కళ్లు తెరవడమే కాంగ్రెస్ కర్తవ్యం | Open of the eyes is the duty of Congress | Sakshi
Sakshi News home page

కళ్లు తెరవడమే కాంగ్రెస్ కర్తవ్యం

Published Wed, May 6 2015 12:33 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

పెంటపాటి పుల్లారావు - Sakshi

పెంటపాటి పుల్లారావు

 మోదీ ఘోర తప్పిదాలు చేసే వరకు మిన్నకుండటమే రాహుల్ చేయవలసిన పని. దీనితోపాటు 2004-2014
 మధ్య యూపీఏ గాఢ నిద్రలో ఉండిపోయిన సంగతినీ, ఆ కాలంలోనే మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాస్తవాన్నీ గుర్తించాలి. మధ్యతరగతిని విస్మరించినందుకు, ఎగువతరగతి వారిని విలన్లుగా చూసినందుకు, తన బావ భూకుంభకోణాలకు జాతికి క్షమాపణ చెప్పాలి. ఆ తరువాతనే మోదీ మీద విమర్శకు దిగాలి. దిగ్విజయ్, మధుసూదన్ మిస్త్రీ, మోతీలాల్ ఓరా, అంబికా సోనీ, మొయిలీ వంటి దివాలాకోరు సలహాదారులను తిరస్కరించాలి. సోనియా, ప్రియాంకల మాట వినడం కూడా అనవసరం.

 
 రాహుల్ గాంధీ నలభై నాలుగేళ్ల నడివయసులో ఉన్నారు. ఆయన తండ్రి రాజీవ్ 39 ఏళ్లకే ప్రధాని పదవి చేపట్టారు. 32 ఏళ్లకు కన్నుమూసిన గ్రీస్ చక్ర వర్తి అలెగ్జాండర్ 24 ఏళ్లకే ప్రపంచ విజేతగా నిలిచాడు. మొగల్ వంశ స్థాప కుడు బాబర్ 23 ఏళ్లకే ఢిల్లీ, ఆగ్రాల మీద తన పతాకను ఎగురవేశాడు. చెం ఘిజ్‌ఖాన్ 22వ ఏటనే మంగోల్ రాజ్యాధిపతి అయ్యాడు. నెపోలియన్ బోనా పార్టి తన 28వ ఏట ఈజిప్ట్ మీద విజయం సాధించాడు. వీరంతా యౌవన ప్రాదుర్భావంలోనే శత్రువులను జయించి, స్వశక్తితో నేతలుగా అవతరిం చారు. వీరు ఎవరికో వారసులు కారు. తమను తాము శిల్పించుకున్నవాళ్లే. కానీ రాహుల్ గాంధీ తెచ్చుకున్న కీర్తిప్రతిష్టలు స్వార్జితాలు కావు. ఆయన ఒక ప్రముఖ కుటుంబం ద్వారా వచ్చిన ప్రాభవాన్ని అందుకున్నవాడే.

 కొత్త ఇమేజ్ కోసం తపన
 రాహుల్ 2004లో రాజకీయాలలో ప్రవేశించారు. తమ కుటుంబం నియమిం చిన డాక్టర్ మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉండడంతో దేశంలోనే అత్యంత పలు కుబడి కలిగిన వ్యక్తిగా అవతరించారు. యూపీఏ అధికారంలో ఉన్న ఆ పదేళ్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రపంచంలోనే ఈ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో నిరపేక్ష అధికారాన్ని చలాయించారు. అధికారంలో కొనసాగడం కోసం సామాజిక, ఆర్థిక వ్యవస్థలను ఒక ఆట ఆడించారు. ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిని, ఏటా పది శాతం ద్రవ్యోల్బణం పెరిగింది. పదకొండు కోట్ల మంది నిరుద్యోగులు మిగిలారు. కానీ ఇందుకు మన్మోహన్‌ను నిందిం చలేం. యూపీఏ  కులాలూ, మతాల కోసం చట్టాలు చేసింది. ఒక వర్గం మీద మరో వర్గాన్నీ, ఒక మతం మీద మరో మతాన్నీ రెచ్చగొట్టే విధంగా కూడా వ్యవహరించింది. 2014 ఎన్నికలలో ఓటమి తరువాత ఏకే ఆంటోనీ చేసిన వ్యాఖ్య చూడండి! తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పనిచేసిందని దేశంలో మెజారిటీ వర్గం భావించడం వల్లనే ఓటమి ఎదురైందని అన్నారు. పార్టీ కూడా సామాజికాంశాల మీదనే ఎక్కువ దృష్టి సారించామనీ, దీనితో ఆర్థిక వ్యవస్థ పట్ల అలక్ష్యం వహించామనీ అంగీకరించింది. రాహుల్ వాస్తవిక ఓటమి ఈ ఎన్నికలలోనే ఉంది.  ఆయన అధికారమంతా కునారిల్లిపోయింది. ఇప్పుడు మాత్రం రాహుల్ శక్తియుక్తులను చాటడానికి ప్రసార మాధ్యమా లను ఉపయోగించుకోవడానికి అవసరమైన వ్యూహం కోసం కాంగ్రెస్ అన్వే షిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ వార్తలూ, ఫొటోలూ రాహుల్ దేశం కోసం తపన పడుతున్నారన్న అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నాయి. రాహు ల్‌ను కొత్త రూపంలో చూపాలని యత్నిస్తున్నాయి. మొత్తంగా చూస్తే మోదీని విమర్శిస్తే చాలు, ప్రజానీకం కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుందన్న అభిప్రాయంతో ఉన్నట్టు కనిపిస్తుంది. ఐదు శాతం ఓట్లు కనుక తగ్గితే బీజేపీ ఓడిపోతుందని రాహుల్ భావన. కాబట్టి ఆ మేరకు బీజేపీ ప్రాభవాన్ని తగ్గించగలిగితే, 2019 సంవత్సరానికయినా అధికారం నుంచి తప్పించవచ్చు.

 రాహుల్ ఏం చేస్తున్నారు?
 రాహుల్ పార్లమెంట్‌లో లేచి ఏదో వ్యాఖ్యానిస్తున్నారు. పేదల గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మీద ధ్వజమెత్తుతున్నారు. ఇది ప్రజల దృష్టినీ, మీడియా దృష్టినీ ఆకర్షిస్తున్నది. ఒక కొత్త పార్లమెంటేరియన్ ఆవిర్భ వించాడని మీడియా వ్యాఖ్యానిస్తున్నది. అయితే ఇది ఎంతో కాలం పని చేయదు. ఇది శ్రుతి మించితే వికటించే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే, ప్రస్తుతం భారతదేశంలో 70 శాతం అక్షరాస్యులు. అలాగే గడచిన పదేళ్లలో కాంగ్రెస్ చేసిన నిర్వాకం మరచిపోవడానికి వారు సిద్ధంగా లేరు. ఇప్పుడు ఇన్ని సుద్దులు చెబుతున్న వీరు అధికారంలో ఉండగా ఏం చేశారు? అన్న ప్రశ్న వస్తున్నది. రాహుల్ రైతాంగం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మోదీ రైతాంగం గురించి అసలేమీ పట్టించుకోవడం లేదని రాహుల్ ఆక్రోశిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలలో, కొందరు రైతులను కలసి తన సానుభూతి కూడా తెలిపి వచ్చారు. కానీ గుర్తుంచుకోవలసినదేమిటంటే- యూపీఏ పదేళ్ల పాలనలో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పు డు రాహుల్ ఏమీ మాట్లాడలేదు. సోనియా అధ్యక్షతన పనిచేసిన జాతీయ సలహా మండలి సూపర్ ప్రభుత్వం మాదిరిగా పని చేసింది. ఇందులో మైనా రిటీలు, దళితులు, బీసీలు అంతా ఉన్నారు. కానీ ఒక్క రైతు ప్రతినిధికి కూడా స్థానం ఇవ్వలేదు. సోనియా, రాహుల్, మన్మోహన్ రైతాంగాన్ని కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బ్యాంకుగానే పరిగణించారు.  అలాగే   భూచట్టం దేవుడిచ్చిన వరం అన్న తీరులో రాహుల్ మాట్లాడుతున్నారు. రైతుతో వారి సమస్యలతో ఏమాత్రం సంబంధం లేని జైరామ్ రమేశ్ దీనిని రూపొందించారు. 2004- 2014 మధ్య భూములు కోల్పోయిన ఏ రైతూ దీనితో పొందగలిగేది ఏమీ లేదు. తెలుగు రాష్ట్రాలలో ఏ రైతును అడిగినా ఈ సంగతి తెలుస్తుంది. రాహుల్ మధ్యతరగతి గురించి కూడా ఇప్పుడే మాట్లాడుతున్నారు. యూపీఏ అధికారంలో నుంచి వైదొలగినప్పుడు దేశంలో 11 కోట్ల విద్యావంతులైన నిరుద్యోగ యువతీయువకులు ఉన్నారు. ఆ పదేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, గాంధీలు కానీ ‘మధ్యతరగతి’ అని తమ నోటితో ఉచ్చరించ లేదు కూడా. అప్పుడు వారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి పథకం గురించి ఎక్కువగా మాట్లాడారు. దానితో కొందరికి రోజుకు 80 రూపాయలు దక్కాయి. ఆ వర్గాల ఓట్లు కాంగ్రెస్‌కు శాశ్వతంగా కావాలి. ఇది పరోక్షంగా అత్యంత ధనికులకు ఉపయోగపడింది. కానీ మన్మోహన్, లేదా కాంగ్రెస్ మధ్యతరగతి గురించి ఏనాడూ ప్రస్తావించిన పాపాన పోలేదు.

 కాంగ్రెస్ చేసిన తప్పిదాలతోనే కాదు, ప్రజలూ, కార్యకర్తలతో కూడా సంబంధం లేనట్టే రాహుల్ వ్యవహరిస్తున్నారు. అలా అని ఆయన చేసిన మంచిపనులు అసలేమీ లేవు అని అనలేం. కానీ అవన్నీ చాలా పరిమితమే కాక, ఎంతో ఆలస్యంగా జరిగాయి. అరుదుగానే అయినా రాహుల్ రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. పర్యావరణ మంత్రి జయంతి నటరాజన్ అవినీతికి పాల్పడ్డారని గుర్తించి, పదవి నుంచి తొలగించారు. కానీ ఆ పని ఇంకా ఎంతో ముందు చేసి ఉండవలసింది. జైరామ్ రమేశ్ వంటి వారు పార్టీకి మేలు కంటే కీడే ఎక్కువ చేశారని కూడా రాహుల్ గుర్తించారు. 2014 ఎన్నికలలో జైరామ్‌ను రాహుల్ ఎన్నికల ప్రచా రానికి దూరంగా ఉంచారు కూడా. అప్పుడు తెలం గాణ, ఆంధ్రాలలో ఆయన అంతకాలం తిష్ట వేయడానికి కారణం అదే.
 తెలుగు ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులంటే రాహుల్‌కు ఆట్టే విశ్వాసం లేదు. పంచాయతీ సర్పంచ్‌గా కూడా గెలవలేని వారంతా రాజ్య సభకు వచ్చి కూర్చోవడం రాహుల్‌కు వింతగానే ఉంది. ఢిల్లీ నాయకత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తేవారే కీలక పదవులలో ఉన్న సంగతి కూడా ఆయనకు తెలియనిది కాదు. ఈ దుస్థితిని మార్చడానికి తన వంతు యత్నం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాలను అభిమానించడం సహా, చాలా ఆశయాలు ఆయనకు ఉన్నాయి. కానీ వాటిని అమలు చేస్తే తల్లి నుంచి మద్దతు ఉంటుందా? లేక అసలు అంత పని చేపట్టడానికి తనకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? ఈ సంగతి కూడా ఆయనకు తెలియదు.

 జాతికి క్షమాపణ చెప్పాలి
 రాహుల్ తన పర్యటనలతో, సమావేశాలతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారని మీడియా కథనాలు అల్లుతోంది. రాహుల్ పార్లమెంటులో గళం ఎత్తడం వల్లనే ఆయనను పెద్ద నేతగా చిత్రిస్తున్నది. పేదవర్గాలతో మమేకమవుతూ, ఇదే తీరులో పర్యటనలను సాగిస్తుంటే మంచిదని కూడా మీడియా సలహా ఇస్తు న్నది. కానీ ఇది అంత సులభమా? ఇవన్నీ ఎలా ఉన్నా, కాంగ్రెస్ యువనేత ఒక అంశం గుర్తుంచుకోవాలి. తప్పులు చేస్తున్న శత్రువును నిలువరించవద్దు అంటాడు నెపోలియన్. నరేంద్ర మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్న రాహుల్, ఆ తప్పులేవీ తీవ్రమైనవి కావని గుర్తించాలి. నిజానికి నిరంతర విమర్శలతో రాహుల్ మోదీకి మేలు చేసినవారవుతారు. ఆ విమర్శలతో మోదీ జాగ్రత్త పడతారు. ఆయన ఘోర తప్పిదాలు చేసే వరకు మిన్న కుండడమే రాహుల్ చేయవలసిన పని. దీనితో పాటు 2004-2014 మధ్య యూపీఏ గాఢ నిద్రలో ఉండిపోయిన సంగతినీ, ఆ కాలంలోనే మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాస్తవాన్నీ ఆయన గుర్తించాలి. మధ్యతరగతిని విస్మరించినందుకు, ఎగువ తరగతి వారిని విలన్లుగా చూసి నందుకు, తన బావ చేసిన భూకుంభకోణాలకు జాతికి క్షమాపణ చెప్పాలి. ఆ తరువాత మోదీ మీద విమర్శకు దిగాలి. దిగ్విజయ్, మధుసూదన్ మిస్త్రీ, మోతీలాల్ ఓరా, అంబికా సోనీ, మొయిలీ వంటి దివాలాకోరు సలహాదారు లను తిరస్కరించాలి. సోనియా, ప్రియాంకల మాట వినడం కూడా అనవ సరం. ఎందుకంటే వారివన్నీ పాత పంథాలే. మన్మోహన్, ఏకే ఆంటోనీ వంటి నిజాయితీపరులను ముందుకు తెచ్చుకోవాలి. వ్యవహార సరళి కాదు, విషయం ముఖ్యం. కొంతకాలం తరువాత వ్యవహార సరళిని కాదు, విష యాన్నే జనం పట్టించుకుంటారు. మోదీకైనా, రాహుల్‌కైనా ఇదే ముఖ్యం.

 (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు)
e-mail:Drpullarao1948@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement