ఆత్మవినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా?
తెల్లవాడి గుండెల్లో బాకు దించినా.. ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగరేసినా.. అది మధ్యతరగతి మేధావి వర్గం వల్లే సాధ్యమైందంటారు ప్రముఖ కవి, సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. తెగువతో తెగించి పోరాడిన ఆ వర్గం... ఇపుడు మౌనంగా ఎందుకు ఉందని ప్రశ్నిస్తున్నారు. స్వేచ్ఛా భారతంలో అన్యాయాన్ని నిలదీసి సత్తా చాటడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజాన్ని బలిగోరే సమాజంపై కన్నెర్ర చేయడం లేదని నిగ్గదీస్తున్నారు. అయితే.. ఎవరో ఒకరు ఎపుడో అపుడు పదునెక్కిన ఆలోచనలతో ముందుకొస్తారని ఆకాంక్షిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేళ.. సిరివెన్నెల మదిలో ఉప్పొంగిన ఆవేశమే ఇక్కడ అక్షరరూపమైంది.
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రమందామా? స్వర్ణోత్సవాలు చేద్దామా?
ఆత్మ వినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా? దానికి సలాము చేద్దామా?
.. సగటు మనిషిలో రగిలిపోయే ఆవేశమిది. శాంతి కపోతపు కుత్తుక తెగిపోతున్న వేళ.. తెగిపడిన తలే భారతావని నుదుట సింధూరమైన వేళ.. సామాన్యుడి స్పందన ఇలాగే ఉంటుందేమో? ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిందా? పోయిందా? అన్న సందేహమే కల్గిస్తుందేమో? ఈ దేశాన్ని కొల్లగొట్టి, గుల్లచేసిన తెల్లవాడిని తరిమికొట్టడానికి ఏకమైన జాతి ఇప్పుడెందుకు నైరాశ్యంలో ఉంది? స్వాతంత్య్రం అనే భావజాలం కోసం ఒకే మాట, ఒకే బాట ఎంచుకున్న భారతీయులు ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారు? స్వాతంత్య్రం వచ్చాక యావత్ భారతావని ఏకమైన సందర్భాలేంటి? చైనా, పాకిస్తాన్‌తో యుద్ధం సమయమో.. క్రికెట్ కప్పు గెలుపోటముల్లోనో తప్ప మన కోసం.. భావి తరం కోసం ఏకమయ్యే పరిస్థితి లేదా?
నిజాన్ని బలిగోరే సమాజమెందుకు?
గాంధీ కోరింది దేశానికి స్వాతంత్య్రమే కాదు. గ్రామ స్వరాజ్యం కూడా. దశాబ్దాలుగా ఈ లక్ష్యాన్ని సాధించలేకపోయాం. సురాజ్యమవ్వలేని స్వరాజ్యాన్నే గొప్పగా చెప్పుకుంటున్నాం. సుఖాన మనలేని వికాసాన్నే ప్రగతి సంకేతమంటున్నాం. నిజాన్ని బలిగోరే సమాజాన్నే చూస్తున్నాం. తెల్లవాడు రాకముందు ఈ దేశంలో వికేంద్రీకరణ ఉండేది. ఏ ఊళ్లో పాలన ఆ ఊరిలోనే. అక్కడే తీర్పులు, అక్కడే శిక్షలు. అప్పట్లో ఊరిలోనే పని దొరికేది. ఇప్పుడు మనం చెప్పుకునే సర్వసత్తాక ప్రజాస్వామ్యం పల్లెల్లోనే కన్పించేది. ధార్మిక సంబంధాలే తప్ప పొరుగూరితోనూ పనిలేని వ్యవస్థ మన పల్లెల సొంతం. బ్రిటీష్ వాళ్లు దీనిపై దెబ్బకొట్టారు. వికేంద్రీకరణతో గ్రామీణ భారతాన్ని ఛిన్నాభిన్నం చేశారు. న్యాయం కోసం, ఉపాధి కోసం మైళ్ల కొద్దీ వెళ్లే పరిస్థితి తెచ్చారు. ఆ పద్ధతినే మనం అనుసరిస్తున్నాం. ఈ భావదారిద్య్రం నుంచి బయటపడేదెప్పుడు?
మెకాలేకు మొక్కాలా?
ఇంగ్లీష్ మాట్లాడకపోతే దేశద్రోహమని భావించే విద్యా సంస్థలు.. దాన్ని ప్రోత్సహించడమే ఫ్యాషన్ అనే తల్లిదండ్రులు మారేదెన్నడు? ఇంగ్లీషోడి భాషను ఇంకా ఇంపుగా ఆదరించడమంటే.. తెల్లవాడి భావజాలం నుంచి మనం బయటపడనట్లేగా. విశ్వవ్యాప్తంగా దూసుకెళ్లే చైనా, రష్యా వంటి దేశాలు స్వదేశీ భాషకే పట్టం కడుతున్నా.. మనకేంటీ దుర్గతి? బానిసత్వపు ఆలోచనలనే భావి తరాలకు బోధించడాన్ని కార్పొరేట్ విద్యగా పేర్కొనడం అన్యాయమే. తెలుగు చదవలేని, మాట్లాడలేని దౌర్భాగ్యంలో ఉంటే స్వాతంత్య్రం వచ్చినట్టేనా? మెకాలే విద్యావ్యవస్థ ఉన్నంతకాలం ఈ ప్రశ్నకు సమాధానమే లేదు.
ఆధునికతా? అధోగతా?
మూడు దశాబ్దాల క్రితం ఈ దేశంలో కంప్యూటర్ వాడకం మొదలైంది. అంతకు ముందు ఇండియా అనేక రంగాల్లో ఎన్నో దేశాలకు పోటీ ఇచ్చింది. విజ్ఞాన వీచికలు పంచుతూ అమెరికాకే ఆదర్శమైంది. శాస్త్ర,సాంకేతిక పురోగతి అందివచ్చాక.. ఆ వేగం ఎందుకు కుంటుపడింది? పరిశోధన రంగం జాడలు బలంగా కన్పించవెందుకు? వందమంది పని ఒక్క కంప్యూటర్ చేస్తుంటే, 99 మంది రోడ్డున పడుతున్నారే? ఆధునిక యంత్రం.. సంప్రదాయ వృత్తులను నుజ్జునుజ్జు చేస్తుంటే పట్టించుకోరే? నేలతల్లే భారమైన దయనీయ స్థితి.. దీన్నేనా మనం ప్రగతి అంటున్నాం?
నిజం తెలుసుకోరే.. భుజం కలిపి రారే?
ఒకప్పుడు మతం మన బలం. కులం ఉపాధి గుణం. ఈ రెండూ జాతిని ఏకం చేశాయి. స్వాతంత్య్రం తర్వాత పరిస్థితి ఏమిటి? కులం రాజకీయమైంది. మతం వికృత భావజాలమై సమాజంలోకి వచ్చింది. కులాల కోసం గుంపులు కట్టే దుస్థితి దాపురించింది. మతాల కోసం మంటలు పెడుతున్న వైనం కన్పిస్తోంది. భారతావని బంధనాలు తెంచే క్రమంలో కులమతాలు అడ్డొచ్చాయా? ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులూ ముక్త కంఠంతో నినదించలేదా? ఇవన్నీ ఇప్పుడెందుకు మరచిపోతున్నాం. ముస్లింలు ఈ దేశ పౌరులు కాదనే హక్కు ఎవరికి ఉంది? దేశం కోసం వాళ్లూ ప్రాణాలర్పించలేదా? దేశాభివృద్ధిలో పాలుపంచుకోలేదా? రక్తసిక్తమైన జలియన్‌వాలా బాగ్‌లో పేలిన వందల తూటాలూ డయ్యర్‌వేనా? స్వార్థంతో తెల్లవాడి పంచన ఉద్యోగం చేసినవాళ్లవి లేవా? వాళ్లలో ఎవరిది ఏ కులం? ఎవరిది ఏ మతం? సమాజ క్షేమం పట్టని స్వార్థం.. ఇరుకుతనంతో ముడుచుకుపోతే ఈ జనం నిజమెలా తెలుసుకుంటారు?
నిరాశావాదమే కారణమా?
నిరాశావాదం బలహీన భావనలకు ఆజ్యం పోస్తుంది. ఈ దేశంలో జరిగింది అదే. స్వేచ్ఛ కోసం పోరాడిన జనం.. ఒక్కసారిగా నిరాశావాదంలోకి వెళ్లారు. స్వార్థ ప్రయోజనాలకే పరిమితమయ్యారు. నిర్దేశిత లక్ష్యాలు లేకుండా పోయాయి. ఫలితంగా తొందరపాటు నిర్ణయాలు జరిగాయి. కార్పొరేటీకరణ, సరళీకరణ, ఆర్థిక సంస్కరణల పర్వం.. ఇలా ఏదైనా పరాయి వాడి వ్యాపారమే పరమాన్నమైంది. పేదవాడి బతుకు బుగ్గయినా పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రజలూ కారణమే. అప్పుడప్పుడూ ఆవేశం వస్తుంది? ఆ క్షణంలో మార్పు కోసం ఏకమవుతారు. అంతలోనే చల్లబడతారు. పాలకులే అన్నీ చూసుకుంటారని ఊరుకుంటారు.
ఆటవికన్యాయం మారదేం?
ఒక జంతువు ఆకలి తీర్చుకోవడానికే వేటాడుతుంది. ఆ క్రమంలో ఎదుటి జంతువు ఏంటని చూడదు. తనదా? పరాయిదా? అన్న భావన రాదు. కానీ మనిషి ఆకలి కోసం దోచుకోవడం లేదు. సంపద కూడబెట్టాలనుకుంటున్నాడు. జంతువుకన్నా హీనంగా ఉన్న భావనలను ఏమని సంబోధించాలి? ఈ భావజాలంతో సమాజాభివృద్ధి ఎలా సాధ్యం?
ధర్మాగ్రహమే ముఖ్యం
జాతి నిర్మాణం చాలా అలస్యమవుతుంది. కానీ కూల్చివేయడం క్షణాల్లో పని. నిర్మాణాత్మక ఆలోచనలు జనంలోనూ ఉన్నాయి. కాకపోతే అవి వాళ్ల వద్దే ఉన్నాయి. ఒక సినిమా రిలీజ్ అయితే మంచి, చెడును అన్ని ప్రాంతాలవాళ్లూ సమానంగా నిర్ణయిస్తారు. హైదరాబాద్‌లో వచ్చిన అభిప్రాయమే వైజాగ్‌లోనూ వస్తుంది. ఈ దేశం బాగుపడాలని అంతా అనుకుంటారు. దాన్ని నిలదీసి అడగలేరు. ‘నేనొక్కడిని అడిగి ఏం లాభం’ అన్న భావనతో ఉంటారు. ఇలా పక్కవాడు ఆలోచిస్తాడని ఎందుకు అనుకోరు? ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..’ అన్నప్పుడు ‘అబ్బ.. ఏం అడిగాడు’ అన్నారే తప్ప, ఆ జనంలో తానూ ఉన్నానని గుర్తించరా?
ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు!
ఈ దేశంలో మార్పు కేవలం మధ్య తరగతి మేధావి వర్గం నుంచే సాధ్యం. స్వాతంత్రోద్యమ కాంక్ష రగిలించినా, విప్లవోద్యమ కెరటాలు సృష్టించినా, భారతమాత పాపిట రక్త సింధూరమైనా.. అందుకు కారణం మధ్య తరగతి మేధావే. బతుకు పోరాటమే జీవన విధానమయ్యే ఈ వర్గం అప్పుడప్పుడు ఆలోచిస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఈ ఆలోచన ఒకే రకంగా ఉంటుంది.
ఆ ఆలోచనల తీర్పు ఊహించని విధంగా ఉంటుంది. కానీ వాళ్లు ఉదాసీనంగా ఉంటారు. వేదనలు, రోదనలు పరిమితి మించినప్పుడు మార్పు కోసం సమైక్యంగా గళమెత్తుతారు. ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి పురాణాలు తిరగేయక్కర్లేదు. రామాయణ, భారత గ్రంథాలు చదవక్కర్లేదు. మనిషిని బంధించగలరేమో కానీ.. ఆలోచించే మనసును బంధించడం ఎవరి వల్లా కాదు. మన చేత్తోనే మన ఇంటి వస్తువులు భోగి మంట వేసుకుని ఆనందించే పరిస్థితి నుంచి.. ఆలోచించి అడుగేసే రోజు వస్తుంది..
అదీ మధ్యతరగతి ఇంటి నుంచే!
- వనం దుర్గాప్రసాద్