
పవన్‌కళ్యాణ్‌తో నటించాలనుంది: రకుల్ ప్రీత్ సింగ్
సినిమాల్లో బిజీ వల్ల గోల్ఫ్ ఆడటమే మరిచిపోయానని గారాలు పోతోంది ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఫేం రకుల్ ప్రీత్ సింగ్. శుక్రవారం సాయంత్రం ఓ హోటల్ జరిగిన ‘టాక్సిఫర్ ష్యూర్’ కార్యక్రమంలో రుకుల్ సందడి చేసింది. బాలీవుడ్ కంటే నాకు తెలుగు పరిశ్రమే ఇష్టమంటున్న రకుల్ ‘సిటిప్లస్’కు పలు ముచ్చట్లు చెప్పింది. తాను జాతీయ స్థాయిలో గోల్ఫ్ ఆడానని, ఇప్పుడు సినిమాలతో ఆటకు దూరమయ్యానంది. తెలుగు సినిమా ప్రతి ఒక్కటి చూస్తానంటూ టాలీవుడ్‌పై తన అభిమానాన్ని ఒలకబోసింది.
పవన్‌కళ్యాణ్, బన్ని అంటే తనకు చాలా ఇష్టమని వారితో కలిసి నటించాలనుందని మనసులో మాట బయటపెట్టింది. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తున్నానని, తెలుగులో మాట్లాడటం కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానని చెప్పింది. బాలీవుడ్, టాలీవుడ్‌కు మధ్య కేవలం భాష మాత్రమే తేడా అని.. పరిశ్రమ ఏదైనా శ్రమ ఒక్కటేనని అభిప్రాయపడింది. రాత్రివేళల్లో టాక్సీలో ప్రయాణించేటప్పుడు మహిళలు చాలా అప్రమత్తంగా ఉండాలని రకుల్ జాగ్రత్తలు చెప్పింది. తాను చాలా సార్లు టాక్సీలో ప్రయాణించినా ఎలాంటి అవాంఛిత సంఘటన ఎదురుకాలేదని చెప్పింది.
- సుమన్