ఆ హీరోయిన్తో పోలీసులకు చిక్కిన వ్యక్తి ఎవరు? | who is involved with the heroine? | Sakshi
Sakshi News home page

ఆ హీరోయిన్తో పోలీసులకు చిక్కిన వ్యక్తి ఎవరు?

Published Sat, Sep 6 2014 3:03 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఇటీవల పోలీసులకు చిక్కిన ఓ హీరోయిన్ - Sakshi

ఇటీవల పోలీసులకు చిక్కిన ఓ హీరోయిన్

ఇటీవల ఓ వర్ధమాన హీరోయిన్ (కావాలనే పేరు రాయడంలేదు) ఒక స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికింది. మూడు నెలల పాటు ఆమెను రెస్క్యూ హోమ్‌లో ఉంచాలని  కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఆమెను రెస్క్యూ హోమ్‌కు తరలించారు.  తనకు సినిమాల్లో అవకాశాలు లేకపోవడం, మరో మార్గం లేక తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబ అవసరాల కోసం  ఇలా చేయవలసి వచ్చిందని ఆ హీరోయిన్ చెప్పింది. ఆమె పట్టుబడిన రోజు నుంచి ఆమె నటించిన సినిమాలలోని సన్నివేశాలతో ఆమెపై కథనాలు, పనిలో పనిగా అంతకు ముందు ఇటువంటి కేసులలో పట్టుబడిన నటీమణుల వివరాలు, వారు నటించిన చిత్రాలలోని కథనాలతో ఎలక్ట్రానిక్ మీడియా అదరగొట్టేస్తోంది.

 కుటుంబ అవసరాల కోసమో లేక కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యంపాలవడం వల్లనో లేక విలాసాలకు అలవాటుపడి వాటిని మానుకోలేక పలువురు నటీమణులు వ్యభిచార రొంపిలోకి దిగుతున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో ఓ హీరోయిన్ తన తల్లికి అనారోగ్యం అయినందున ఇందుకు సిద్ధపడినట్లు తెలిపింది. మరో నటి తన తండ్రికి అనారోగ్యం అయినందున ఈ వృత్తి కొనసాగిస్తున్నట్లు చెప్పింది. మరో నటి అవకాశాలు లేక, ఆర్థికంగా చితికిపోవడం వల్ల వ్యభిచారం చేస్తున్నట్లు తెలిపింది. ఏది ఏమైనా మన చట్టాల ప్రకారం వ్యభిచారం చేయడం నేరమే. అంతమాత్రాన ఈ నేరానికి ఇంత విస్తృత స్థాయిలో ప్రచారం ఇవ్వాలా? ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది.

ఇక ఇటువంటి కేసులలో విస్తృత ప్రచారం ద్వారా హీరోయిన్లు, యువతులే బలవుతుంటారు.ఆ విటులను పట్టించుకునేవారు ఉండరు. వారు ఎవరో కూడా ఎవరికీ తెలియదు. వారు అందరినీ 'మేనేజ్' చేసేస్తుంటారు. తమ పేరు బయటకు రాకుండా చాలా జాగ్రత్తపడుతుంటారు. వీరికి మధ్యవర్తులుగా వ్యవహరించేవారు కూడా ఏదోవిధంగా తప్పించుకుంటుంటారు.  ఇటీవల దొరికిన హీరోయిన్తోపాటు చిక్కిన వ్యక్తి ఎవరు? ఆ హీరోయిన్ ఆర్థికంగా చితికిపోయి చట్టప్రకారం తప్పే అయినా ఈ పనిలోకి దిగింది. హీరోయిన్ వద్దకు వెళ్లాడంటే ఓ స్థాయిలో డబ్బు ఇచ్చి ఉంటాడు. అంత డబ్బు ఇవ్వగలిగినవారు ఏ ఉన్నత అధికారి కొడుకో, ఏ వ్యాపారో లేక వ్యాపారి కొడుకో, ఏ రాజకీయ నాయకుడి కొడుకో అయి ఉంటాడు. అతని పేరు ఎందుకు బయటకు రాలేదు?. అతని ఫొటో ఎందుకు చూపించడంలేదు? అతను అందరినీ 'మేనేజ్' చేశారా? ఆ మధ్యవర్తి ఎవరు? ఇటువంటి విషయాలను ఆలోచించవలసి ఉంది.

మన చట్టాలు సహజీవనాన్ని అంగీకరిస్తున్నాయి. సహజీవనానికి నిర్వచనం ఏమిటి? కొందరు రెండేళ్లు, మరికొందరు ఏడాది, ఇంకొందరు ఆరు నెలలు సహజీవనం చేస్తుంటారు. మరీ బొరు కొట్టిన కొందరు ఒక నెల రోజులే సహజీవనం చేసి, విడిపోతుంటారు. అటువంటి సహజీవనంతో పోల్చుకుంటే వీరు నేరస్తులు అవుతారా? ఇటువంటి అంశాలను ఆలోచించవలసి ఉంది. స్త్రీ, పురుష సంబంధాలు- సహజీవనానికి సంబంధించి అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను గమనించి, భారతీయ సంస్కృతి  దెబ్బతినకుండా  అవసరమైతే చట్టాలను మార్చడానికి అవకాశం ఉందేమో ఆలోచించవలసిన అవసరాన్ని ఇటువంటిసంఘటనలు గుర్తు చేస్తున్నాయి.
- శిసూర్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement