రాముడి యుగం పోయి రాకెట్ యుగం వచ్చింది.. అయినా ఆయన ఇమేజ్ మాత్రం తగ్గలేదు! ఇప్పటికీ రామచంద్రుడులాంటి కొడుకు కావాలని కోరుకోని తల్లిదండ్రులుండరు.. సాకేతరాముడిలాంటి ఏకపత్నీవ్రతుడు దొరకాలని దండం పెట్టని ఆడపిల్ల ఉండదు! శ్రీరామనవమి సందర్భంగా బుల్లితెర తారలను కదిలిస్తే మనసులో ఉన్న మాటను బయటపెట్టారిలా...
..:: శిరీష చల్లపల్లి
హరే రామ.. హరే కృష్ణ..
‘అనగనగా’ సినిమా కథానాయిక, వెల్‌నోన్ యాంకర్ ప్రశాంతి ఏం చెప్తుందంటే ‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాయనమ్మ ద్వారా విన్న కథ రామాయణమే. చిన్నప్పుడు రాముడంటే చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉండేది. తర్వాత తర్వాత రామాయణం చదవడం.. ఎనాలసిస్ చేసుకోవడం మొదలుపెట్టాక రాముడంటే గౌరవం పెరిగింది. కానీ, నాకు కాబోయే భర్త రాముడిలా ఎఫెక్షనేట్‌గా ఉండాలి.. కృష్ణుడిలా రొమాంటిక్‌గా ఉండాలి’ అంటుంది.
రాముడులాంటి వాడే కావాలి..
మహిళా ప్రేక్షకుల మనసు దోచిన సీరియల్ శశిరేఖా పరిణయం. ఆ సీరియల్‌లో శారద పాత్రను పోషిస్తున్న తార నిహారిక. హీరో ప్రదీప్, సీనియర్ యాంకర్ సరస్వతీల ముద్దుల పట్టీ. శ్రీరామనవమి పండుగను తనెలా అభివర్ణించిందంటే... ‘శ్రీరాముడు.. ధర్మనిరతుడు. గొప్ప నాయకుడు. విశ్వామిత్రుడి ఆజ్ఞమేరకు తాటకిని వధించడం నుంచి వాలిని కూల్చడం.. రావణ సంహారం.. అన్నీ రాముడ్ని ధర్మపక్షపాతిగా నిలిపాయి. మనసావాచాకర్మణా సీతకే అంకితమయ్యాడు. మంచికే కట్టుబడి ఉన్నాడు. నాకూ అలాంటి భర్తే కావాలి. నా పాషన్ అయిన కళను ఎంకరేజ్‌చేయాలి. కుటుంబవిలువలు తెలిసినవాడై ఉండాలి’ అంటూ చెప్పుకొచ్చింది.
చిలిపివాడైతే..
పదమూడో ఏటే యాంకర్ అయి పదేళ్లుగా అదే రంగంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న అశ్విని.. 108 స్తోత్రాలను ఒకటిన్నర నిమిషంలో రాగయుక్తంగా ఆలపించి గిన్నిస్‌బుక్‌లోనూ చోటు సంపాదించింది. శ్రీరాముడిలోని ఏ సుగుణాలు తన కాబోయే వరుడిలో ఉండాలనుకుంటుందంటే ‘నాకు రాముడన్నా, సీతన్నా, రామాయణమన్నా చాలా ఇష్టం. నేను నేర్చుకున్న కీర్తనలన్నీ రాముడిమీదే. ఆయన ఎంతమంచి వాడైనా, కారణమేదైనా సీతమ్మను కానలకు పంపాడన్న అపవాదును మోశాడు. నాకైతే.. కొంచెం రాముడు, కొంచెం కృష్ణుడిలాంటి వాడు నాకు భర్తగా దొరకాలి అనుకుంటున్నా. అంటే ప్రేమించే తత్వంలో రాముడిలా ఉండాలి. చిలిపితనంలో కృష్ణుడిలా ఉండాలి. అయితే నా పెళ్లికి ఇంకా రెండేళ్లు టైముంది’ అంటుంది అశ్విని.
పొసెసివ్‌నెస్ ఉండాలి..
గుడ్‌మార్నింగ్ టాలీవుడ్, షార్ట్‌కట్ అనే టీవీ షోస్ ద్వారా పాపులర్ అవుతున్న యాంకర్ వైష్ణవి. అనసూయ చెల్లెలు. ‘రామాయణం అందరికీ ఆదర్శం. కానీ రాముడే కొంచెం పొసెసివ్‌గా ఉండి ఉంటే సీతకు ఆ కష్టాలు తప్పేవి. నాకు కాబోయే భర్త నా పట్ల కొంచెం పొసెసివ్‌నెస్‌తోనే ఉండాలని కోరుకుంటాను. రాముడిలాంటి సింప్లిసిటీ ఉండాలి. డబ్బు ఆశ ఉండకూడదు. ఇది ఎంత రాకెట్ కాలమైనా.. విలువల విషయంలో రాముడికాలమే. కాబట్టి కుటుంబవిలువల విషయంలో రాముడిలా వ్యవహరించాలి. ఏకపత్నీవ్రతుడు అనే క్వాలిటీ కంపల్సరీ’ అంటుంది నవ్వుతూ!
తారకరాముడు
Published Sat, Mar 28 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 PM
Advertisement