
ఉదయ్ కిరణ్
సినిమా హీరో ఉదయ్ కిరణ్ మరణం పెద్దలను, యువతని అందరిని అందోళనలోకి నెట్టింది. ఆలోచనలను రేపింది. అనేకమంది కలత చెందారు. హీరోగా అందరికీ ఆదర్శప్రాయుడు కావాల్సిన ఉదయ్ ఇలా అర్ధాంతరంగా చనిపోవడం దురదృష్ట కరమని యువ ఉద్యోగులు వాపోతున్నారు. కష్టాలనెదుర్కొని సినిమాలో నిలదొక్కుకున్న ఉదయ్ నిజ జీవితంలో పోరాడి ఓడిపోయాడని భావిస్తున్నారు. ఇలా ఎవ్వరు చేయకూడదని అందరూ అంటున్నారు. అనేక సినిమాలలో మనల్ని అలరించిన అందగాడు-లవర్‌బాయ్ చావు మిస్టరీగా మారింది. ఉదయ్ ఆత్మహత్య వెనుక సవాలక్ష ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనేక ప్రశ్నలకు సమాధానాలే లేవు. అంతుపట్టని ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయి.
ఉదయ్ కిరణ్ వద్ద ఆఫీస్ బాయ్‌గా పనిచేసిన మున్నా తర్వాత మేనేజర్ స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత నిర్మాతగా మారి సొంతంగా సినిమాలు తీస్తున్నాడు. మున్నా నిర్మాతగా "దిల్ కపాడి'' సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో
ఉదయ్ హీరో. రెండు పాటలు మినహా ఈ సినిమా మొత్తం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఒక హీరోయిన్ పెట్టుబడి పెట్టారని చెబుతున్నారు. ఈ చిత్ర నిర్మాణం మధ్యలో అర్ధంతరంగా ఆగిపోయింది.
ఆత్మహత్య వెనుక అంతు చిక్కని ప్రశ్నలు:
వృత్తి పరంగా సినిమా అవకాశాలు లేకపోవడమా?
కుటుంబ సమస్యలా?
ఆర్థిక లావాదేవీలా?
వీటన్నిటి వల్ల మానసిక వత్తిడులకు లోనవడమా?
ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఉన్న మాట నిజమేనా?
గడచిన మూడు వారాల్లో ఏం జరిగింది?
ఉదయ్ శరీరంపై గాట్లు ఎందుకున్నాయి?
ఇంతకుముందు ఆత్మహత్యాయత్నం చేశాడా?
ఒకవేళ అదే నిజమైతే ఎందుకు చేశాడు?
అతని మానసిక పరిస్థితి బాగోలేదా?
అదే నిజమైతే కుటుంబ సభ్యులు ఎందుకు జాగ్రత్తపడలేదు?
ఆదివారం సాయంత్రం ఏం జరిగింది?
భార్యభర్తల మధ్య విభేదాలు ఉన్నాయా?
అవి అంత తీవ్రమైనవా?
ఆమె మణికొండ వెళ్లిందా? ఇంకెక్కడికైనా వెళ్లిందా?
పార్టీకి వెళ్లిన మాట నిజమేనా? అది ఎవరి పార్టీ?
విషిత బయటకు వెళ్లినప్పుడు ఆమె తల్లిదండ్రులు ఇంట్లోనే ఉన్నారా?
వాళ్లు వెళ్లిపోయిన తర్వాతే ఉదయ్ చనిపోయాడా?
ఆత్మహత్యకు ముందు ఉదయ్ ఎవరికి ఫోన్ చేశాడు?
ఆ రోజు రాత్రి భోజనం చేయకపోడానికి కారణాలేంటి?
ఆదివారం ఉదయం నుంచే భార్యాభర్తల మధ్య గొడవ మొదలైందా?
అంతకు ముందే గొడవలు ఉన్నాయా?
విషిత ఉద్యోగం చేసే విషయంలో ఉదయ్ అసంతృప్తికి లోనయ్యాడా?
ఉదయ్ కిరణ్ చెన్నై వెళ్లిపోవాలని ఎందుకు అనుకున్నాడు?
చెన్నై స్నేహితుడు ఎవరు? ఇప్పుడెక్కడున్నాడు?
ఉదయ్ మేనేజర్ మున్నా సినిమా ఎందుకు ఆగిపోయింది?
ఉదయ్ సినిమా కోసం పెట్టుబడి పెట్టిన హీరోయిన్ ఎవరు?
డబ్బుల కోసం ఆ హీరోయిన్ ఉదయ్ పీకల మీద కూర్చుందా?
ఉయద్కు స్థిరాస్తులు ఉన్నాయా? ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఎలా వచ్చాయి?
అప్పులు తీర్చగలిగీ తొందరపడి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు?
కుటుంబ సభ్యుల మాటలలో ఎందుకు స్పష్టతలేదు?
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరకవలసి ఉంది. ఉదయ్‌కిరణ్ ఆత్మహత్య వెనుక కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మర చేశారు. ఆర్థిక పరమైన లావాదేవీలపై కూపీలాగుతున్నారు. ఇవే కాకుండా కొత్తకోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఉదయ్ కిరణ్ ది ఆత్మహత్యేనని వైద్యులు నిర్ధారించారు. ఇక ఆత్మహత్యకు కారణాలు తెలియవలసి ఉంది. కారణాలలో ప్రధానమైనది మానసిక వత్తిడేనని స్సష్టమవుతోంది. సమస్యలు ఒక్కసారిగా దాడి చేసినప్పుడు, శక్తికి మించి తట్టుకోలేని వత్తిడి ఏర్పడినప్పుడు ఒక వ్యక్తి మానసిక పరిస్థితిలో మార్పు వస్తుంది. అతని మాటలు, ఆలోచనలు, ప్రవర్తన ద్వారా ఇంట్లోని వారు, మిత్రులు పసిగట్టవచ్చు. అప్పుడు తప్పనిసరిగా మానసిక వైద్యుడిని కలవాలి. మన దేశంలో చాలా మంది మానసిక వైద్యుడిని సంప్రదించడానికి వెనకాడతారు. ఒక వ్యక్తిలో మానసిక రుగ్మతలు వెలుగు చూసినప్పుడు కుటుంబ సభ్యులు జాగ్రత్తపడాలన్ని విషయాన్ని ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గుర్తు చేస్తోంది.