రీడింగ్ స్పాట్
ఇంద్రధనుస్సు ఎలా వస్తుంది.. చెట్లు ఎక్కడి నుండి వస్తాయి.. చిన్నారుల ప్రశ్నల పరంపరకు అడ్డుకట్ట వేయలేం. అయితే నేటి బిజీలైఫ్‌లో వీటికి సమాధానం చెప్పేంత టైమ్ తల్లిదండ్రులకు ఉండటం లేదు. అలాగని వాటన్నింటికి స్కూల్స్‌లోనూ పూర్తి సమాచారం దొరకకపోవచ్చు. ఇలాంటప్పుడు చిరు ప్రశ్నలే పేరెంట్స్‌కు పెద్ద సమస్యలుగా మారుతుంటాయి. దీనికి పరిష్కారం చూపెడుతున్నాయి సిటీలో ఏర్పాటవుతున్న కిడ్స్ లైబ్రరీలు.
విజయారెడ్డి
చదివితే పోయేదేం లేదు అజ్ఞానం తప్ప అన్నట్టుగా... రీడింగ్‌కు దూరమవుతున్న చిన్నారులకు పుస్తకాలను చేరువ చేసేందుకు ఆధునిక తల్లిదండ్రులు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. పిల్లల ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసేందుకు, రీడింగ్ కల్చర్‌ను ఇంప్రూవ్ చేసేందుకు వీరు పడుతున్న ఆరాటం నుంచి పుట్టుకొచ్చినవే ఈ కిడ్స్ లైబ్రరీలు.
చదువు... ఆట విడుపు...
ఈ లైబ్రరీలు పిల్లలకు అటు రీడింగ్ హాబీని అలవరుస్తూనే ఇటు ఆటవిడుపుగానూ ఉంటున్నాయి. పెద్దవాళ్ల లైబ్రరీ కల్చర్‌కు ఇవి భిన్నంగా ఉంటున్నాయి. లైబ్రరీ అంటే కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా సైన్స్‌కు సంబంధించిన ప్రతి అంశాన్నీ ప్రాక్టికల్‌గా చిన్నారుల ద్వారా చేయించడం వీటిలో కనిపిస్తుంది. ఉదాహరణకు రెయిన్‌బో ఎలా వస్తుందనే విషయాన్ని తీసుకుంటే వైట్ పేపర్‌ని తీసుకుని లెన్స్ ఉపయోగించి టార్చ్ లైట్ ఫోకస్‌తో రెయిన్‌బోని చూపిస్తారు. అలాగే విత్తనం ఎలా మొలకెత్తుతుందనే సందేహాన్ని తీర్చేందుకు పెద్ద సైజు డిస్బోజబుల్ వాటర్ గ్లాస్‌లో సగం వరకు మట్టి నింపి అందులో ఏదైనా ఒక విత్తనం పిల్లల చేత నాటిస్తారు.
అది మొలకెత్తేవరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతారు. ఇలా చదువుతో పాటు ప్రాక్టికల్‌గా ఉపకరించే ఎన్నో విషయాలను పిల్లలకు నేర్పించడం సిటీలోని కిడ్స్ లైబ్రరీల ప్రత్యేకత. ప్రతి వారం చిన్నారులకు సంబంధించిన వర్క్‌షాపులు నిర్వహిస్తారు. ఇంగ్లిష్ బాషపైన పట్టు. స్పేస్‌లో జరిగే వింతలూ విశేషాలు, డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్‌గా ఉంటాయి. వారంలో శుక్ర, శని, ఆదివారాల్లో ఇవి అందుబాటులో ఉంటున్నాయి.
చదివే అలవాటు వల్లే...
నాకు స్వతహాగా చిన్నప్పటి నుంచి రకరకాల బుక్స్ చదివే అలవాటు ఉండేది. దీని వల్ల నా దగ్గర 5 వేల పుస్తకాలు పోగయ్యాయి. ఎంబీయే పూర్తి చేసి ఐదు సంవత్సరాల పాటు ముంబైలో ఐసీఐసీఐ బ్యాంక్ సీనియర్ మేనేజర్‌గా పనిచేశా. హైదరాబాద్‌కు వచ్చాక మా పిల్లల నాలెడ్జ్‌కి దోహదపడే సెంటర్స్ ఏవీ లేకపోవటంతో... నా జీతం డబ్బులు జాగ్రత్త చేసి 10 వేల పుస్తకాలతో మూడేళ్ల క్రితం చిన్నారుల లైబ్రరీ ఏర్పాటు చేశా. మా లైబ్రరీలో పిల్లలకు సంబంధించిన ప్రతి పుస్తకం దొరుకుతుంది. కేవలం పుస్తకాలే కాకుండా విభిన్న అంశాలపై పిల్లల్లో విజ్ఞానం పెరిగేందుకు వర్క్‌షాప్‌లు కండక్ట్ చేస్తున్నా.
- వర్షా రమేష్, బుక్ ఎండ్ మోర్, వెస్ట్‌మారేడ్‌పల్లి