శ్రీను వైట్ల
ప్రముఖ కథ-మాటల రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్ ఇద్దరూ ఒక్కసారిగా ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్లకు దూరమయ్యారు. దాంతో 'ఆగడు' చిత్రానికి ఆయన ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. సంతోషం సినిమాతో స్క్రీన్ప్లే రచయితగా పరిచయమైన గోపీ మోహన్ ఆ తర్వాత వెంకీ, ఢీ, రెడీ, కింగ్, దూకుడు, దేనికైనా రెడీ, బాద్షా చిత్రాలతో మంచి కథా-స్క్రీన్ప్లే రచయితగా గుర్తింపు పొందారు. అలాగే కోన వెంకట్కు సంభాషణల రచయితగా మంచి పేరుంది. బాద్షా, అదుర్స్, ఢీ, రెడీ, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, సాంబ, వెంకీ వంటి చిత్రాలకు ఆయన మాటలు రాశారు. ఈ ఇద్దరూ ఒకేసారి దర్శకత్వం వైపు మొగ్గు చూపుతున్నారు. అదీగాక బాద్షా సినిమా సమయంలో శ్రీను వైట్లకు, కోన వెంకట్కు మధ్య విభేదాలు తలెత్తాయి. వెంకట్ మీడియా ముందు బహిరంగానే కొన్ని విషయాలు చెప్పారు. ఆ తరువాత వీరిద్దరి మధ్య దూరం పెరిగింది.
ఈ నేపధ్యంలో శ్రీను వైట్ల ‘ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని రంగంలోకి దిగారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ బేనర్‌పై మహేష్ బాబు నటిస్తున్న మూడో చిత్రం ఇది. ఈ కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా 'దూకుడు' మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికీ శ్రీను వైట్ల దర్శకుడు. ఈ బేనర్లో రెండో సినిమా '1 నేనొక్కడినే' సంక్రాంతికి విడుదలై మంచి టాక్తో ఆడుతోంది. దూకుడుతో శ్రీను వైట్ల-మహేష్ బాబు మంచి కాంబినేషన్గా గుర్తింపు పొందారు. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా, మిల్క్ బాయ్ మహేష్తో తొలిసారిగా జతకడుతోంది. ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేసి ఈ ఏడాది వేసవిలో సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు మే 31 విడుదల చేయాలన్న ఆలోచనతో నిర్మాతలు ఉన్నారు.
ప్రముఖ రచయితలు ఇద్దరూ తనకు దూరమైనప్పటికీ స్క్రిప్టు, స్కీన్ప్లేలో తన సత్తా చాటాలన్న పట్టుదలతో శ్రీను వైట్ల ఉన్నారు. మంచి కసితో కథను సిద్ధం చేసుకున్నారు. ఈ సారి మహేష్ బాబుని వైవిధ్యంగా చూపే ప్రయత్నంలో ఉన్నారు. మాస్ హీరోగా, యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉండేవిధంగా మహేష్ బాబు పాత్రను రూపొందించినట్లు తెలుస్తోంది. కమర్సియల్ అంశాలతోపాటు వినోదాత్మకంగా రూపొందించే ఈ సినిమా విషయంలో కథా పరంగా, మహేష్ పాత్ర పరంగా శ్రీను వైట్ల చాలా జాగ్రత్తలు పాటించినట్లు సమాచారం. కథ-మాటల విషయంలో ఒంటరిగానే కష్టపడుతున్న శ్రీను వైట్ల ఎంతవరకు విజయం సాధిస్తారో వేచి చూడాల్సిదే!
s.nagarjuna@sakshi.com