దమ్ముంటే..రమ్మంటాయ్ | Rammantay guts .. | Sakshi
Sakshi News home page

దమ్ముంటే..రమ్మంటాయ్

Published Mon, Dec 22 2014 11:34 PM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

Rammantay guts ..

నీలాకాశంలో విమానాలు ఎగరేస్తారు. నీటి ప్రవాహంలో బోట్లు నడిపించేస్తారు. బుల్లెట్ ట్రైన్‌తో భూమిని చుట్టేస్తారు. హెవీ కార్లతో హైజంప్ చేయిస్తారు. వీరు పెలైట్లూ కారు.. స్పోర్ట్స్ కార్ డ్రైవర్లూ కారు.. మరెవరు? హాబీగా హెలికాప్టర్లు నడిపే హైదరాబాదీలు. సరదాగా మరబోట్లను ముందుకు ఉరికించే సిటీజనులు. వయసును సైతం మరచిపోయేలా వినోదంలో ముంచి తేల్చుతున్న  సరికొత్త అభిరుచి ఇప్పుడు సిటీని పట్టి కుదిపేస్తోంది. అద్భుతమైన వినోదాన్ని అందిస్తోంది.
 ..:: ఎస్.సత్యబాబు
 
పదిహేనేళ్ల కుర్రాడికి ఆడుకోమని బొమ్మ ఇస్తేనే.. ‘నిక్కరేసుకుని, నోట్లో వేలేసుకుని, ఐస్‌క్రీమ్ చప్పరించే చిన్నపిల్లాడిలా ఉన్నానా?’ అంటూ కోప్పడతాడు. మరి.. థర్టీలూ ఫార్టీలూ దాటేసిన, హాఫ్‌సెంచరీ కొట్టేసిన మెచ్యూర్డ్ పీపుల్‌కి బొమ్మలు ఇచ్చి ఆడుకోమంటే ఏమంటారు..  ‘బచ్‌ఫన్ దుబారా మిల్‌గయా, ఫుల్ హ్యాపీగా ఆడుకుంటాం’ అంటున్నారు. దీని కోసం వారాంతాల్లో ఖాళీ స్థలాలను వెతికి పట్టుకుని మరీ ‘ప్లే’మ్యాన్‌లైపోతున్నారు. ఓ వైపు మొబైళ్లూ, మానిటర్లకు అంటుకుపోయి ఆటపాటలకు చిన్నారులు దూరమవుతుంటే పెద్దోళ్లు చిన్నపిల్లల్లా బొమ్మలతో మమేకం అవుతుండడం విశేషం.
 
పెద్దలకు మాత్రమే..

సిటీలో పిల్లల కోసం మాత్రమే టాయ్ షాప్స్ ఉన్నాయనుకుంటే బొమ్మ మీద కాలేసినట్టే. ఇప్పుడు పెద్దవాళ్లకూ స్పెషల్ టాయ్స్ వచ్చేశాయి. ఐదారేళ్ల క్రితం ఊపిరిపోసుకున్న పెద్దవాళ్ల బొమ్మలాట ఇప్పుడు సిటీలో ఊపు మీదుంది. హెలికాప్టర్‌లు, ఏరోప్లేన్‌లూ, విభిన్న రకాల కార్లు, నీటిలో దూసుకుపోయే బోట్లు, ఆఖరికి రైళ్లు సైతం పెద్దవాళ్ల కోసం వచ్చేశాయి. రిమోట్-రేడియో కంట్రోల్స్‌తో నడిచేవి, ఫ్యూయల్‌తో, బ్యాటరీతో పరుగులు తీసేవి.. ఇలా ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. రూ.5 వేలు మొదలుకుని రూ.10 లక్షల దాకా ఖరీదు చేసే ‘బిగ్’టాయ్స్ సైతం సిద్ధంగా ఉన్నాయి. నగరానికి చెందిన పలువురి దగ్గర 10 అంతకు మించిన సంఖ్యలో బిగ్ టాయ్స్ ఉన్నాయంటే ఈ సరదా ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. పెద్దల కోసం పలు రకాల ప్లే టాయ్స్ వచ్చినా, వీటిలో ఫ్లైయింగ్ హాబీకే అగ్రస్థానం దక్కుతోంది.
 
ఆకాశవీధిలో..

వారాంతంలో సిటీ చుట్టుపక్కల మైదానాలు, ఖాళీ స్థలాల్లో ఇప్పుడు విమాన విన్యాసాలు జరుగుతున్నాయి. అయితే ఇవి ఏ ఎయిర్‌ఫోర్స్ వాళ్లో నిర్వహించే ఎయిర్ షోలు కావు. రిమోట్‌తో నియంత్రించే మినీ కాప్టర్లు, ఏరోప్లేన్‌లు. వీటిని ఎగరేసేందుకు ఐటీ ఉద్యోగుల నుంచి సినీ, వ్యాపార రంగాలకు చెందిన ఎందరో ఉవ్విళ్లూరుతున్నారు.‘బోట్లు, ట్రైన్స్ వంటివి సైతం కొనుగోలు చేసేవారున్నారు. అయితే కాప్టర్స్‌లా వాటితో ఎక్కడ పడితే అక్కడ ఆడుకోలేరు అందుకే వాటిని పరిమితంగానే వినియోగిస్తున్నారు’ అని చెప్పారు బంజారాహిల్స్‌లో ఉన్న జాక్స్ హాబీస్ షోరూం నిర్వాహకులు జాక్. కేవలం విమానాలను ఎగురవేయడం మాత్రమే కాదు వాటిని పల్టీలు కొట్టించడం, రన్‌వే నుంచి గాల్లోకి ఎగరేయడంలో నైపుణ్యం వంటివి పరిగణనలోకి తీసుకుంటూ సరదా పోటీలూ జరుగుతున్నాయి. స్పీడ్, కరెక్ట్ స్పాట్‌లో ల్యాండ్ చేయడం, 2,3 విహంగాలను కలిపి ఒకే ఫార్మేషన్‌లో ఫ్లై చేయడం ఇవన్నీ ఫ్లైయింగ్ నైపుణ్యానికి అద్దం పడతాయి. ఇక బోట్లను వినియోగించేవారి కోసం స్పెషల్‌గా స్విమ్మింగ్ ఫూల్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటితో వాటర్ రేస్‌లూ నిర్వహిస్తున్నారు. అలాగే ఫారెస్ట్‌లో నడిపే భారీ ఇంజన్ ఉన్న కార్ల జూనియర్‌లు కార్ల టాయ్స్‌గా డిమాండ్‌లో ఉన్నాయి. వీటితోనూ సరదా రేస్‌లు నిర్వహిస్తున్నారు.
 
‘బొమ్మలాట’ అనుకోవద్దు..

ఇవి ఖరీదులోనే కాదు ఆడటంలోనూ అందరూ అందుకోలేనివే. ఈ గేమ్ కోసం ఉపయోగించేవి కూడా దాదాపు పూర్తిస్థాయి మెకానిజమ్‌తోనే రూపొందుతాయి. విహంగాలైతే గంటకు 50 నుంచి 100 కిలోమీటర్లకు పైగా స్పీడ్‌తో నడుస్తాయి. వేగం పుంజుకున్నాక కంటిరెప్ప వేయడానికి కూడా టైమ్ సరిపోదు. వీటి నియంత్రణ సక్రమంగా చేయలేకపోతే కుప్పకూలడం ఖాయం. రిపేర్ చేయించడం సులభమైన విషయం కాదు కాబట్టి పెట్టిన డబ్బులకు నీళ్లొదలాల్సిందే. ఫ్యూయల్ ట్యాంక్ నింపితే 15 నిమిషాలు వస్తుంది. ఫ్యూయల్ అయిపోయేటప్పుడు బీప్ సౌండ్ వస్తుంది. దీన్ని గమనించిన వెంటనే అప్రమత్తమై ల్యాండింగ్ చేసేయాలి. అందుకే దీని కోసం శిక్షణ ఇచ్చే ప్రొఫెషనల్స్ కూడా అందుబాటులోకి వచ్చేశారు. అలాగే కంప్యూటర్‌లో సిములేటర్స్ ఉంటాయి. వాటి మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మరో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ బిగ్‌టాయ్స్ మామూలు బొమ్మల్లాంటివి కాదు. వీటిని ఎక్కడ పడితే అక్కడ వినియోగించడం చట్ట వ్యతిరేకం కూడా. సో.. కేర్‌ఫుల్‌గా కొనుక్కుని  చీర్‌ఫుల్‌గా ఎంజాయ్..
 
ఫ్యామిలీ అంతా ఆడతాం..

నాకు పదేళ్లున్నప్పుడే నాన్న చిన్న మోడల్ హెలికాప్టర్ కొనిపెట్టారు. అది పాడైపోయాక సొంతంగా కొనలేకపోయాను. కొనుక్కునే శక్తి వచ్చింది కాబట్టి.. నాలుగేళ్లుగా ఆడుతున్నా. నా దగ్గర 15 దాకా ఏరో ప్లేన్స్, హెలికాప్టర్స్ వగైరాలు రూ.7 వేల నుంచి రూ.1.8 లక్షల దాకా ఖరీదైనవి ఉన్నాయి. వీటిని పూర్తిగా టాయ్స్ అనడానికి లేదు. వీటిలో చాలా ఇంజినీరింగ్ వర్క్ ఉంటుంది. అనుభవం వచ్చాకే ఆడగలం. మా అబ్బాయి, మా ఆవిడ నేను కలిసి వీకెండ్స్‌లో ఆడుకుంటుంటాం. ఆదివారం రోజున నాలుగైదు సార్లు టేకాఫ్ చేయడం, తిరిగి ఎగరడం.. ఈ సరదాతో మిగిలిన విషయాలన్నీ మరచిపోతాం. వారాంతాల్లో లంచ్ అయ్యాక వెళ్లి ఆడి ఆడి అక్కడే డిన్నర్ చేసి తిరిగి వస్తాం.
 - రఫీఖ్ (37),సఫిల్‌గూడ

ఎయిర్‌క్రాఫ్ట్ కొన్నా..

అసలు విమానాల్ని ఎలా డిజైన్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్. ఇంజినీరింగ్‌లో ఉన్నప్పటి నుంచి ఫ్లైయింగ్ అంటే ఇష్టం. అయితే జాబ్‌లో జేరిన తర్వాత ఇప్పుడు టైమ్ దొరికింది. ఈ మధ్యే ఎరైజింగ్‌స్టార్ ఎయిర్‌క్రాఫ్ట్ కొన్నా. ఇది కొంచెం పెద్దది. నాకింకా ట్రైనింగ్ అవసరం. శామీర్‌పేట్ లేక్ రిసార్ట్స్ దగ్గర్లోని నల్సర్ లా కాలేజ్ గ్రౌండ్స్‌లో రెగ్యులర్‌గా వెళ్లి ఫ్లైయింగ్ చేస్తుంటా. స్టంట్స్ చేయలేను గాని బేసిక్ ఫ్లైయింగ్ వచ్చు. ఇది చూడడానికి కేవలం సరదా ఆటలా అనిపించినా... కమ్యూనికేషన్‌కు కూడా ఉపయోగపడుతుంది. దీనితో మనం ఏరియల్ ఫొటోగ్రఫీ నేర్చుకోవచ్చు. ఎయిర్ క్రాప్ట్ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవచ్చు.
 - ప్రియాంక, టీసీఎస్ ఉద్యోగిని, వనస్థలిపురం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement