
ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
నాటి చట్టం భూసేకరణ అనే బలవంతపు ‘సమారాధన’ నుంచి రెండు-మూడు పంటలు పండే భూముల్ని మినహాయించింది. కానీ, ఇప్పుడు కేవలం వర్తక, వ్యాపారులుగా మారిన ఆధునిక పాలకులు - వ్యవసాయ ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా భూసేకరణ/ సమీకరణ విషయంలో అనేక పంటలు పండే భూములను రైతులే వదులుకునే విధంగా ఒత్తిళ్లకు, వేధింపులకు గురిచేస్తున్నారు.
విశ్లేషణ
నాటి చట్టం భూసేకరణ అనే బలవంతపు ‘సమారాధన’ నుంచి రెండు-మూడు పంటలు పండే భూముల్ని మినహాయించింది. కానీ, ఇప్పుడు కేవలం వర్తక, వ్యాపారులుగా మారిన ఆధునిక పాలకులు - వ్యవసాయ ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా భూసేకరణ/ సమీకరణ విషయంలో అనేక పంటలు పండే భూములను రైతులే వదులుకునే విధంగా ఒత్తిళ్లకు, వేధింపులకు గురిచేస్తున్నారు. అంటే 1894 నాటి బ్రిటిష్ వలసవాదుల చట్టాన్నే అనుసరిస్తున్నారన్నమాట! ఇది పంట భూములపై రైతుల హక్కుల్ని కాలరాయటమే.
‘పార్లమెంట్‌ను విస్మరించి దొంగచాటుగా అనేక ఆర్డినెన్స్‌లు తెచ్చినందుకు యూపీఏ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించాల్సి వచ్చింది. నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏకి మించిపోయి మరింత వేగంగా, ఆరునెలల్లోనే ఆర్డినెన్స్‌ల ప్రహసనాన్ని ఆరంభించింది. ఇది పార్లమెంట్ ప్రతిపత్తినీ, అధి కారాన్నీ నాశనం చేసే పరిణామం’ - కె.సి.త్యాగి,
(పార్లమెంటేరియన్ ,1-1-2015)
‘అతనికంటె ఘనుడు ఆచంట మల్లన్న’ అన్న సామెత ఎందుకు పుట్టిందో గాని; బీజేపీ నాయకుడు, ప్రధాని నరేంద్రమోదీకీ, తెలుగుదేశం నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికీ అది వర్తించినంతగా మరో ఏ ఇద్దరు పాలకులకూ వర్తించదేమో! అటు మోదీ, ఇటు బాబూ కూడబలుక్కున్నారో ఏమోగాని వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలోని బడా మోతుబరుల ప్రయోజనాల రక్షణ కోసం; దేశ, ప్రపంచ బ్యాంక్ సంస్కరణలలో భాగంగా విదేశీ బహుళజాతి కంపెనీల పెట్టుబడి ప్రయోజనాల పరిరక్షణ కోసం కంకణం కట్టుకున్నట్టుంది.
ఆర్డినెన్స్‌లూ, అసంపూర్ణ చర్చలూ
రాష్ట్ర శాసనసభలో సమగ్ర చర్చతో నిమిత్తం లేకుండా, ప్రతిపక్షం నోరు నొక్కి ఆంధ్రప్రదేశ్ ప్రాంత అభివృద్ధి సంస్థ పేరిట భూములను కబళించే బిల్లును బాబు ‘పాస్’ చేయించుకున్నారు! రాజధాని నిర్మాణ ం పేరుతో అవసరానికి మించి వేల ఎకరాల సుక్షేత్రాలను, దేశ ఆహార భద్రతకు రక్షణగా ఉన్న ధాన్యాగారాలైన జిల్లాలలో భూములను సేకరించడం దీని ఉద్దేశం. తరువాత, పార్లమెంట్ సమావేశాలు లేని సమయంలో మోదీ ప్రభుత్వం యూపీఏ జమానాలో చట్టంగా రూపొందిన ‘భూసేకరణ - పునరావాస నిర్వాసితుల పునః స్థిరీకరణ’ చట్టాన్ని (2013) సవరిస్తూ దొడ్డిదారిలో ఆర్డినెన్స్ తెచ్చింది. రాష్ట్రపతి ఆమోదముద్రను సంపాదించుకుంది! యూపీఏ -2 తన ఐదేళ్ల (2009-2014) పాలనలో 25 ఆర్డినెన్సులను విడుదల చేస్తే, మోదీ ప్రభుత్వం ఆరేడు నెలలపాలనలోనే 8 ఆర్డినెన్సులు తెచ్చింది!
అటు యూపీఏ (2013) చట్టంలోనూ, ఇటు మోదీ ప్రభుత్వం హోంశాఖ ద్వారా (2014) చొప్పించిన ఆర్డినెన్స్‌లోనూ కొన్ని సమాన ధర్మాలున్నాయి. అంతేకాదు, యూపీఏ అమలు చేయడానికి సాహసించలేని కొన్ని అంశాలూ ఎన్డీఏ ఆర్డినెన్స్‌లో కనిపిస్తున్నాయి. మొత్తం మీద యూపీఏ, ఎన్‌డీఏ కూటముల లక్ష్యం ఒక్కటే - దేశ, విదేశీ గుత్త పెట్టుబడులను భారీ స్థాయిలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలోకి దించి, శాసించి, రైతాంగ వ్యవసాయ కూలీల, పారిశ్రామిక కార్మికుల జీవనాన్ని నియంత్రించడమే. రైతాంగాన్ని కూలీలుగా మార్చి, వ్యవసాయ కార్మికుల్ని పంట పొలాలపై ఆధారపడ కుండా పట్టణాలకు వలస పోయేస్థితిని కల్పించటం కూడా. ఇది 1894 నాటి వలసపాలనా చట్టానికి ఆధునికమైన నకలుగా భావించాలి. అమెరికా తరహా కార్పొరేట్ వ్యవసాయాన్ని ఇండియాలోనూ ప్రవేశపెట్టడం కోసమే గత వలసపాలనా చట్టానికి 1991లోనే ప్రపంచ బ్యాంక్ ప్రజావ్యతిరేక సంస్కరణను ప్రతిపాదించిందన్న సంగతి మరచిపోరాదు!
గడచిన 15 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ కలిపి) సహా యావద్భారతంలో దాదాపు నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దీని ఫలితమే. యూపీఏ, బీజేపీ- ఈ రెండు రకాల పాలనా వ్యవస్థలకూ ఆచరణలో తేడా లేదనడానికీ ఒకే ఒక ఉదాహరణ చాలు - 2013లో రైతాంగ ప్రయోజనాలకు భిన్నంగా యూపీఏ తెచ్చిన చట్టాన్ని ఎలాంటి మినహాయింపులు లేకుండా ఏడాదిన్నర క్రితం పార్లమెంటులో ఆమోదించిన బీజేపీ, నేడు అదే చట్టాన్ని గుత్త వ్యాపార బనియా వర్గాలకు మరింత అనుకూలంగా మారుస్తూ ‘సవరణలు’ తెచ్చి ‘సత్వర ఆదేశం’గా (ఆర్డినెన్సు) రైతుల నెత్తిన రుద్ద బోవటం ఏలాంటి నీతి? అయితే,2013 నాటి చట్టం భూసేకరణ అనే బలవంతపు ‘సమారాధన’ నుంచి రెండు-మూడు పంటలు పండే భూముల్ని మినహాయించింది. కానీ, ఇప్పుడు కేవలం వర్తక, వ్యాపారులుగా మారిన ఆధునిక పాలకులు - వ్యవసాయ ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా భూసేకరణ/సమీకరణ విషయంలో అనేక పంటలు పండే భూములను రైతులే వదులుకునే విధంగా ఒత్తిళ్లకు, వేధింపులకు గురిచేస్తున్నారు. అంటే 1894 నాటి బ్రిటిష్ వలసవాదుల చట్టాన్నే అనుసరిస్తున్నారన్నమాట! ఇది పంట భూములపై రైతుల హక్కుల్ని కాలరాయటమే. 2013 చట్టం ప్రకారం, భూసేకరణ జరిపే సమయంలో నష్టపోయే రైతులలో 70 శాతం మంది, ఇతర ప్రయివేట్, ప్రభుత్వ-ప్రయివేట్ (సి.పి.పి.) ప్రాజెక్టుల విషయంలో అయితే కనీసం 80 శాతం మంది ఆమోదం తప్పనిసరి. కానీ ఈ వెసులు బాటును కూడా 2014-15లో మోదీ ప్రభుత్వం తొలగించింది. ఫలితంగా రైతుల అంగీకారం లేకుండానే భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం దొరికింది.
మాతృసంస్థకూ అనిష్టమే
ఈ సందర్భంగా భారత ప్రభుత్వ జలవనరుల శాఖ మాజీ కార్యదర్శి, నిపుణుడు రామస్వామి అయ్యర్ వ్యాఖ్య గమనించదగింది: ‘‘2013 నాటి భూసేకరణ చట్టంపైన పారిశ్రామికవేత్తలు, వారికి అనుకూలంగా వ్యాఖ్యాతలు వెలిబుచ్చిన వ్యతిరేకతను పట్టించుకోవలసిన పనిలేదు. అలాగే, పారిశ్రామికాభివృద్ధిని త్వరితం చేయాలన్న ప్రభుత్వ ఆశయాన్ని చట్ట విరుద్ధమైనదని కూడా భావించకూడదు. ఈ విషయంలో కొందరి అభిప్రాయాలు ఏమైనప్పటికీ, ఈ సందర్భంగా వ్యక్తమైన ఆందోళనల దృష్ట్యా చేయవలసిన పని- 2013 చట్టంపైన, పంట భూముల్ని భూసేకరణ నుంచి మినహాయించాలంటూ ఆ చట్టం చేసిన నిర్దేశం పైన ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం చర్చకు అనుమతించి ఉండాల్సింది. తద్వారా సంబంధిత వర్గాలు సమన్వయ పూర్వకమైన పరిష్కారానికి వచ్చేలా చేయవలసింది. 2013 చట్టం మీద ఇంతవరకూ సమీక్షే జరగలేదు. కాగా, ఎన్డీఏ పాలకులు ఆ చట్టానికి సవరణలు తెస్తూ ఆకస్మికంగా ఆర్డినెన్స్ జారీచేశారు. ఈ ఆర్డినెన్స్ మంచి చెడ్డల గురించిన చర్చ అలా ఉంచితే, ఎన్డీఏ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు నిరంకుశం, పాక్షికం. ప్రజాస్వామ్య విరుద్ధం.’’ కాబట్టి, దేశ ఆహార భద్రతను దెబ్బతీసే నియంత్రణ రహితమైన భూమి బదలాయింపులు అనర్థమని ఆయన విశ్లేషించారు. రెండు మూడు పంటలు పండే భూముల్ని భూసేకరణ నుంచి మినహాయించాలని 2013 చట్టం ఆదేశించినప్పటికీ అది పరిశ్రమాభివృద్ధిని వ్యతిరేకించలేదనీ, ఈ అంశమే ప్రస్తుత ఎన్డీఏ ఆర్డినెన్స్‌లో కొరవడిందనీ స్పష్టమవుతోంది! చివరికి ఆర్డినెన్స్‌ను జారీ చేయడానికి ఒకరోజు ముందే మోదీ ప్రభుత్వానికి అండగా నిలబడిన ఆర్.ఎస్.ఎస్. పరివార్‌లోని ‘స్వదేశీ జాగరణ మంచ్’ కూడా ఆ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించిన విషయాన్ని గమనించాలి. అంతేగాదు, అంతకుముందు 15 రోజుల క్రితం ఇదే పరివార్ జాతీయ సదస్సులో ‘వ్యవసాయ రంగంలో విదేశీ పెత్తనాన్ని నిలిపివేయాలం’టూ తీర్మానం (నం.4) ఆమోదించిన విషయాన్ని గమనించాలి! అంతకన్నా విచిత్రమైన విషయం - ఏ బీజేపీ (మోదీ) ప్రభుత్వానికి ఆదేశాలిచ్చే ‘సైద్ధాంతిక’ శక్తిగా ‘థింక్ టాంక్’గా ఏ శక్తయితే ఉందో, అదే శక్తి, అంటే ఆర్.ఎస్.ఎస్. దేశ ఉత్పత్తుల పేటెంట్‌కు సంబంధించిన హక్కుల్ని కాపాడవలసిన ప్రభుత్వ విధానం గాడి తప్పిపోవడాన్ని ప్రశ్నించాల్సి వచ్చింది! ఎందుకంటే, దేశీయ పేటెంట్‌ల హక్కుకు సంబంధించి ఒక విధానాన్ని రూపొందించడానికి మోదీ ప్రభుత్వం ‘చింతనా సంఘాన్ని’ (థింక్ టాంక్) నియమించింది. అయితే, ఈ సంఘం దేశీయ ‘చింతన’కు స్వస్తి చెప్పి ఏం చేస్తోంది? భారతదేశంలోనే ‘వస్తు సముదాయాన్ని ఉత్పత్తి చేయాల’ని ఢిల్లీ కోట నుంచి అరుస్తున్న మోదీ ప్రభుత్వం ‘‘తమ థింక్ టాంక్ అమెరికాతో చేతులు కలిపి ఏర్పాటు చేసిన సంయుక్త కార్యనిర్వహణా గ్రూపు (జాయింట్ వర్కింగ్ గ్రూప్) నీడలో పనిచేస్తోంద’’ని ఆర్.ఎస్.ఎస్. బట్టబయలు చేసింది!
ప్రభుత్వాలకు ఎక్కడిది హక్కు?
కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు రాజ్యాంగం ఆదేశిక సూత్రాలుగా పేర్కొన్న 38-39వ అధికరణలకు పూర్తి విరుద్ధం. పౌరుల జీవించే హక్కును, వ్యక్తి స్వేచ్ఛను హరించరాదన్న రాజ్యాంగ ఆదేశానికి ఇది పూర్తిగా అపవాదు. పార్లమెంట్ నిర్ణయాలు, అది చేసే చట్టాల చట్టబద్ధతను సమాజ పరిస్థితుల దృష్ట్యా నిర్ణయించాలని సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో (ఉదా: 1976/2007/2008) ఆదేశించింది. రాజ్యాంగం మౌలిక చట్టాల ప్రకారం అమలు కావాలి. అంతేగాని, అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సర్వసత్తాక (సావరీన్) ప్రతిపత్తి లేదనీ, ప్రభుత్వ ఆచరణ పరిధులు రాజ్యాంగ నిర్వచనకు లోబడి ఉండాలనీ, ఒక చట్టాన్ని రాజ్యాంగం విరుద్ధమని ప్రకటించే హక్కు న్యాయవ్యవస్థకు మాత్రమే ఉందనీ సమాఖ్య రాజ్యాంగ లక్షణాలను విశదీకరిస్తూ న్యాయశాస్త్ర కోవిదుడు పి.ఎం.బక్షీ స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాలు లేవు కాబట్టి (123వ రాజ్యాంగ అధికరణ ప్రకారం) ఆర్డినెన్సు జారీ చేయగల హక్కు రాష్ట్రపతికి ఉంది. కాని ఆర్డినెన్సును జారీ చేసే అధికారం రాజ్యాంగ మౌలిక స్వభావానికి బద్ధమై ఉండాలి. ఒక రెగ్యులేషన్, లేదా ఆర్డినెన్స్ సదరు చట్టం ఉద్దేశానికి హేతుబద్ధంగా లేనప్పుడు న్యాయస్థానం తప్పనిసరిగా జోక్యం చేసుకోవాలని కూడా బక్షీ స్పష్టం చేశారు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు చట్టం చేయడానికి అధికారం లేదని రాజ్యాంగం నిర్దేశిస్తున్నప్పుడు, ఆర్డినెన్సును కూడా పరోక్ష చట్టంగా పాలకులు భావిస్తున్నందున రాష్ట్రపతి సదరు ఆర్డినెన్సును కూడా తన పరిధిలో ప్రశ్నించవచ్చు! కాని అందుకు రాష్ట్రపతి సాహసించలేని ఒక నిరంకుశ చట్రంలో ఎప్పటికప్పుడు ప్రభు త్వాలు బిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజనకు యూపీఏ ప్రవేశపెట్టిన తప్పుడు బిల్లును తనకున్న ‘వీటో’ అధికారంతో రాష్ట్రపతి ప్రశ్నించలేక పోయారు! ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం భూమిపై రైతాంగహక్కుల్ని హరిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ విషయంలోనూ అదే జరిగింది.
(వ్యాసకర్త మొబైల్: 9848318414)