ షేక్‌హేండ్‌లిచ్చి బయటపడ్డాం. చాలాకాలం ఆ ఇమేజెస్ తగులుకుని వెంటాడాయి. ఇదంతా అయిన పన్నెండూ పదమూడేళ్లకి ఆ నవలకి నోబెల్ ప్రైజ్ వచ్చింది.
గుంటర్ గ్రాస్ హైదరాబాద్ వచ్చాడంట గురూ. సా యంత్రం ఉస్మానియా యూ నివర్సిటీలో మీటింగ్. రోజు వారీ బొమ్మల పని హడా వుడిగా ముగించాం. ‘టిన్ డ్రమ్’ నవల చదివిన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్, అందరికీ ఆదుర్దా, ఆనందం. ఏదో ఎక్స్‌పెక్టేషన్. కలర్ పేస్టల్స్‌తో ఆయన కేరికేచర్ లాగడమైంది. అది చంకలో పెట్టుకుని అందరం చంకలు గుద్దుకుంటూ ఉస్మానియాకెళ్లాం. (అది 1986-87 కచ్చి తంగా గుర్తులేదు)
పెద్ద క్లాస్ రూమ్, ముందే ఆయన అక్కడున్నాడు. వచ్చిన వాళ్లని పలకరిస్తున్నాడు. ఆరడుగుల పైనే ఉన్నాడు. అడ్డంగా నాలుగడుగులున్నట్టున్నాడు. భారీ విగ్రహం. పక్కనే వాళ్లావిడ కూడా ఉంది. అంతే పర్సనాలిటీ, ఇద్దరూ నిటారుగా నించుంటే వెనకనున్న 16 ఎంఎం స్క్రీన్ మాకు కనిపించడానికి తంటాలు పడుతోంది.
పక్కన రచయిత శివాజీ, మరో జర్నలిస్టూ నేనూ ముందుకెళ్లి కలర్ కేరికేచర్ చూపించాం. కింద సంతకం చేశాడు. కేరికేచరిస్టువా? అని అడిగాడు. ‘పొలిటికల్ కార్టూనిస్టుని. అప్పుడప్పుడు కేరికేచర్లు కూడా వేస్తా నన్నా’ వుయ్ ఆల్సో మేక్ స్టీల్ అన్నట్టు. అందరూ నా వాల్రస్ మీసాలే సాగదీసి వేస్తారని నవ్వాడు. మాకూ మరోదారి కనిపించలేదన్నాం. ఇదే నేనైతే ఇంకోలా వేస్తానన్నాడు ‘ఎవరేనా అంతేలేవో’ అని లోపలే అనుకుని బైటికి చిరునవ్వాం. కానీ ఆయన గొప్ప గ్రాఫిక్ ఆర్టిస్టనీ, శిల్పాలు కూడా చేస్తాడనీ తెలీని మూర్ఖులము. టిన్ డ్రమ్ తప్పితే ఆయన రచనల్ని పెద్దగా చదివి చచ్చిందీ లేదు.
సభ మొదలయింది. గుంటర్ గ్రాస్ గొంతు సవరించి, కళ్లజోడు సర్దుకుని, మీసాలు దువ్వి మొదలు పెట్టాడు. ఎదురుగా ఉన్న ముందు సీట్లో వాళ్లవిడ కూచుంది. ఆవిడ వెనకున్న మాకు ఆయన కనిపించడం లేదు. పక్క సీట్లలోకి జరిగి సర్దుకున్నాం.
టిన్ డ్రమ్ రాయడానికి తనను ఇన్‌స్పైర్ చేసిన విషాదాన్నీ, రానున్న వినాశాన్ని గురించీ చెప్పాడు. జర్మనీలో నాజీలు పుట్టి పెరగడం, హిట్లర్ అధికారంలోకి దూసుకొచ్చే కాలం గురించి వింటుంటే గుండెలవిశాయి. ఆ కాలంలోని హింసాత్మకమైన వాతావరణం, అది రాజకీయాలని దాటి కుటుంబ జీవితంలోకీ, పడక గదుల్లోకీ ఎంతగా చొచ్చుకొచ్చిందో గుంటర్ గ్రాస్ నోటి ద్వారా వింటూంటే గాభరా పుట్టింది. నాజీ జర్మనీ, రెండో ప్రపంచ యుద్ధం, కాన్సెంట్రేషన్ కేంపులూ, హోలూకాస్ట్ అన్నీ చదువుకున్నవే, తెలిసినవే. కానీ నాటి జర్మన్ కుటుంబ జీవనం అలా కెలకబారిందెలా అనేది పెద్దగా తెలీని సంగతి. దురాక్రమణదారు, పరా యి దేశాన్నే కాదు తన దేశ ప్రజల్ని కూడా ఎంత రొష్టు పెడతాడో అర్థమయింది. ఆ కాలంలో జర్మన్ ప్రజలు ఎంతో సుఖంగా ఉన్నారన్న భ్రమ బద్దలయింది.
‘టిన్ డ్రమ్’ ప్రపంచం దృష్టిలో పడ్డాక హాలీవుడ్ నుండి నాలుగైదు పెద్ద స్టూడియోలు నన్ను అడిగాయి. నవలని సినిమాగా తీస్తామంటారు. మరి మీరు స్క్రిప్ట్ ని మార్చకూడదన్నాను. నవల స్పిరిట్ మార్చ కూడద న్నాను. సినిమా హిట్ కావడం కోసం పెద్ద పెద్ద సూపర్ స్టార్లని కోట్లు పోసి కొనితెచ్చి వాళ్ల మీదే కెమెరా కళ్లు పెడతారు గదా అన్నాను. అవునన్నారు. అయితే కాద న్నాను. మొత్తం మీద వాళ్లతో కుదరలేదు. తర్వాత వచ్చిన ఒక ప్రొడ్యూసర్, డెరైక్టర్ టీమ్ నవల మీద ప్రేమతో, స్పిరిట్ చెక్కు చెదరకుండా తీస్తామని హామీ ఇచ్చారు. షూటింగ్‌లో నా సలహాలూ తీసుకున్నారు. ఇది నాకు తృప్తినిచ్చిన ఫిల్మింగ్ అని ముగించి ఆయన కూడా వచ్చి వాళ్లావిడ పక్క సీట్లో కూచున్నాడు. మేం మరి కాస్త పక్కకి జరిగాం.
అంతలోనే మళ్లీ లేచి ‘సినిమాలో కొన్ని సీన్లు మీకు బూతుగా, అతి సెక్సులా అనిపించొచ్చు. కానీ అది హాలీవుడ్ కోణం నుంచి మిమ్మల్ని ఎక్సైట్ చేయడానికి కానేకాదు. అది ఆనాటి జర్మన్ సమాజంలోని వాస్తవం. అలాగే చూడండి. అపార్థం చేసుకోవద్దు’ అని చిన్న వార్నింగ్ ఇచ్చాడు.
అనుకున్నట్టుగానే మొదటి సీన్‌లోనే అల్లంత దూరాన బీడువారిన భూమి మీద పారిపోతున్న యుద్ధ ఖైదీ, అతని వెంటాడే సైనికులూ, తుపాకులూ, బీభ త్సంగా కనిపిస్తాయి. తర్వాత ఆలుగడ్డలు కాల్చే ఒక మ్మాయి లంగా కింద యుద్ధ ఖైదీ దాక్కోవడం, సైని కులు వేరే దిక్కుకి పోవడం, ఆ తర్వాత ఖైదీ జిప్ పెట్టు కుంటూ ఆవిడని క్షమించమని నవ్వుతోనే కోరడం ఘోరమైన ప్రారంభం.
తర్వాత జబ్బు చేసిన చిన్న పిల్లాడు కీచుమని అరిస్తే కిటికీ అద్దాలు బద్దలయిపోవడం, టీచర్ కళ్ల ద్దాలు ముక్కలై పోవడం, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే మళ్లీ అక్కడ కీచుమని అరిస్తే అద్దాల సీసాలు బద్దలై అందు లోని పసిపిల్లల పిండాలన్నీ స్లోమోషన్‌లో కారిపోవడం అంతా కడుపులో తిప్పుతుంది. ఇలా సినిమా ముగిసే సరికి అందరూ మౌనంగా అయిపోయారు. చివర్లో అందరం గుంటర్ గ్రాస్‌కి సెలైంట్ షేక్‌హేండ్‌లిచ్చి బయటపడ్డాం. చాలా కాలం ఆ ఇమేజెస్ తగులుకుని వెంటాడాయి. ఇదంతా అయిన పన్నెండూ పదమూ డేళ్లకి ఆ నవలకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈ లోగా జర్మన్ కల్చరల్ సెంటర్‌లో ఆయన పుస్తకాలు తెచ్చు కుని చదివాం. ఆయన గీసిన బొమ్మల ఆల్బమ్‌లు చూశాం. గ్రాస్‌కి కేరికేచర్ గీసి చూపించడం పిల్లచేష్టలని తెలిసి చాలా సిగ్గయింది.
ఒక రోజు రచయిత పతంజలి వచ్చి ‘మైసెంచరీ’ పుస్తకం ఇచ్చి ఇదీ రాయడమంటే అన్నారు. చదివాక మాకూ అట్లాగే అనిపించింది. తర్వాత గ్రాస్ మీద వచ్చిన వివాదాలు చూసి ప్రాణం చివుక్కుమనింది. అయితేనేం, హిట్లరూ, డిక్టేటర్లూ, సవాలక్ష మంది పాల కులూ చస్తారు. గ్రాస్ రచన మిగిలిపోతుంది అది నిలిచిపోతుంది. మనకి దారి చూపుతుంది.
(వ్యాసకర్త ప్రముఖ కార్టూనిస్టు, మొబైల్ : 7702841384)