ఉదయ్‌కిరణ్‌ను ఒక్కసారే కలిశా: సంగీత
* ఆయన మరణానికి నేను కారణం కాదు
* నేను డబ్బులిచ్చింది మున్నాకే..
* తెలిసిన వారి దగ్గర రూ.17 లక్షలు వడ్డీకి తెచ్చి ఇచ్చా..
* మున్నా ఆచూకీ కోసం ఉదయ్‌కిరణ్ ఇంటికి వెళ్లా..
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు ఉదయ్‌కిరణ్ ఆత్మహత్యకు తన వేధింపులే కారణమని వెలువడుతున్న వార్తల్లో వాస్తవం లేదని ఫైనాన్షియర్ సంగీత చెప్పారు. ఉదయ్‌కిరణ్‌ను తాను ఒక్కసారే కలిసానని, ఎప్పుడూ డబ్బుల విషయం మాట్లాడలేదని అన్నారు. ఆయన మరణానికి తానెంత మాత్రమూ కారణం కాదని చెప్పారు. ‘వారు పెద్ద వ్యక్తులు. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నారుు..’ అని అన్నారు. తాను మున్నాకే డబ్బులు ఇచ్చానని, ఆయనకు సంబంధించిన చెక్కులు, ప్రామిసరీ నోటే తీసుకున్నానని తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సంగీత ఆదివారం సాక్షితో మాట్లాడారు. వాస్తవానికి తాను ఫైనాన్షియర్‌ను కాదన్నారు. స్వగ్రామం చిత్తూరు జిల్లా కుప్పంలో చీరల వ్యాపారం చేసే తనకు.. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఉదయ్‌కిరణ్ మేనేజర్ మున్నా పరిచయమయ్యూడని తెలిపారు.
ఐదారు నెలల స్నేహం తర్వాత తాను ఉదయ్‌కిరణ్‌తో ఓ సినిమా తీస్తున్నట్టు మున్నా చెప్పాడన్నారు. మీరు ఫైనాన్స్ చేస్తే బావుంటుందనడంతో అంత డబ్బు తన వద్ద లేదన్నానని, మీకు తెలిసిన వారెవరైనా ఉంటే వడ్డీకి ఇచ్చినా పర్వాలేదని చెప్పడంతో.. తెలిసిన ఇద్దరి దగ్గర ఐదారు రూపాయల వడ్డీ చొప్పున రూ.17 లక్షలు తెచ్చి మున్నాకు ఇచ్చినట్లు సంగీత చెప్పారు. సినిమా ప్రారంభం కావడానికి 3 నెలలు పడుతుందని, ఆ తర్వాత ఇస్తానని చెప్పాడన్నారు. సినిమాలో తమ బాబుకు పాత్ర ఇస్తానన్నాడని, కో ప్రొడ్యూసర్‌గా మీ పేరు వేస్తానని చెప్పినట్లు తెలిపారు. చీరల వ్యాపారం చేస్తున్నారు కాబట్టి సినిమాలో కాస్ట్యూమ్స్ కూడా మీవే వినియోగిస్తామని, తద్వారా మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుందనడంతో అంగీకరించానన్నారు.
డబ్బులిస్తున్నప్పుడే ఉదయ్‌కిరణ్‌తో ఫోన్‌లో మాట్లాడి సినిమా తీస్తున్న విషయూన్ని ధ్రువీకరించుకున్నట్లు తెలిపారు. అప్పుడు మున్నానే ఫోన్ కలిపి ఇచ్చాడన్నారు. అరుుతే ఆరు నెలలైనా సినిమా ప్రారంభించకపోవడం, ఫోన్లు చేస్తే మున్నా ఎత్తకపోవడం, పైగా ఆఫీస్ ఎత్తివేశారని తెలియడంతో.. అతని ఆచూకీ కోసం కొద్దిరోజుల క్రితం తొలిసారి ఉదయ్ ఇంటికి వెళ్లినట్లు సంగీత తెలిపారు. వాచ్‌మన్ చెన్నై వెళ్లారని చెప్పడంతో వెనుదిరిగి వచ్చానని, మళ్లీ గతనెల 21న వెళ్లి ఉదయ్‌ను కలిశానని వివరించారు. మున్నా డబ్బులకోసం తిరుగుతున్నాడని, మీరు ఆందోళన చెందవద్దని ఆయన చెప్పారని పేర్కొన్నారు. ఆ సమయంలోనే మున్నాకు ఫోన్ చేసినా స్విచాఫ్ రావడంతో.. అదే విషయం ఉదయ్‌కు చెప్పి, మీరైనా విషయం తెలియజేయండి అని కోరి వచ్చేశామన్నారు.